ఎంత దూరం?

Print Friendly, PDF & Email

ఎంత దూరం?

Pandit narrating Gajendra Mokshamఒక మహారాజు ఆస్థానములో ఒకనాడు పండితసభ జరుగుతన్నది. ఒక మహా పండితుడు భాగవతంలోని గజేంద్రమోక్ష ఘట్టాన్ని రసవత్తరంగా వర్ణిస్తున్నాడు. “గజరాజు మొర వినగానే శ్రీమన్నారాయణుడు శంఖుచక్రాది ఆయుధాలను ధరించక లక్ష్మీదేవికి కూడా చెప్పక భక్త రక్షణకై పరుగులిడుతున్నాడు” అని భగవంతుని భక్తరక్షణ తత్త్వాన్ని వివరించాడు. దీనిని విన్న మహారాజు తక్షణమే ఆ పండితునితో “స్వామీ! గజేంద్రుడున్న ప్రదేశానికి వైకుంఠం ఎంత దూరంలో వుందో సరిగ్గా చెప్పండి” అన్నాడు. ఆ పండితుడు అయోమయంతో “మహారాజా!

శ్రీమన్నారాయణుని నివాసమైన వైకుంఠం ఎంత దూరంలో ఉన్నదో నిర్ణయించడం నా తరం కాదు. ఆ విషయాలు ఏ పుణ్యపురుషులో కాని తెలుపలేరు. మరి ఈ సభలో వున్న పండితులు చెప్పగలరేమో, నేను మాత్రం చెప్పలేను” అని చెంపలు వేసుకొన్నాడు. ఆ సభలోని పండితులెవరూ రాజుగారి ప్రశ్నకు సమాధానం చెప్పలేక తలవంచుకొన్నారు.

అప్పుడు రాజుగారి సింహాసనం వెనుక నిలబడి వింజామర వీస్తున్న సేవకుడు “మహాప్రభూ! మీరు దయతో ఆజ్ఞ యిస్తే వైకుంఠం ఎంత దూరమో చెప్పగలను” అన్నాడు. రాజు “సరే చెప్పరా!” అన్నాడు. ఆ సేవకుడు “ప్రభూ! ఆ ఏనుగు ఎలుగెత్తి అరిస్తే ఎంత దూరం వరకు ఆ పిలుపు వినిపిస్తుందో. అంతదూరంలో వుంది వైకుంఠం” అన్నాడు.

భగవంతుడు భక్తుని ఆర్తితో కూడిన ప్రార్థనను ఆలకించి రక్షించేంత సమీపములో ఎప్పుడూ ఉంటాడు.

Servant giving the answer

భక్తుడు తన మనసులోని ఆవేదనని ఆర్తనాదంగానో, మొఱగానో, నిట్టూర్పుగానో వ్యక్తపరచినప్పుడు, ఆ శబ్దం వినిపించేంత దూరంలో భగవంతుడుంటాడు. తన భక్తుల ఆర్తనాదము వినడానికి నిరంతరము జాగరూకుడై ఉంటాడు.
నిరక్షరాస్యుడైన సేవకుడు భగవంతుని సర్వవ్యాపకత్వాన్నీ, దయనూ ఒక్క క్షణంలో తెలుసుకున్నాడు.

ఎలగైతే మనము రేడియోని tune చేసి మనకు కావాల్సిన స్టేషన్ పెట్టుకుంటామో, మనము మనల్ని భగవంతుని వైపు tune చేసుకుంటే, మనకి కావాల్సిన అనుగ్రహం లభిస్తుంది. భగవంతుడు హృదయవాసి, దయామయుడు.

[Ref: China Katha – Part 1 Pg:130]

 Illustrations by Ms. Sainee
Digitized by Ms.Saipavitraa
(Sri Sathya Sai Balvikas Alumni)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *