రూప ధ్యానము- Description-te
రూప ధ్యానము
అభయ హస్తంతో నిలబడిన బాబా గురించి ధ్యానము చేయండి. ఆయన శిరస్సు చుట్టూ ఉన్న గుండ్రటి, మెత్తటి తల వెంట్రుకలను పరిశీలించండి. ఆయన ముఖము నల్లటి మబ్బులు చుట్టుకున్న పూర్ణ చంద్రుడిలాగా కనిపిస్తుంది. ఆయన ప్రత్యేకమైన, ఆకర్షణీయమైన చూపులు సూటిగా మన హృదయాలను స్పృశిస్తాయి. ఆయన పరవశింపచేసే చిరునవ్వుతో మనలను పలకరిస్తారు. భక్తుల అవరోధాలను తొలగించి ప్రపంచ భారాన్ని మోసే ఆయన భుజస్కందాలను గమనించండి. బాబా కుడి చేయి అభయముద్రతో కనిపిస్తుంది. అభయం అంటే భయం లేక పోవుట. నేనుండగా భయం ఎందుకంటారు బాబా. మనలను ప్రోత్సహించి, దారి చూపి కాపాడుటకు బాబా సదా సంసిద్ధులు. అనంత దయాసాగరుండు అయిన బాబా అందరికీ రక్షకుడు. బాబా తీయని మాటలు వినండి. చెడుకు దూరంగా, మంచికి దగ్గరగా సన్మార్గంలో బ్రతకండి. శాంతిని, సంతోషాన్ని, ప్రశాంతతను పెంచి, సత్యము, ప్రేమ, అహింస, ఓర్పు, సహనము మున్నగు సుగుణాలను అలవరచుకోవాలి అని బోధిస్తారు.
బాబా పాద పద్మాలపై శిరస్సు ఉంచి ఓ జగన్నాధా! మీ పాదాలు తాకిన మా చేతులను దూరం చేయకండి. మీకు మ్రోకరిల్లిన మా తలలు ఈ దుర్మార్గపు భౌతిక వాంఛలయందు మ్రోకరిల్లికుండా కాపాడండి. మీ పాదాల నుంచి మా చూపులు మరలనీయకండి. దేవా! మా శూన్యపు హృదయాలను మీ గృహంగా మార్చుకోండి. మా హృదయంలో ప్రవహించే ప్రతి రక్తపు బిందువు మీ స్పర్శతో పునీతం కావాలి. అప్పుడే మేము చూసేది, మాట్లాడేది, వినేది, చేసేది సర్వం సత్యం, శివం, సుందరంగా మారుతుంది. ఓ దేవా! మా ధ్యానంలోను, మా ఆలోచనలలోను నీవే ఉండాలి. ఓ దేవా! మా కనులలోను, మా చూపులోను నీవే ఉండాలి. ఓ దేవా! మా చెవులలోను, మా వినికిడి లోను నీవే ఉండాలి. ఓ దేవా! మా నోటి మాటలలోను నీవే ఉండాలి. ఓ దేవా! మా హృదయాలలోను, మా కోరికలలోను నీవే ఉండాలి. ఓ దేవా! మా శరీరంలోను, మా చేతలలోను నీవే ఉండాలి. మమ్ములను మీ పవిత్రమైన బిడ్డలుగా మార్చండి. ప్రపంచమంతా మీరే కనిపించాలి. మాకు అప్పుడు శత్రువులు ఉండరు. అసూయ ఉండదు. మీరే మేము, మేమే మీరు అయి ఉంటాము.