సమత్వ బుద్ధి
సమత్వ బుద్ధి
జనక మహారాజు మహాజ్ఞాని అని పేరు పొందాడు. రాచరికపు వ్యవహారాలు చూచుకుంటూ గృహస్థుగా జీవితం కొనసాగిస్తూ
కూడా, ఆయన మనస్సు భగవంతుని మీదే ఉండేది.
మిధిలా నగరానికి దగ్గరలో ఉన్న ఒక వనంలో శుక మహర్షి తన శిష్యులకు ఒకసారి ఆధ్యాత్మిక విషయాలు బోధిస్తున్నాడు. జనకుడు తాను కూడా ఆ మహర్షికి శిష్యుడై ఆయనవద్ద ఎన్నో విషయాలు నేర్చుకోవలెనని అనుకొని వనానికి చేరుకొని, శుక మహర్షికి నమస్కరించి, తనను కూడా శిష్యులతో నేర్చుకోడానికి అనుమతి ఇవ్వమని కోరాడు. శుకమహర్షి అనుమతి ఇచ్చాడు.
ఆనాటినుండి జనక మహారాజు ప్రతిదినం అక్కడ హాజరవుతూ శిష్యుడుగా ఉండేవాడు. ఒకనాడు జనకుడు రావడం ఆలస్యమయింది. శుకమహర్షి అతని రాకకోసం ఎదురు చూస్తూ పాఠం ప్రారంభింపలేదు. “జనకుడి కోసం ఎదురు చూస్తున్నాను” అని తన శిష్యులకు చెప్పాడు. అది విని శిష్యులు తమలోతాము గుసగుస లాడుకోవడం ప్రారంభించారు. “ఈ మహర్షి రాజులు, చక్రవర్తులంటే ఏ విధమైన ప్రత్యేక అభిమానం చూపించడని అనుకొని వీరివద్ద పాఠాలకు చేరాము. కాని అందుకు భిన్నంగా రాజులంటే ఏదో ప్రత్యేక అభిమానం చూపిస్తున్నారు” అని అనుకున్నారు. ఆనాట నుండి వారికి శుకుడంటే కొంచెం తేలిక భావము, జనకుడంటే అసూయ ఏర్పడ్డాయి.
శుకమహర్షి తన శిష్యుల మనోభావాలను గుర్తించాడు. వారికి తగిన పాఠం నేర్పాలనుకున్నాడు. ఒకనాడు పాఠం జరుగుతున్నది. జనకుడు, ఇతర శిష్యులు శ్రద్ధగా వింటున్నారు. ఇంతలో దూరంగా కలకలం వినబడింది. మిధిలా నగరానికి నిప్పు అంటుకున్నట్లు అంతా తగలబడుతున్నట్లు కనుపించింది. శిష్యులందరికి మనస్సు చెదిరిపోయింది. తమ ఇళ్ళు ఏమవుతాయో, బంధుమిత్రులు ఏమవుతారో తమ వస్తువులు దక్కుతాయో లేదో అని ఆదుర్దా పడసాగారు. కాని జనకుడు మాత్రం నిశ్చింతగా కూర్చొని శ్రద్ధగా వింటున్నాడు.
శుకుడు, “రాజా! మంటలు రాజప్రాసాదం అంతా వ్యాపించినట్లున్నాయి? నీవు వెళ్ళి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కదా!” అని హెచ్చరించాడు. కాని జనకుడు చిరునవ్వుతో “భగవంతుని అనుగ్రహం ఏవిధంగా ఉంటే అది జరుగుతుంది. దానిని ఎవరూ మార్చలేరు. అనవసరంగా నేను చింతకు లోనుకావడం దేనికి?” అని అన్నాడు.
కాని ఇతర శిష్యులకు మనసు నిలవక నగరంలోకి పరు గెత్తారు. కాని వారికి కనుపించింది అంతా మిధ్య. నిప్పు లేదు, మంటలు లేవు, అంతా శుకుడు కల్పించినదే. వారు తిరిగి వనానికి వచ్చి శుకునితో అంతా నివేదించారు. నిశ్చింతగా జనకుడు కూర్చొని ఉండడం చూచి ఆయన సమబుద్ధికి, నిశ్చల స్వభావానికి వారు ఆశ్చర్యపోయారు. శుక మహర్షి “ ఇటువంటి శిష్యుడు ఒకడైనా చాలు, మీలాంటి చంచల స్వభావులు ఎంతమందైనా ఏమి ప్రయోజనం?” అని వారిని మందలించాడు.
ప్రశ్నలు:
- జనకుడంటే శిష్యులకు అసూయ ఎందుకు కలిగింది?
- శుకుడు శిష్యులకు నిజం ఏవిధంగా తెలియపర్చాడు?
- జనకుడు ఏం చేశాడు?
- సమబుద్ధి అనగా నేమి?
- శిష్యులు ఎలా ప్రవర్తించారు?