స్వశక్తియే గొప్పది
స్వశక్తియే గొప్పది
ఒక రోజున సాయంకాలము చల్లగాలికి నలుగురు బాలురు ఒకచోటచేరి ఆటలాడుకుంటున్నారు. వారు ఒకమూలకు వచ్చేసరికి మెల్లగా శబ్దం వినిపిస్తోంది. అది ఏమిటా అని ఆలకిస్తే, “నన్ను త్రవ్వి బయటకు తీయండి. మీకు కావలసినవన్నీ నేనిస్తాను” అని మాటలు వెలువడ్డాయి.
నలుగురూ కలిసి కొంతసేపు త్రవ్వేసరికి ప్రకాశిస్తున్న ఒక లాంతరు కనుపించింది. “నేను అల్లావుద్దీన్ మాయా దీపాన్ని. మీకు నా గురించి తెలుసుగా! మీకేమేమి కావాలో అన్నీ నే నివ్వగలను. మీలో ఎవరెవ్వరికి ఏమి కావాలో చెప్పండి” అని ఆ లాంతరు పలికింది.
మొదటి బాలుడు “నాకు ఆటలంటే చాలా యిష్టం. ఒకబంతి, ఇంకా యింటిలో ఆటలాడుకొనే అన్ని వస్తువులు యివ్వు” అన్నాడు. రెండవవాడు “మా బడిలో పంతులుగారు నాకు యింటి దగ్గర చదువుకు రమ్మని పాఠాలిస్తున్నారు. అవన్నీ నీవు సిద్ధం చేసి వుంచు” అన్నాడు. ఇక మూడవబాలుడు “వీధిలో ముష్టెత్తుకుంటూ చాలా మంది కనిపిస్తున్నారు. వారందరికి కావలసినంత ధనాన్నిచ్చి సుఖంగా జీవించమని చెప్పు” అన్నాడు.
కానీ నాల్గవవాడు మాత్రం “ఓ మాయాదీపమా! నీవు మాకేమి యివ్వ నక్కరలేదు. నీవు వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపో, చాకచక్యంతో శ్రమించి పనిచేయడం కోసం భగవంతుడు మాకు కళ్ళూ, చెవులూ, నోరూ, ముక్కు, నాలుకా, చేతులూ, కాళ్ళూ అన్నీ ఇచ్చాడు. వాటిని సద్వినియోగం చేసుకొని, తద్వారా మేము సుఖంగా జీవించి మరికొందరికి ఉపయోగపడతాము. మానవుడు తన స్వశక్తిచేత జీవించడంలోనే గొప్పతనం వుంది. భగవంతుడనుగ్రహించిన శక్తి సామర్థ్యాలను ఉపయోగించక నిన్ను ముష్టి ఎత్తవలసిన అవసరమేముంది? అని అతి గంభీరంగా చెప్పాడు. ఆ మాయాదీపము అతని ధీశక్తికి మెచ్చి అదృశ్యమైనది.
ప్రశ్నలు
- మొదటి ముగ్గురు బాలురు కోరిన దానిలో తప్పేమిటి? ఒక్కొక్కరి గురించి నీ అభిప్రాయం వ్రాయుము.
- నాల్గవ బాలుని సమాధానం మాయాదీపానికి ఎందుకు నచ్చింది?
- ఆ మాయాదీపం నీ వద్దకు వచ్చి ఏమికావాలి అని అడిగితే నీవేమి కోరుకుంటావు?