మాతృమూర్తి ద్రౌపది

Print Friendly, PDF & Email
మాతృమూర్తి ద్రౌపది

పాండురాజు పుత్రులయిన పాండవులు తమ జీవితాంతం ధర్మమూర్తులై చరించారు. సనాతన ధర్మము బోధించిన ధర్మవర్తనము, పరాక్రమము, సచ్ఛీలము వీటిని వారు ఎటువంటి పరిస్థితులలోను విడువలేదు. వారికి సర్వదా కృష్ణుడు మార్గదర్శిగా ఉంటూ ఉండేవాడు. క్షమ, శాంతి, విధి నిర్వహణ పాండవుల ఉత్తమలక్షణాలుగా ఉండేవి. వారి ధర్మపత్ని ద్రౌపది కూడా వారికి సహధర్మచారిణి అన్న పేరు నిలబెట్టుకుంది.

కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులు ఒక్కరైనా మిగలక మరణించారు. మొదటినుండి కౌరవ పక్షంలో ద్రోణాచార్య పుత్రుడు అశ్వత్థామ పాండవులపై ప్రతీకార వాంఛతో కుతకుతలాడిపోతున్నాడు. అతడు కూడా ధనుర్విద్యలో గొప్పవాడే. కాని అర్జునుని ముందు అతడు నిలువ లేకపోయాడు. తన ప్రాణ మిత్రుడు దుర్యోధనుడు గూడా భీముని చేతిలో గదాయుద్ధంలో మరణించాడన్న వార్త విని, అశ్వత్థామ ఏ విధంగానైనా పాండవవంశాన్ని నాశనం చేయాలని సంకల్పించాడు. యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు ప్రశాంతంగా గుడారాలలో నిద్రిస్తున్నారు. అశ్వత్థామ దొంగవలె గుడారాలలో ప్రవేశించి ఉపపాండవులనే పాండవుల పుత్రులను, ఒక్కొక్కరిని తన కత్తికి ఎర చేశాడు. చివరిగా ఈ ఘోరకార్యం ముగించి పారిపోతుండగా పట్టుపడ్డాడు. అతన్ని తెచ్చి పాండవుల ముందు నిలబెట్టారు.

జరిగిన దారుణకాండ తెలిసి అందరు విచారించారు. “పాండవులు దుఃఖం పట్టలేక పోయారు. అశ్వద్ధామను ఎలా శిక్షించడం అనేది, గర్భశోకంతో కుమిలిపోతున్న ద్రౌపది కే వద లివేశారు. భీముడు ఆవేశంతో “పుత్రశోకంతో విలపిస్తున్న తల్లివి నీవు. నీకు ఉపశాంతి కలగడం కోసం నీ కళ్ళ ఎదుట ఇతనిని ముక్కలు ముక్కలుగా చీల్చివేస్తాను. అనుమతి ఇయ్యి” అని గర్జించాడు.

కాని ద్రౌపది చలించలేదు. కడుపులో అగ్నిగోళం బద్దలవుతున్నా పైకి ప్రశాంతంగా ఉంది. మూర్తీభవించిన శోక దేవతలా గంభీరంగా ఉంది. ఎంతో ఆవేదన కూడు కొన్న స్వరంతో అశ్వత్థామను దగ్గరకు పిలిచి “నా కన్న కొడుకులు నీ కేమి అపకారం చేశారు. నిద్రిస్తున్న పసికూన లను చంపి ఆచార్య వంశానికే అప్రతిష్ఠ తెచ్చావు. నీవు వీరుడ వా ? పరమ నీచుడివా ? నీ తండ్రి పాండవులకు విద్య నేర్పినవాడు. నీవేమో దొంగతనంగా మారి బిడ్డలను చంపిన హంతకుడివి?

ఇదంతా చూస్తున్న భీముడు, అర్జునుడు, ద్రౌపది ఎంత సహనంగా పుత్ర హంతకుడి తో మాట్లాడడం సహించలేక పోతున్నారు. కన్న కొడుకుల్ని అందరిని పోగొట్టు కొని ఆమె ఉన్మాదిని ని అయింది కాబోలు అనుకున్నారు. నిజంగా ఈమెలో మానవత్వం మరణించిందా అని ఆశ్చర్యపోతున్నారు. భరించలేక వారిద్దరు అశ్వత్థామను చంపడానికి సిద్ధమయినారు కాని ద్రౌపది వారిని వారించింది, “ఆర్యపుత్రులారా ఆయన్ను చంపకండి. పుత్రశోకం ఏమిటో నేను అనుభవిస్తు న్నాను. కనుక నాకు తెలుస్తున్నది. ఇతడు కూడా ఒక తల్లికి పుత్రుడే. ఇతన్ని చంపితే ఆ మాతృహృదయం ఎంతగా క్షోభిస్తుందో నేను అర్థం చేసుకోగలను. దుఃఖాన్ని పెంచుకుని పోవడం మనము చేయవలసిన పని కాదు. అతనిని వదలి పెట్టండి. తను చేసిన పనులకు తానే ఏనాటికయినా పశ్చాత్తాప పడతాడు”.

భీమునికి ఈ మాటలు నచ్చలేదు. ఆవేశంగా ఏదో చెప్పబోయాడు. ద్రౌపది అతనిని వారించి “పైగా ఇతడు మీ ఆచార్య పుత్రుడు. ఇప్పుడు మీ చేతుల్లో అసహాయుడుగా బందీగా ఉన్నాడు. అటువంటి వానిని చంపడం ధర్మం కాదు. శరణు కోరిన వానిని, నిద్రిస్తున్న వానిని, సురాపానం చేసిన మత్తులో ఉన్నవానిని చంపగూడదని ధర్మ శాస్త్రాలు చెపుతున్నాయి.”

ద్రౌపది సమబుద్ధికి, . విశాల హృదయానికి,ఓర్పుకు అందరూ ఆశ్చ్యపోయారు. తన భర్తలనే తన ధర్మ బుద్ధితో వారించగలిగిన మాతృమూర్తి ఆమె. తాను స్వయంగా పుత్ర శోకంతో కుమిలిపోతున్నా మరొక తల్లికి పుత్ర శోకం కలిగించగూడదన్న విశిష్ట ప్రవర్తన ద్రౌపదిది. కాబట్టి ఆమె ఒక ఆదర్శ మాతృ మూర్తిగా చరిత్రలో స్థానం సంపాదించుకుంది.

ప్రశ్నలు :
  1. అశ్వత్థామ ఉప పాండవులను ఎందుకు చంపాడు?
  2. అశ్వథ్థామను చంపగూడదని ద్రౌపది యెందుకు కోరింది?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: