మంచి నాలుక – చెడు నాలుక

Print Friendly, PDF & Email
మంచి నాలుక – చెడు నాలుక

King notices GOOD TONGUE model

ఒకానొక రాజు తన ప్రజలు ఏం చేస్తే ఆనందిస్తారా అని ఆలోచించి ఒక వస్తు ప్రదర్శన ఏర్పాటు చేశాడు. ఆ ప్రదర్శనలో మానవులకు ఆనందం కలిగించే వస్తువులు ప్రదర్శించమని వాటిలో అన్నింటికన్న మంచిదానికి బహుమతి ఉంటుందని చాటింపు వేయించాడు. ప్రదర్శన చూడడానికి రాజు స్వయముగా వచ్చాడు. ప్రజలు వరుసలు వరుసలుగా ఎన్నో ఆహ్లాదకరమైన వస్తువులు, పూలు, పండ్లు మిఠాయిలు, దుస్తులు, ఆభరణాలు, పుస్తకాలు, సంగీత వాయిద్యాలు, కళాఖండాలు ఇలాంటివి కళ్ళు మిరుమిట్లు గొలిపేటట్లు ఏర్పాట్లు చేశారు. ఇవన్నీ చూసిన రాజుకు ఏదీ నచ్చలేదు. వీటిలో ఏ ఒక్కటి కూడా మానవునికి నిజమైన ఆనందం కలిగించలేనివని ఆయనకు అనిపించింది. చిట్టచివరకు ఆయన దృష్టి బంకమన్నుతో ఎంతో చక్కగా తయారు చేసిన ఒక నోరు బొమ్మ, దానిలో ఒక నాలుక వున్న నమూనా మీద పడింది. నాలుకను ఒక దీనావస్థలో ఉన్న బీదవానితో మాట్లాడుతున్నట్లు చూపించారు. ఆ బొమ్మకు “మంచి నాలుక” అని వ్రాసి ఉంచారు.

రాజు నమూనా తయారు చేసిన పనివాని కోసం కబురు పెట్టారు. అటువంటి నమూనాను ఎందుకు పెట్టావని అతనిని అడిగాడు. దానికి అతడు “ప్రభూ! మిగిలిన వస్తువులన్నీ ఏ కొంత సేపో ఆనందంలో ముంచెత్తవచ్చు. కానీ నాలుకతో కొన్ని నిముషాలైనా మంచి మాటలు మాట్లాడితే వినేవారికి అవి ఎంతో సంతోషాన్ని, మరచిపోలేని ఆనందాన్ని కలుగజేస్తాయి. ఎంతో బాధలతో ఉన్నవారు కూడా మంచిమాటలతో ఊరట చెంది బాధలు మరచిపోతారు. కాబట్టి నా దృష్టిలో మంచి నాలుకను మించిన మంచి వస్తువు ఈ భూమిలో లేదని భావించి ఈ ప్రదర్శనలో పెట్టాను” అని అన్నాడు. రాజుకు మహదానందం కలిగి వెంటనే ఆ పనివానికి ఒక సంచి నిండా బంగారు నాణాలు బహూకరించాడు.

King notices BAD TONGUE model

మళ్ళీ కొన్నాళ్ళకు రాజుకు మరో ఆలోచన వచ్చింది. మానవులకు ఎక్కువ బాధ కలిగించే వస్తువు ఏముంటుందా అని అనుకొని అటువంటి వస్తువులకు ఒక ప్రదర్శనను ఏర్పాటు చేశాడు. మళ్ళీ ప్రదర్శన నిండా వరుసలు వరుసలుగా వస్తువులు చేరాయి. కత్తులు, కఠారులు, తుపాకులు, ముళ్ళు, రాళ్ళు, కొరడాలు, విష జంతువులు, చేదైన ఘాటైన కాయలు, పండ్లు, సారాయి మొదలైనవి ఉన్నాయి. మళ్ళీ రాజు వచ్చి స్వయంగా చూశాడు. కాని ఆయనకు ఇవేవి నచ్చలేదు. మళ్ళీ ఆయన దృష్టి ఒక నమూనా మీద పడింది. అది ఒక నోరే, కాని ఈ మారు దానిలో ఒక నాలుక వికృతంగా బయటకు వచ్చి దీనావస్థలో ఉన్న ఎవరినో కసరుకున్నట్లు ఉంది. ఆ బొమ్మకు “చెడు నాలుక” అని వ్రాసి ఉంచారు.

రాజుగారు నమూనా తయారు చేసిన పనివాని పిలిపించి “ఏమయ్యా, మంచి వస్తువులలో నాలుకను పెట్టి బహుమతి తీసుకున్నావు. మళ్ళీ నాలుకను పెట్టావు ఎందుకని?” అని అడిగారు. దానికి అతను “ప్రభూ! ఒక మానవుని సుఖ సంతోషాలను నాశనము చేయడంలో చెడు నాలుకను మించిన సాధనము లేదని నా అభిప్రాయము. చెడు నాలుక నుంచి వచ్చిన తూటాల వంటి మాటలు ఎటువంటి హృదయానికైనా మాయని గాయాన్ని కలిగించే శక్తిని కలిగి వుంటాయి”. దీనికి రాజు సంతోషించి, మళ్ళీ ఆ వ్యక్తికి సంచి నిండా బంగారు నాణాలు బహూకరించాడు. నీవు ప్రదర్శించిన నమూనా మిగిలిన వస్తువులన్నింటికన్నా మానవులకు మంచి గుణపాఠాన్ని నేర్పుతున్నాయి. “మనుష్యునికి మంచి నాలుకను మించిన మిత్రుడు, చెడు నాలుకను మించిన శత్రువు వుండడు అని అన్నారు.

ప్రశ్నలు:
  1. మంచి నాలుక కల్గిన వ్యక్తిని గురించి వివరింపుము. అతను ప్రతి ఒక్కరిని ఏ విధంగా సంతోష పెట్టగలడో తెలుపుము.
  2. చెడు నాలుక ఉన్న వ్యక్తిని గురించి వివరింపుము. అతను ప్రతి ఒక్కరిని ఎలా బాధ పెట్టగలడన్నది వివరింపుము.
  3. మంచి నాలుక గల వ్యక్తి ఇతరులను సంతోష పెట్టినటువంటి మరియు చెడు నాలుక కలిగిన వ్యక్తి ఇతరులను బాధపెట్టే నటువంటి ఒక ఉదాహరణను వివరింపుము.
  4. మీరు ఎల్లప్పుడూ మంచి నాలుక కలిగియున్నారా? లేని పక్షంలో ఎందుకు తెలుపుము.ఎల్లప్పుడూ మీరు మంచి నాలుక కలిగి ఉండాలి అంటే మీరు ఏమి చేయాలని అనుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *