లంకలో హనుమ

Print Friendly, PDF & Email
లంకలో హనుమ

Hanuman in Lanka

సముద్రాన్ని దాటే సమయంలో హనుమంతుడు ఎన్నో అడ్డంకులు ఎదుర్కోన్నాడు. కాని ధైర్యంతో, సమయస్ఫూర్తితో అవన్నీ ఎదుర్కొని లంకా ద్వీపం ఉత్తర తీరాన దిగాడు. అక్కన ఒక చిన్న పర్వతం మీద నిలచి ఇంక ఆ నగరాన్ని ఒక్కసారిగా కలియ చూసాడు. అత్యద్భుతంగా నిర్మింపబడి, అలంకరింపబడిన నగరం కళ్ళు మిరుమిట్లు గొలిపింది. నగర రక్షణ కు ఏర్పాట్లు దుర్భేద్యంగా ఉన్నాయి. తన సాధారణ రూపంతో ఈ నగరంలో పగటిపూట ప్రవేశించటం అసాధ్యం అనిపించింది.

అందుకని చీకటి పడనిచ్చి, తాను ఒక చిన్న వానరంగా తన పరిమాణాన్ని తగ్గించుకొని, కోట గోడమీదికి ఎగబాకాడు. హఠాత్తుగా తనను ఎవరో పట్టి లాగారు. అలా లాగినది లంకాపుర రక్షణకు నియమింపబడిన లంఖిణి అను రాక్షసి. హనుమ నిశ్చలంగా ఆ రాక్షసి ముందు కొంతసేపు నిలచి ఆమెను పిడికిటితో ఒక్క పోటు పొడిచాడు. అప్పుడు ఆ రాక్షసి హనుమతో “నీవు సాధారణ వానరానివి కాదు, నన్ను ఓడించిన వారు ఇంతవరకు ఎవ్వరు లేరు. ఈనాడు నీచేతిలో దెబ్బతిన్నాను.ఇది లంకా నాశనానికి నాంది. నీవు వచ్చిన కార్యం జయప్రద మవుతుంది’’ అని ఆకాంక్షించింది. హనుమంతుడు దీనిని శుభ సూచకంగా భావించాడు.

నగరంలో ప్రవేశించి ప్రతిచోట జాగ్రత్తగా వెతక సాగాడు, లంక విశ్వకర్మచే నిర్మింపబడిన అతి సుందర నగరము. అందులో ఎన్నో గొప్ప ప్రాసాదాలు, భవనాలు, దేవాలయాలు, ఉద్యానవనాలు, విశాలమైన వీధులు ఉన్నాయి. వేదపఠనం నుంచి మద్యపానం వరకు అన్ని రకాల కార్యకలాపాలు జరుగుతున్నాయి. ప్రజలందరు సంగీత, నృత్య, విశేషాలతో ఆనందిస్తున్నారు. ఆ నగర శోభ చూచి హనుమంతుడు విభ్రమం చెందాడు. అన్ని భవనాలు వెతికాడు కాని సీత జాడ లేదు.

చివరకు రావణుని అంతఃపురం ప్రవేశించాడు. ఆ భవన సౌందర్యం చూచి హనుమ ఆశ్చర్య చకితుడయ్యాడు. అక్కడ స్త్రీల ఏకాంతవాస దృశ్యాలు, పానశాలలోని విశేషాలు ఎటువంటి మునీంద్రుల మనస్సులపైనా చలింపచేయక పోవు. కాని హనుమంతుడు జితేంద్రియుడు. అతని దృష్టి పవిత్ర రామకార్యం మీద ఉంది కాబట్టి ఈ ప్రాపంచిక విషయాల ప్రభావం అతనిమీద లేదు.

రావణుడు హంసతూలికా తల్పంమీద నిద్రిస్తున్నాడు.

