రంజాన్ (ఈద్)

Print Friendly, PDF & Email
పండుగలు ప్రాముఖ్యత – రంజాన్ (ఈద్)

ఇస్లాం అంటే శాంతి, శరణాగతి అని అర్థము. భగవంతునకు శరణాగతులై తోటి మానవులతో నిరంతరము శాంతితో జీవించే సమాజం ఇస్లాం అని భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు రంజాన్ పర్వదిన సందేశంలో పేర్కొన్నారు.

ఇస్లాం మతంలో హజరత్ మహమ్మద్ 1400 సం.లకు పూర్వము అశరీరవాణిని “ఖుర్ ఆన్” రూపంలో పొందుపరిచాడు. దీనినే “ఖురాన్” అంటారు. “ఖుర్ ఆన్” లోని రెండు పదములు “సలత్” “జకాత్” లను రెండు నేత్రములుగా హజరత్ మహమ్మద్ నిరూపించాడు. “సలాత్” అనగా ప్రార్థన. “జకాత్” అనగా దాన ధర్మాలు. స్మరణ, ప్రార్ధన వీటిని ఆచరించే సమాజ ధర్మమునకే ఇస్లాం అని పేరు పెట్టారు. ఇస్లాం అనేది కేవలం ఒక మతమునకు సంబంధించినది మాత్రమే కాదు. దీనికి అరబీ భాషలో శరణు, శాంతి అని అర్థం. ఎవరు భగవంతునకు శరణాగతులై నిరంతర శాంతితో తోటి మానవులతో జీవించడానికి పూనుకుంటారో అట్టి సమాజమే ఇస్లాం.

హజరత్ మహమ్మద్ అల్లాను ప్రార్థన చేస్తున్న సమయంలో ఆయనకు కొన్ని శబ్దములు వినిపిస్తూ వచ్చాయి. తాను విన్న సుశబ్దములను హజరత్ మహమ్మద్ మక్కాలో శబ్ద సంభాషణల క్రింద చాటుతూ వచ్చాడు. కాని అక్కడ అతనిని చాలామంది నానా కష్టములు పెట్టి చివరికి అతనిని మక్కా నుంచి తరిమి కొట్టారు.ఎన్ని హింసలు పెట్టినప్పటికి సత్యమే జయిస్తుందని, దైవమే రక్షిస్తాడని ఆత్మ నిరంతరము సుఖ స్వరూపమైనదని చివరి ఘటియ వరకు మహమ్మద్ బోధిస్తూ వచ్చాడు. అట్టి మహమ్మద్ సూక్తులను ఆచరణలో పెట్టి దివ్యస్థానమును పొందే నిమిత్తమై రంజాన్ ఉపవాస దీక్షను మహమ్మదీయులు స్వీకరించారు. ఇస్లాం మతమునకు చంద్రుడు, నక్షత్రము ప్రధానమైన చిహ్నము. ముస్లిం కాలమానము నందలి తొమ్మిదవ మాసమునకు ‘రంజాన్’ అని పేరు. రంజాన్ నెల ఆరంభము నాటి నుండి ఉపవాస దీక్షను ముస్లింలు ప్రారంభించెదరు. పదవ నెల మొదటి రోజున ఉపవాస దీక్షను విరమించెదరు. విరమణ రోజు జరిపే పండుగకే ‘రంజాన్’ అని పేరు. ఈ రంజాన్ సమయంలో దూరపు బంధువులంతా చేరుతుంటారు. ద్వేషమున్న వారంతా ఏకమై పోతుంటారు. ఇదంతా కూడ మానవత్వ ఏకత్వాన్ని నిరూపించడం కోసం జరుగుతుంది. ఇందుకు మసీదు ఒక కేంద్రంగా ఉంటుంది.

ఈ రంజాన్ దీక్ష ఇస్లాంకు మాత్రమే పరిమితమైనది కాదు. హిందువులు మాఘ మాస వ్రతమని , శ్రావణమాస వ్రతమని పాటిస్తూ వస్తారు .అదే విధంగా పర్షియన్ మతము , జోరాష్ట్ర మతము, క్రైస్తవ మతము నందు కూడా ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క ఉపవాస దీక్షను అనుసరిస్తున్నారు.

దేహ జీవ తత్వాలను విసర్జించి ఆత్మ తత్వాన్ని సుస్థిరముగా నిలుపు కోవడమే అమరత్వమునకు చిహ్నమని ఈ రంజాన్ దివ్య సందేశం. అనిత్యములైన దేహ భావములను, జీవ తత్వాన్ని సాధ్యమైనంత వరకు అదుపులో పెట్టుకొని, సత్యమైన ఆత్మతత్వాన్ని ప్రకటింపజేయడానికి తగిన కృషి చేయడమే రంజాన్ అంతరార్థము. దీనిని గుర్తించి నేటి నుండి ఏ మతమైన, అన్నీ సమత్వాన్ని గురించి చెప్పేవే కనుక అందరు ప్రేమను, సహనాన్ని, సానుభూతిని, సత్యమును ప్రకటించు కోవాలని, స్థిరమును చేసుకోవాలని బాబా వారు రంజాన్ పర్వదిన సందర్భముగా ఉద్భోదించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: