కోరికను నిగ్రహించు.
కోరికను నిగ్రహించు.
కామము (మితి మీరిన కోరిక) చివరకు నాశనానికి దారితీస్తుంది. దాన్ని తీర్చడం ద్వారా ఎప్పటికీ జయించలేము. తీర్చేకొలదీ విజృంభించి చివరకు కోరేవాణ్ణి మింగివేస్తుంది. కాబట్టి కోరికను సాధ్యమయినంత తగ్గించుకోవాలి.
ఒకప్పుడు ఒక బాటసారి కల్పతరువు క్రింద కూర్చోడం తటస్థించింది. అతనికి విపరితమైన దాహం వేసింది. “చల్లని మంచినీరు దొరికితే బాగుండు” అనుకున్నాడు. వెంటనే అతని కోరిక తీరింది. ఒక చెంబుతో చల్లని మంచినీరు అక్కడ ఉంచబడింది. ఆశ్చర్యపోయిన బాటసారి ఆ నీరు గడగడా త్రాగేశాడు. తర్వాత షడ్రసోపేతమయిన భోజనం కోరుకున్నాడు. అది ప్రత్యక్షమయింది. చక్కగా భుజించాడు. ఒక మంచం, పరుపు, కాళ్ళు ఒత్తడానికి భార్యామణిని కోరు కున్నాడు. వెంటనే అవి లభించాయి. భార్య ప్రత్యక్షం కాగానే “ఈమె ఒక వేళ దయ్యం కాదు కదా?” అనుకున్నాడు.
ఆమె నిజంగానే దయ్యం అయింది. “తనను మ్రింగుతుందేమో” అనే ఆలోచన వచ్చింది. అది అక్షరాల అమలు జరిగింది.ఆ దయ్యం అతనిని మ్రింగింది. ఈ విధంగా కోరికలనే త్రాళ్ళు మానవుని బంధిస్తాయి. వాటి చిక్కుల్లో నుండి అతడు బయట పడడం కల. కనుక భగవంతునితో “నాకు ఏది వద్దు ప్రభూ! నీవే కావాలి అని కోరుకో, మనకు ఏది క్షేమకరమో అది ఆయనే ఇస్తాడు. భగవద్గీత శరణాగతిని బోధించింది. భగవంతుని ఇచ్ఛే జరగాలని కోరుకో, వాంఛలు పూర్తిగా విడనాడు.
ప్రశ్నలు:
- బాటసారి ఎక్కడ విశ్రాంతి తీసుకున్నాడు?
- అతడు ఏవి కావాలని కోరుకున్నాడు?
- ఈ కధలోని నీతి ఏమి?