తోటివారియెడ సానుభూతి
తోటివారియెడ సానుభూతి
నీ ఒంటి రంగు కాక వేరు రంగుకలవారిని నీవు చూచావా? ప్రపంచంలో నల్లటి చర్మంగలవారు, గోధుమ రంగు చర్మంగలవారు, తెల్లటి చర్మంగలవారు, ఈ విధంగా వివిధ వర్ణాలతో పుట్టిన వారున్నారు. ఒకరి చర్మం రంగు ఒక విధంగా ఉండి, మరొకరిది వేరుగా ఉంటే వీరికన్నా వారు గొప్పవారా? కాదు అందరు ఒకటే.
ఈ విషయంలో మానవాళికి సద్బోధలు చేసిన జీససు మాటలు విందాము. అందరియెడ మనము ప్రేమ భావంతో ఉండాలి. ఒకడు ఏ దేశంలో పుట్టాడు? ఏ జాతికి చెందినవాడు. అతని శరీరం రంగు ఏమిటి? అన్నది ముఖ్యముకాదు.
ఒకనాడు ఒక యూదుడు జీససును గట్టి ప్రశ్నే అడిగాడు. (అతని ఉద్దేశంలో జీససుకు సరియైన సమాధానం తెలియదని) “నేను అమరజీవి కావాలంటే ఏమి చేయాలి?”
జీససుకు ఈ ప్రశ్న ఒక లెక్క లోనిదికాదు. కానీ సూటిగా తానే జవాబియ్యక ఆ యూదునే అడిగాడు “మనము ఏమి చేయాలని భగవంతుడు శాసించాడు?”
యూదు జవాబిచ్చాడు. “భగవంతుని శాసనం ఏమంటే దేవుడైన యెహోవాను హృదయ పూర్వకంగా ప్రేమించు, నీతోటి వారిని నీతో సమానంగా నే భావించి ప్రేమించు”
ఇది విని జీసస్ అన్నాడు, “సరియైన జవాబు చెప్పావు. ఇదే నీవు ఆచరించు, అమరజీవివి అవుతావు”
కాని యదునికి ప్రతివారిని తనతో సమానంగా భావించి ప్రేమించడం ఇష్టం లేదు. ఏదో విధంగా తప్పించు కోడానికి మార్గం వెదుకుతున్నాడు. అందుకని జీససును అడిగాడు “నిజంగా నా ప్రక్కనున్న వాడు ఎవడు?” జీససు జవాబు “నీ స్నేహితులే నీ ప్రక్కనున్న వారు” అని ఉంటుందని యూదుడు ఊహించాడు. కాని ఇతరుల మాటేమిటి. వారు నీ తోటివారుకారా?”
జీససు ఈ ప్రశ్నకు జవాబుగా ఒక కథ చెప్పాడు.
ఒక వ్యక్తి జెరూసలెం నుండి జెరికోకు ప్రయాణం చేస్తున్నాడు. అతడు ఒక యూదుడు. దారిలో దొంగలు అతన్ని చుట్టుముట్టి ఉన్న సొమ్ము, బట్టలు లాక్కుని అతనిని చితక బాది దారి ప్రక్కన పడవేసి వెళ్ళిపోయారు. కొంత సేపటికి ఒక ఆచారవంతుడు ఆ దారిన వచ్చాడు, అతడు ఒక ‘నేవెట్’. జెరూసలెంలో దేవాలయంలో పని చేస్తున్నాడు. అతడు దుస్థితిలో ఉన్న యూదుని చూచి ఆగాడా? ఆగలేదు. తనదారిన తాను పోయాడు.
మరి కొంత సేపటికి ఒక మత ప్రచారకుడు వచ్చాడు. అతడు కూడా ఆగలేదు. చూచి చూడనట్లు వెళ్ళిపోయాడు.
చివరకు ఆ దారిన ‘సమరిటన్’ ఒకడు వచ్చాడు. చావు బ్రతుకుల్లో ఉన్న యూదుని చూచాడు. యూదులు, సమరిటనులు ఒకరి కొకరు బద్ధశత్రువులు కాని ఈ సమరిటన్ తనకేమీ పట్టనట్లు ఉంటాడా? “నేనెందుకు యూదునికి సహాయం చేయాలి? నాకు ఆపద వస్తే యూదుడు సహాయం చేస్తాడా?” అని అనుకుంటాడా?
కానీ ఈ సమరిటను అటువంటివాడు కాదు, ఒంటె మీదనుంచి దిగాడు. యూదుని వద్దకు వెళ్ళాడు. గాయాలు తడిమి చూచాడు. వీటిపైన కొంత నూనె, సారాయి పోసి, గుడ్డతో కప్పాడు. నెమ్మదిగా యూదుని లేవదీసి తన ఒంటె పై పడుకోబెట్టాడు. అతనితో ప్రయాణం చేసి ఒక సత్రం వద్దకు వచ్చాడు. అక్కడ యూదుని ఒక గదిలో పరుండబెట్టి తేరుకునే వరకు ఉపచారాలు చేశాడు.
ఈ కధ చెప్పి జీససు అడిగాడు “ఈ ముగ్గురిలో నిజమైన మిత్రుడు ఎవరు?
మతాధికారా? ఆచారవంతుడా? సమరిటనా?”
యూదుడు జవాబు ఇచ్చాడు. “సమరిటన్ నిజమైన మానవుడు, మిత్రుడు.”
జీససు అన్నాడు. అవును “మంచిది నాయనా నీ దారిన నీవు పోయి దీనిని పాటించుము.”
(లూకా – 10: 25–37)
ఈ కధ నుంచి మీరు ఏమి గ్రహించారు?
ఎవరైనా ఆపదలో ఉన్నట్లు మీరు చూస్తే ఏమి చేస్తారు? అతడు ఏ దేశంవాడా. ఏ రంగువాడా? నీ రంగు అతనిరంగు వేరుకదా? అని అలోచిస్తారా? లేక అతనికి
సహాయం చేస్తారా? నీవు స్వయంగా చేసే స్థితిలో లేకపోతే మరొకరిని పిలిచి అతనికి సహాయం అందించు. మంచి సమరటనుగా ప్రవర్తించు.
ఇదే జగద్గురువు జీససు చెప్పింది.
ప్రశ్నలు:
- జీవసును అడిగిన ప్రశ్నఏది?
- భగవంతుని శాసనమేమి?
- యూదుని కి ఏమి జరిగింది?
- యూదుడు ఆపదలో ఉన్నప్పుడు మతాధికారి , లేవట సరిగా ప్రవర్తించారా?
- నిజమైన మిత్రుడెవరు?
- సమరిటన్ మంచి మిత్రుడు ఎలా ఐనాడు?