హృదయంతో ప్రార్థించు
హృదయంతో ప్రార్థించు
జనసందోహం లేని ఏకాంతంగా ఉన్న ఒక ద్వీపం ఉంది. అందులో ముగ్గురు క్రైస్తవ భక్తులు ఉండేవారు. మహానుభావులు, వారెప్పుడూ భగవంతుని లీలా వైభవాలు చెప్పుకొంటూ, ఆయనను గురించి స్మరిస్తూ, ఆయన మహిమలను గానం చేసుకొంటూ జీవించేవారు. బైబిలునందలి పరలోకమునందున్న తండ్రి, ఆయన కుమారుడు పవిత్రాత్మ అను కథను అతి ఆసక్తి తో నిరంతరం చదువుకొనేవారు. నిరాడంబరులగుటచేత “ఓ భగవంతుడా! మేము ముగ్గురము. మీరు కూడా ముగ్గురే. కాన మమ్ములను దయతలచండి” అని ప్రార్థించెడివారు. ఈ పవిత్ర ప్రార్థనకు మెచ్చిన దయాయముడైన భగవంతుడు వారికి ఎప్పుడెప్పుడు ఏమి కావాలో చూచు కొంటూ, వారికి ఏ విధమైన కీడు జరగకుండా చూసే వాడు. వారికి ఆకలిగా ఉన్నప్పుడు సరిపడినన్ని పండ్లు, పాలు వారి బల్ల మీద సిద్ధంగా ఉండేవి. విపరీతంగా ఎండలు కాస్తునప్పుడు, వర్షము కురిసినపుడు వారి తలలపైన ఒక కవచం వంటిది ఏర్పడేది. వారెప్పుడు ఎవ్వరియందు అసూయా భావము లేక ఎవ్వరిని ద్వేషింపక ఉండేవారు. ప్రతీ జీవిని భగవంతుని సృష్టిగా భావించి ప్రేమను పంచిపెట్టేవారు. అందుచేత అక్కడి కూృరమృగములు కూడా వారికి స్నేహితులుగా మెలుగుతూ ఉండేవి.
ఆ సముద్ర తీరాన గల పట్టణములో ఒక క్రైస్తవ మతాధికారి (బిషప్) వుండేవాడు. ఆయన ఈ ముగ్గురు మహనీయుల గురించి విన్నాడు. వారి ప్రార్థన గురించి తెలుసుకున్నాడు. వారు బైబిలు సరిగా అర్థం చేసుకొనలేదు, భగవంతుని బోధనలను చక్కగా అవగతం చేసుకొనలేదని భావించాడు. “నేను స్వయంగా వెళ్ళి భగవంతుడుని ఏ విధంగా ప్రార్థించాలో బోధించి వస్తాను” అని అనుకొన్నాడు.
ఒక పడవ వేసుకొని ద్వీపానికి బయలుదేరి వెళ్ళాడు. ఆ ముగ్గురూ ప్రార్థించే, “ఓ భగవంతుడా! మేము ముగ్గురము. మీరూ ముగ్గురే. మమ్మల్ని దయతలచు” అన్న ప్రార్థన చాలా చిన్నది. అది భగవదనుగ్రహాన్ని పొందడానికి చాలదు అని చెప్పి చాలా రకాల ప్రార్థనలను వారికి బోధించాడు. అందులో ప్రతీ రోజు ఉదయమూ సాయంత్రము కూడా చేయడానికి ఒక పెద్ద పొడుగాటి ప్రార్థన చెప్పాడు. అప్పటికి చీకటిపడటంచే త హడావిడి పడవ దగ్గరకు చేరి, ద్వీపాన్ని విడిచి పట్నానికి ప్రయాణమయ్యాడు.
పడవ సాగి కొంతదూరం వెళ్ళింది.క్రైస్తవ మతాధికా (బిషప్) ఒక్కసారి వెనక్కి తిరిగి ద్వీపం వంక చూశాడు. ఆ కారు చీకటిలోనుంచి, ఒక పెద్ద కాంతి కిరణం తనవైపే వస్తున్నట్టు అనిపించింది. అతను అలా చూస్తూ ఉంటే కళ్ళు మిరుమిట్లు గొలిపాయి. ఆ కాంతిలో ఒక మహాద్భుతం కనిపించింది. కాంతి కిరణంలో ఆ ముగ్గురు మహానుభావులు చెట్టాపట్టాలు వేసుకొని తనవైపే తరలి వస్తుండడం చూశాడు. వారు పడవను చేరి “అయ్యా! మీరు మాకు చెప్పిన ఆ పెద్ద ప్రార్థనలో కొంత భాగము మరచిపోయాము. దయవుంచి మళ్ళీ మాకొక్కసారి చెప్పండి” అని అడిగారు.
మతాధికారికి మతి పోయినట్లయింది. సముద్ర కెరటాలపై ఏసు ప్రభువు నడచినట్లుగా విన్నాడు. కాని ఇంత వరకూ ప్రత్యక్షముగా అటువంటిది ఏదీ చూడలేదు. ఇప్పుడు తన కళ్ళ యెదుట ఆ ముగ్గురు మహానుభావులు చేసిన అద్భుతాన్ని తిలకించి పశ్చాత్తాపం చెందాడు. “నిజంగా యీ ముగ్గురు చాలా పవిత్ర జీవులు, భగవంతుడు వారిని అనుగ్రహించి వారిని స్వంతం చేసుకొన్నాడు. నేను వారికి బోధించేదేముంది?” అని తనలో తాను అనుకొన్నాడు.
సిగ్గుతో తలవంచుకొని, “పూజ్యులారా! మీరు ఇది వరకు చేసే చిన్న ప్రార్థననే మానకుండా చేయండి. భగవంతుడు మీకు ప్రసన్నుడయినాడు” అని అతి వినయంగా చెప్పాడు. ఈ సన్నివేశం మతాధికారికి ఒక మహాపాఠాన్ని నేర్పింది. హృదయపు లోతులనుండి ప్రార్థన చేయాలి గాని పెదవులతో పలికినంత మాత్రాన లాభం లేదు అని తెలుసుకొన్నాడు.
ప్రశ్నలు:
- మతాధికారి చేసిన పొరపాటు ఏమిటి?
- ముగ్గురు మహానుభావుల నుండి మతాధికారి నేర్చుకున్న పాఠాన్ని వివరముగా వ్రాయుము.
- నీ ప్రార్ధనా విధానమును తెలిపి అది ప్రార్థన అనదగినదా, కాదా వివరముగా వ్రాయుము.