జ్యోతి ధ్యానము
జ్యోతి ధ్యానము
“జ్యోతి ధ్యానము గురించి అనేక మంది గురువులు, శిక్షకులు అనేకరకాల కథనాలను, ప్రమాణాలను తెలియజేస్తూ ఉంటారు. కానీ నేను మీకు అత్యంత సార్వత్రికమైన, ప్రభావ వంతమైన పద్ధతిని తెలియజేస్తున్నాను. ఈ జ్యోతి ధ్యానము ఆధ్యాత్మిక సాధనలో మొదటి మెట్టు. ముందుగా ప్రతిరోజూ కొంత సమయాన్ని ధ్యానం చేయుటకు నిర్ణయించి, ధ్యానం చేయండి. ఆ తర్వాత మీరు అందులోని ఆనందాన్ని అనుభవించినప్పుడు ఆ సమయాన్ని పొడిగించండి. తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తము జ్యోతి ధ్యానం చేయుటకు ప్రశాంతమైన, ఉత్తమమైన సమయం అని గుర్తించండి. ఎందుకనగా బ్రహ్మ ముహూర్తమున అనగా నిద్ర తర్వాత శరీరము సహజముగా ధ్యాన ప్రవృత్తిని కలిగివుండును. దైనందిన వ్యవహారములు అప్పటికి మనసున ప్రవేశించి ఉండవు.
“మీ ముందు చక్కగా, నిలకడగా వెలుగుతున్న దీపమును గాని, కొవ్వొత్తిని గాని ఉంచుకొనవలెను. ఆ దివ్వె ముందు స్థిర సుఖాసనము నందు కూర్చుండి ఆ వెలుగును నిలకడగా కొంతసేపు చూడవలెను. ఆ తర్వాత కన్నులు మూసుకొని ఆ వెలుగు మనలో ఉన్నట్లు, కనుబొమ్మల నడిమి భాగములో వెలుగు చున్నట్లు భావించి అనుభవించుటకు ప్రయత్నించవలెను. దానిని క్రమముగా హృదయ పద్మము లోనికి ప్రసరింపచేసు కొనవలెను.”
మీ ముందు చక్కగా, నిలకడగా వెలుగుతున్న దీపమును గాని, కొవ్వొత్తిని గాని ఉంచుకొనవలెను. ఆ దివ్వె ముందు స్థిర సుఖాసనము నందు కూర్చుండి ఆ వెలుగును నిలకడగా కొంతసేపు చూడవలెను. ఆ తర్వాత కన్నులు మూసుకొని ఆ వెలుగు మనలో ఉన్నట్లు, కనుబొమ్మల నడిమి భాగములో వెలుగు చున్నట్లు భావించి అనుభవించుటకు ప్రయత్నించవలెను. దానిని క్రమముగా హృదయ పద్మము లోనికి ప్రసరింపచేసు కొనవలెను.
అప్పుడు జిహ్వ నుండి అసత్యము అంతర్థానమగును. ఆ వెలుగు కన్నులను, చెవులను స్పృశింప నీయవలెను. చూడకూడని వానిని చూడెడి వ్యామోహమును, వినకూడని వానిని వినెడి నిక్షేపములను ఆ వెలుగు అణచివేయును.ఆ వెలుగు మన మెదడును ప్రకాశింపచేసి దుష్టచింతనలను తొలగింప చేయును.ఆ కాంతి మనలో మరింత ప్రకాశించు చున్నట్లును, మరింత దట్టముగా వ్యాపించునట్లును, మన చుట్టును కాంతులీనునట్లును, మననుండి కాంతి వలయములుగా ప్రసరించునట్లును, మన ఆత్మీయులను చేరునట్లును, మన మిత్రులనే కాదు శత్రువులను, సర్వజీవులను, సర్వ ప్రపంచమును, విశ్వమును కూడా వ్యాపించు చున్నట్లును భావింపవలెను.అప్పుడు మన హృదయము విశాలమై, విశ్వమంతయు వ్యాపించి ప్రేమతో పొంగుచున్నట్లు దివ్యానుభూతిని పొందగలము.
ఈ విధంగా ప్రతిదినము క్రమబద్ధముగా, గాఢముగా అభ్యాసము చేయుట వలన ఆ వెలుగు మన ఇంద్రియములందు ప్రకాశించి అఙ్ఞానాంధకారమును తొలగించి, చెడుతలంపులను మాన్పును. చెడు తలంపులపై ఏవగింపు కలిగి, వాటిని రూపుమాపును. మత్తు పదార్థములకు, మరణమునకు దారితీయు మందులను సేవించుటను కూడా తొలగించును. జుగుప్సాకరమైన పనులను చేయుట కూడా తొలగించును. అపకీర్తిని, అనారోగ్యములు కలిగించు వ్యసనములను మాన్పును. పరులకు అపకారము చేయు ప్రవృత్తిని దూరం చేయును. కావున, సమస్త వస్తువులందు వెలుగును చూచెడి ఆ దివ్యమైన అనుభవ స్థితిలో మనము ఎల్లప్పుడూ నివసించుటకు ప్రయత్నించవలెను. సమస్త విశ్వమును వ్యాపించిన ఆ దివ్య జ్యోతిలో మనము మన ఇష్టదైవమును దర్శించుటకు ప్రయత్నించవలెను. ఎందుకనగా ఆ దివ్య జ్యోతియే దైవము. దైవమే ఆ దివ్య జ్యోతి.
ఈ విధంగా నేను చెప్పినట్లుగా క్రమం తప్పకుండా ఈ ధ్యానాన్ని ఆచరించండి. మిగిలిన సమయాల్లో భగవంతుని నామాన్ని జపించండి. భగవంతుని అపారమైన అనుగ్రహము, దయ మీపై ఉండేట్లుగా శ్రద్ధ వహించండి.
[శ్రీ సత్యసాయి వచనామృతం 10వ భాగము. శివరాత్రి దివ్యోపన్యాసము.1979]