ఆతనిని చూచి హనుమ “ఏమి ఇతని రూపము, వర్చస్సు” అని ఆశ్చర్యపోయాడు. అక్కడ సర్వాలంకార శోభితురాలయిన ఒక సుందర స్త్రీని చూచి అతని మనస్సు ఆనందంతో ఎగిరి గంతులు వేసింది. ఆమెనే సీత అనుకున్నాడు.కానీ ఇంతలో తేరుకుని ఆలోచించాడు.

“రామచంద్రునికి దూరమై దుఃఖిస్తూ ఉండవలసిన సీత అంతఃపురంలో అన్ని అలంకారాలతో, విలాసాల మధ్య ఉంటుందా?” ఈమె సీత కాదు అని నిర్ణయించుకున్నాడు. ఆమె రావణుని పట్టపు రాణి మండోదరి.

ఆమందిరం నుండి వెలుపలికి వచ్చి విచారంగా కొంతసేపు ఆలోచిస్తూ కూర్చున్నాడు. తనకు దారి చూపించమని రాముని మౌనంగా ప్రార్థించాడు. తటాలున అతనికి పెద్ద ఉద్యానవనం, ఆశోకవనము కనిపించింది. దాని ప్రాకారాన్ని దాటి లోపల ప్రవేశించాడు. ఆవనంలో జన సంచారం లేదు.. కాని దూరంనుండి కొంతమంది రాక్షస స్త్రీలను చూచాడు మరికొంత దగ్గరికి వెళ్ళి చూడగా ఆస్త్రీలమధ్య, ఒక శింశుపా వృక్షం క్రింద ఒక స్త్రీని చూచాడు. ఆమె రూపాన్ని బట్టి రాక్షస స్త్రీలాగా అనిపించలేదు.లావణ్య మయిన శరీరంతో సుందరమైన ముఖంతో, ఉత్తమ వంశంలో వుట్టిన స్త్రీవలె ఉంది. శరీరము, ముఖము వాడిఉన్నాయి. ఒంటిపైన మాసిన వస్త్రము, ముడివేయని జుట్టుతో, కాయలు కాచిన కళ్ళతో, చెంపలపై కన్నీటి చారలతో మూర్తీభవించిన శోక దేవత వలే ఉంది.

హనుమ నిశ్శబ్దంగా చెట్టునుండి చెట్టుకు దూకుతూ ఆ వనిత కూర్చున్న చెట్టుమీదికి చేరి క్రింద ఏమి జరుగుతుందో పరిశీలించ సాగాడు.

ఆమె పెదిమలు అదురుతున్నాయి. ఏవో అస్పష్టంగా మాటలు వస్తున్నాయి హనుమ చెవులు రిక్కించి విన్నాడు. అప్పుడు ‘రామ’ శబ్దం వినపడింది. ఆ శబ్దం వినగానే అతని హృదయం గంతులు వేసింది. ఒడలు పులకరించింది. తప్పక ఈమె సీతే అయి ఉంటుందనుకున్నాడు. ఆ ఆలోచన రాగానే ఆనికి నిరాశ, నిస్పృహ దూరమై, శక్తి అంతా మళ్ళీ

వచ్చింది. హఠాత్తుగా వనంలో కలకలం వినవచ్చింది. పెద్ద అట్ట హాసంతో రావణుడు పరివార సమేతంగా వనములో ప్రవేశించాడు.

సీతను సమీపించి “సుందరీ, నీ జీవితాన్ని ఎందుకు వృధా చేసుకుంటావు. నన్ను స్వీకరించు. రాజభవనాల్లో సకల భోగాలు అనుభవించు. ఎప్పటికయినా రాముడు వచ్చి నిన్ను విడిపిస్తాడన్నది కల్ల” అన్నాడు. సీత మౌనంగా అంతా విన్నది కానీ జవాబు ఇవ్వక రావణుణ్ణి తృణీకార భావంతో చూచి తల వంచుకుంది. రావణుడు క్రోధంతో వణికిపోతూ “నా మాట వినకపోతే నిన్ను ఏం చేస్తానో చూచుకో” అంటూ బెదిరించాడు. సీత బెదరలేదు. నిశ్చలంగా, శాంతంగా “నేను శ్రీరాముని పెళ్ళాడాను. నేను అతని భార్యను. మరొకరికి చెందను. నా మనస్సులో ఆయన కొక్కడికే స్థానం తప్ప పరపురుషునికి స్థానం లేదు. నీవు అజ్ఞానంలో పడి కొట్టుకుంటున్నావు. రాముని దివ్యాస్త్రాలు ఏనాటికయినా ఈ లంకను చేదించి నిన్ను,నీ వంశాన్ని నాశనం చేస్తాయి. ఇది గ్రహించి ఆయన పాదాక్రాంతుడవై క్షమాపణ వేడుకో, తప్పక క్షమిస్తాడు ఆ దయాశీలి అన్నది. ఈ మాటలకు రావణుని కోపం తారస్థాయికి చేరింది. “ఇంకా రెండు నెలలు గడువిస్తున్నాను. అప్పటికి నీవు నా రాణివి కాకపోతే నిన్ను ఈ రాక్షసులు చంపి నాకు ఆహారంగా వడ్డిస్తారు”అంటూ కోపంగా తిరిగి వెళ్ళిపోయాడు.

మహా శక్తివంతుడైన రావణుడు ఈ విధంగా బెదిరిస్తూ ఉంటే మరొక స్త్రీ అయితే నిలువ కలిగి ఉండేది కాదు. సీతకు పుట్టుకతో వచ్చిన ఉత్తమ గుణాల వలన ఆమెకు రాముని యందు ఉన్న చెక్కు చెదరని ప్రేమ వలన, రావణుని బెదిరింపులకు జడవక స్థిరంగా నిలవగలిగేట్లు చేశాయి. సుఖవంతమైన అంతఃపుర జీవితాన్ని త్యాగం చేసి కష్టతరమైన అరణ్య జీవితాన్ని స్వయంగా కోరుకున్నది ఆమె. రావణుడు ఎరచూపించిన భోగ భాగ్యాలను ప్రలోభాలను తృణప్రాయంగా తిరస్కరించింది.

హనుమంతుడు తాను కూర్చున్న చెట్టునుండి దిగి ఆమెను సమీపించాడు. ఆమె ఎదుట నిల్చి రామకథను గానం చేయ నారంభించాడు. ఒక వానరము మావన సర్వంతో ఈవిధంగా పాడటం సీతకు ఆశ్చర్యం కలుగ చేసింది. అతని ముఖం లోని తేజస్సు ప్రశాంతత ఆమెను ఆకర్షించాయి. కాని ఇది కూడా రాక్షసుల మాయ అని ఆమె భావించింది. “రావణా! నీ మాయలు నాకు తెలుసు. నేను వీటికి లొంగేదాన్ని కాదు” అన్నది.

ఈ మాటలకు హనుమంతుడు నిర్ఘాంతపోయాడు, “అమ్మా! నన్ను నమ్ము తల్లీ! నిజంగా నేను రాముని సేవకుణ్ణి, ఇదిగో ఆ మహాప్రభువు ఇచ్చిన ఉంగరము. నిదర్శనం చూడు తల్లీ!” అని రాముడిచ్చిన ఉంగరాన్ని ఆమె ముందు ఉంచాడు. ఆ ఉంగరాన్ని చేతిలోకి తీసుకొనగానే ఆమెకు కన్నీళ్లు ఆగలేదు.

అప్పుడు హనుమ రాముడు తనకు చెప్పిన ‘కాకాసుర’ వృత్తాంతము చెప్పాడు. అది సీతారాము లిద్దరికీ మాత్రమే తెలిసిన సంఘటన. సీతకు దుఃఖము ఆగలేదు. ఆమె సందేహాలన్నీ తీరిపోయాయి. హనుమను వాత్సల్యంతో పలకరించింది. హమను ఆమె ముందు మోకరిల్లి “తల్లీ నా వీపు మీద నిన్ను ఎక్కించుకొని సముద్రాలు దాటించి రాముని ముందు ఉంచుతాను. అనుగ్రహించు” అని వేడుకున్నాడు. ఆమె అంగీకరించ లేదు. “హనుమా! అది తగని పని. దొంగతనంగా లంకను దాటిపోలేను. రాముడు తన పరాక్రమంతో రావణుని నిర్జించి నన్ను స్వీకరించాలి. అంతవరకు ఈ వియోగాన్ని ఓర్చుకుంటాను” అన్నది.

ఈ మాటలతో హనుమకు ఆమెపై ఉన్న గౌరవము ఇనుమడించింది. “తల్లీ! నాకు సెలవియ్యి. నీ వృత్తాంతము రామప్రభువుకు నివేదిస్తాను” అనగా సీత అతనిని చేరబిలిచి “నా గుర్తుగా చూడామణిని ఇస్తున్నాను, రామచంద్రునికి సమర్పించు” అని ఆశీర్వదించింది.

సీతను వదలిన హనుమకు ఒక వింత ఆలోచన వచ్చింది. ఏవిధంగానైనా రావణుని సమక్షానికి పోయి అతనికి ఒక చిన్న గుణపాఠం నేర్పాలనుకున్నాడు. వెంటనే అశోక వనంలోని సుందర వృక్షాలను ధ్వంసం చేయనారంభించాడు. అతనిని ఎదిరించి భంగపడి కాపలాదారులు రావణునితో మొరబెట్టుకున్నారు. రావణుడు ఇదేదో ‘కోతిపని’ అనుకుని కొంతమంది సైనికులను పంపాడు కాని వారందరు హనుమ చేతిలో చనిపోయారు. ఇది వివి రావణుడు మరికొంతమంది వీరులను పంపారు. కాని వారు కూడా హనుమంతుని ముందు నిలువలేదు. రావణుడు తన కుమారులలో ఒకనిని ‘ఆ కోతిని పట్టి తెమ్మని’ పంపాడు. అతనిని కూడా వాయుపుత్రుడు చంపాడు.

రావణుకు ఇదేదో మామూలు కోతి కాదనుకొని తన కుమారుడు ఇంద్రజిత్తును పంపాడు. ఇంద్రజిత్తు వచ్చి ఎన్నో అస్త్రాలు ప్రయోగించాడు కాని హనుమను అవేవీ బాధించ లేదు. చివరకు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. హనుమ కార్యార్థి కాబట్టి బ్రహ్మాస్త్రానికి కట్టుబడ్డాడు. రాక్షసులు అతనిని బంధించి నిండు సభలో రావణుని ముందు నిలబెట్టారు.

రావణుడు “ఎవరు నీవు లంకలో కోతికి ఏంపని? చెప్పక పోయావా నీ ప్రాణం నిలువదు” అని గర్జించాడు.

హనుమంతుడు గంభీరంగా, “రావణా! నేను రామ దూతను. మా ప్రభువు ధర్మపత్ని అయిన సీతాదేవిని దొంగతనంగా తెచ్చి బంధించావు. మర్యాదగా ఆమెను అప్పజెప్పు. లేకున్ననీవు నీ వంశము నశిస్తారు” అన్నాడు. రావణునికి ఒక కోతి తనను బెదిరించడమా? అని కోపము ఆగలేదు. “వెంటనే ఈ వానరుని చంపండి” అని ఆజ్ఞ ఇచ్చాడు.

రావణుని కనిష్ట సోదరుడు విభీషణుడు జోక్యం చేసుకుని “మహాప్రభూ! దూతను చంపడం రాజ ధర్మంకాదు” అని విన్నవించాడు. రావణుడు, “అయితే ఈ కోతి తోకకు నిప్పటించి వదలండి” అని ఆజ్ఞాపించాడు.

రాక్షస సైనికులు బిలబిలమంటూ ఉత్సాహంతో హనుమంతుని తోకకు గుడ్డపీలికలు చుట్టి, నూనెతో తడిపి నిప్పు అంటించి “రావణ చక్రవర్తికి జయ జయ, ఇంద్రజిత్తుకు జయ జయ” అంటూ కోలాహాలు చేశారు.

హనుమంతుడు సమధికోత్సాహంలో ఆకసంలోకి ఎగిరి లంకాపురిలోని భవనాలకు ఒక్కొక్కదానికి నిప్పంటించ సాగారు. సుందర సౌధాలన్నీ క్షణంలో భస్మీపటలం అయినవి. ఎక్కడ చూచినా పెనుమంటలతో వెలిగిపోతూ పౌరుల హాహాకారాలతో లంకా నగరం ప్రతిధ్వనించింది. చివరకు హనుమంతుడు శాంతించి మండే వాలాన్ని సముద్రంలో ముంచి విశ్రాంతిగా సముద్రపు ఒడ్డున కూర్చొన్నాడు. నెమ్మదిగా తాను చేసిన పనులను సింహావలోకనం చేసుకున్నాడు. హఠాత్తుగా అతనికి ఒక ఆలోచన వచ్చింది.

“అయ్యో! ఎంత మందమతిని. మహాతల్లి సీతాదేవి ఈ మంటలలో చిక్కుకున్న దేమో” అని భయంతో కంపించాడు. వెంటనే అశోక వనంలో ప్రవేశించి, ప్రశాంతంగా శింశుపా వృక్షం క్రింద కూర్చునిఉన్న సీతను చూచి కుదుటబడ్డాడు. ఆమె ముందు మోకరిల్లి మళ్ళీ సెలవు తీసుకున్నాడు. తిరిగి లంఘించి, సముద్రాన్ని దాటి, ఉత్తరపు ఒడ్డున దిగగానే అంగదాది వానరులు హనుమును చూచి జయజయ ధ్వానాలు చేశారు. అందరూ హనుమంతుని, అతని సాహస కార్యాన్ని అభినందించారు. వెంటనే అందరు కిష్కింధకు తిరిగి వెళ్ళాలని యువరాజైన అంగదుడు ఆదేశించాడు.

వానరులు కిష్కింధకు చేరుకున్నారు. దూరంనుంచే ఆనందంతో వెలిగిపోతున్న వారి ముఖాలను చూచి, రామ సుగ్రీవులు ,వారు దిగ్విజయంగా వస్తున్నారని గ్రహించారు. హనుమంతుడు సుగ్రీవునికి నమస్కరించి రాముని పాదాలపై వాలి సీతాదేవిని చూచానని, ఆమె క్షేమంగా ఉన్నదని, నివేదించాడు. ఇంకా తాను లంకలో చేసిన సాహస కార్యాలు కూడా చెప్పాడు. సీత ఇచ్చిన చూడామణి ని రామునికి సమర్పించాడు.

చూడామణిని చూడగనే రాముని కళ్ళు ద్రవించాయి. ఉద్వేగం పట్టలేక “హనుమా! సీత క్షేమం తెలిపి నా ప్రాణం, లక్ష్మణుని ప్రాణం కాపాడావు” అని ఆలింగనం చేసుకున్నాడు.

ప్రశ్నలు:
  1. తాను రామ దూతనని హనుమ సీతకు ఏవిధంగా తెలియ జేసాడు ?
  2. అతనిని చూచి రాక్షస మాయ అని సీత ఎందుకు భావించింది ?
  3. చివరకు ఆమె అనుమానం ఎట్లు తీరింది?
  4. రావణునికి హనుమంతుడు ఏవిధంగా చిన్న గుణపాఠం నేర్పాడు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *