క్షమించు – సేవించు
క్షమించు – సేవించు
ఆ రోజుల్లో మహమ్మద్ ప్రవక్త ఇస్లాం మతము గురించి ప్రపంచానికి చాటి చెబుతున్నాడు. మానవుల మధ్య ఉండవలసిన పరస్పర ప్రేమ, ప్రార్థన, సత్యము, శాంతిని గూర్చి బోధిస్తున్న భగవదాంశ సంభూతుడు ఆయన. ఇస్లాం మతాన్ని బోధించడం ప్రారంభించగానే, అంతవరకు వారు అనుసరిస్తున్న మూఢ నమ్మకాలను విడిచిపెట్టలేని చాలామంది అతన్ని వ్యతిరేకించారు. వారి అజ్ఞాన ప్రభావంచేత కొంతమంది అతనితో ఏకీభవించలేదు.
అతడార్జిస్తున్న కీర్తిని చూచి ఓర్వలేక అసూయతో అలమటిస్తున్నారు కొందరు. అటువంటి వారిలో కొందరు మహమ్మద్ గురించి కట్టుకథలు కల్పించి అతనంటే అసహ్యించుకునేటట్టు ప్రచారం చేస్తున్నారు. మరి కొంతమంది అతన్ని ఎదుర్కొని ఎలాగైనా అపకారం చేయాలని పన్నాగాలు పన్నుతున్నారు. అటువంటివారిలో ఒకరు ఆ అరబ్ దేశంలో ఉండే ఒక వృద్ధురాలు. రోజురోజుకు మహమ్మద్ కు శిష్యులు పెరగటం ఆమె కెంతో కన్నెర్రగా ఉండేది. అతనిపై ఆమెకు ద్వేషం, అసూయ అంతకంతకూ పెరిగి ఆపుకోలేకపోయింది. మహమ్మద్ ప్రతి రోజు మసీదుకు తన ఇంటి ముందు నుంచే వెళతాడని తెలిసింది. ఆ సమయంలో అతన్ని అవమానపరుద్దామని ఆలోచించింది. ఆమె తన ఇల్లు తుడిచిన దుమ్ము, ధూళిని ప్రోగుచేసి పెట్టుకొని సిద్ధంగా ఉంది.
మరునాటి ఉదయమే మహమ్మద్ ఆ దారినే మశీదుకి వెళుతున్నాడు. ఆమె గబగబా తన మేడ పైభాగం మీదికి ఎక్కి తను పోగుచేసి పెట్టుకొన్న దుమ్ము, ధూళి మహమ్మద్ నెత్తిమీది పోసి, పకపకా నవ్వుతూ ఆనందంతో కేరింతలు కొడుతున్నది. “అదే విధంగా ప్రతీరోజు నీకు శాస్తి చెస్తాను” అని అనుకున్నది. పాపం! మహమ్మద్ పైనుంచి తలమీద, భుజాల మీద పడ్డ దుమ్మును దులుపుకొంటూ కనీసం వెనక్కి తిరిగైనా చూడకుండా తన దారిన తాను వెళ్ళిపోయాడు. నిశ్చలంగా మసీదుకు చేరి తన ప్రార్థన తాను చేసుకునే వాడు.
ప్రతీరోజు ఉదయం ఆమె అదే విధంగా చేసేది. పాపం! మహమ్మద్ దులుపుకొంటూ మసీదుకి వెళ్ళిపోయేవాడు. కనీసం తలయెత్తి చూడనైనా చూసే వాడుకాదు. పల్లెత్తుమాట కూడా అనేవాడు కాదు. అతను ఆమె గురించి అసలు ఏమియు పట్టించుకునేవాడు కాదు. ఏమీ జరుగని వానిలా వెళ్ళిపోతూఉంటే ఆమెలో | ఉక్రోషం పెరిగింది. ప్రతీరోజు అదేపనిగా అలా చేస్తూనే ఉంది.
ఒక రోజు ఉదయం ప్రార్థనకు వెళుతూవుంటే ఆ ప్రదేశానికి వచ్చేసరికి దుమ్ము పడలేదు. ప్రతీరోజు పడుతున్న దుమ్ము ఆ రోజు పడకపోయేసరికి మహమ్మద్ కి చాలా ఆశ్చర్యం వేసింది. అట్లా వరుసగా మూడురోజులు జరిగింది. మామూలు మనిషైతే అలా జరుగనందుకు తప్పక సంతోషించి ఉండేవాడు. కాని మహమ్మద్ కి ఆవేదన బయలుదేరింది. “ఏమి జరిగిందబ్బా! ఈ మూడు రోజుల నుంచి దుమ్ము పడడంలేదు. నా శిష్యులకిది తెలిసి ఏమన్నా వారికి అపకారం తలపెట్టారా? అసలు ఏమై ఉంటుంది” అని తనలో తాననుకొన్నాడు. ఉండబట్టలేక ఏం జరిగింది తెలుసుకొందామని నెమ్మదిగా లోపలికి వెళ్ళాడు. అక్కడ ఎవ్వరూ లేరు. నెమ్మదిగా మెట్లు ఎక్కి మేడమీదకు వెళ్ళాడు. అక్కడా ఎవరూ కనిపించలేదు. అక్కడ ఒక గది కనిపించింది. ఆ గది తలుపులు చేర వేసి వున్నాయి. కానీ లోపల నుంచి ఏదో మూలుగు వినిపిస్తుంది. వెంటనే తలుపు తట్టాడు. “రండి లోపలికి” అంటూ అతినీరసంగా ఒకమాట వినిపించింది. తలుపు తోసుకొని లోపలికి వెళ్ళాడు. ఒక వృద్దురాలు మంచంమీద మూలుగుతూ,చాలా నీరసంగా కనిపిస్తున్నది. శరీరం ఆమె స్వాధీనంలో లేదు. ఆమెను సమీపించి “అమ్మా! ఏమిటలా ఉన్నావు? నీ అనారోగ్యానికి కారణమేమిటి? నీవు ఏమన్నా మందు తీసుకుంటున్నావా, లేదా?” అంటూ ఎంతో అనురాగంతో పలుకరించాడు. “నాకు ఎవ్వరూ తోడులేరు నాయనా! నేను ఇంట్లో ఒక్క దానినే వుంటాను.నాకు ఏదైనా కావలసివస్తే అతి కష్టంమీద లేచివెళ్ళి తెచ్చుకొంటున్నాను” అని అతి దీనంగా అంది.
మహమ్మద్, ఎంతో శ్రద్ధగా గత మూడురోజులుగా జరిగిందంతా తెలుసుకొన్నాడు. రోగం వివరాలు కనుక్కొన్నాడు. ఇప్పుడే వస్తానని చెప్పి బయటకు వెళ్ళి, కాస్సేపటికి చేతిలో ఒక సీసా పట్టుకొని తిరిగివచ్చాడు. మూత విప్పి ఒక చిన్న కప్పులో ఆ మందు పోస్తూ “చూడమ్మా! నీవేమీ భయపడకు. రెండు మూడు రోజుల్లో, నీకీ రోగం నయమవుతుంది. నేను వైద్యుణ్ణి అడిగి ఈ మందు తెచ్చాను. దీనిని రోజుకు మూడు పూటలా పుచ్చుకో” అని చెప్పి ముందుపోసి ఆమె చేతికిచ్చాడు. ఆమెకు కళ్ళవెంట నీళ్ళు కారాయి. అతని హృదయ పవిత్రతను ఎంతో కొనియాడింది.
“ఇతని సహనం, ప్రేమ, క్షమా ఎంత గొప్ప వో చెప్పనలవికాదు” అని తనలో తాననుకొంది. తాను చేసిన తప్పుకి ఎంతగానో చింతించింది. పశ్చాత్తాపంతో కృంగిపోయింది. గొంతుక తడబడుతూ ఉంటే “నీవు నిజంగా దైవాంశ సంభూతుడవు. నా పాపానికి భగవంతుడు నన్ను క్షమించడు. నన్ను మన్నించి నేను తరించడానికి మంచి మార్గం చూపించమని” వేడుకొంది “అమ్మా! అనవసరంగా ఆవేదనపడకు. భగవంతుడు సర్వశక్తి సంపన్నుడు. సర్వజ్ఞుడు. అతడు సర్వవ్యాపి. అతనెప్పుడూ నీ వెంట ఉన్నాడన్న విశ్వాసాన్ని దృఢం చేసుకో. పూజా పునస్కారాలకు ఆయన ప్రసన్నుడుకాడు. సర్వజీవుల యెడల నిస్వార్ధ ప్రేమతోకూడిన ప్రార్ధనకు లోబడుతాడు. క్షమ, దయ, దానం, సేవ, స్వార్థ త్యాగమువంటి మంచి లక్షణములను అలవరచుకొంటే, భగవంతునికి ప్రీతిపాత్రులము కాగలము” అని ఉపదేశించాడు.
ప్రశ్నలు
- అరబ్బు వృద్ధురాలు చేసిన అవమాన మేమిటి?
- మహమ్మద్ ఆమెకు ఉపదేశించిన దేమిటి?
- భగవంతునికి ప్రీతిపాత్రుల ఎట్లు కాగలము?
- ప్రవక్తలను ఎందుకు గౌరవిస్తారు?