మానవప్రయత్నం – దైవసహాయం

Print Friendly, PDF & Email
మానవప్రయత్నం – దైవసహాయం

గ్రామ ప్రజలంతా కూడిన ఒక సత్సంగంలో ఒక సాధువు ఉపన్యసిస్తూ “భగవంతుడు దయామయుడు, ప్రేమస్వరూపుడు, అతడే సర్వశక్తిమంతుడు, సర్వాధికారి” అని వర్ణించాడు. “నీవు ఆపదలో చిక్కుకొన్నప్పుడు, నీ శక్తి చాలనప్పుడు భగవంతుని ప్రార్థించు. ఆయన తప్పక సహకరిస్తాడు” అని చెప్పాడు. అందులో పాల్గొన్న వారిలో రామ చరణ్ వున్నాడు. అతడు బండి తోలుకొని జీవించేవాడు. హనుమంతుని భక్తుడు. భగవంతుడు భక్తులకెప్పుడూ తోడ్పడతాడని సాధువు చెప్పిన మాటలకు రామ చరణ్ చాలా సంతోషించాడు.

Ramcharan's praying Hanuman to push his cart

వర్షకాలంలో ఒక రోజున రామ చరణ్ తన రెండెడ్లబండి నిండా బియ్యం బస్తాలు వేసుకొని బండి తోలుకొని వెళుతున్నాడు. కొంచెం దూరం వెళ్ళాడో లేదో బండి రెండు చక్రాలు బురదలో దిగి, బండి కదలడం మానేసింది. రామ చరణ్ చేతులు జోడించి, కళ్లు మూసుకొని, “ఓ హనుమా! దయవుంచి యీ బండిని బయటకు తీయి” అని ప్రార్ధించాడు. పదే పదే పిలిచినా దేవుడు ప్రత్యక్షం కాలేదు. దానితో నిరాశ చెంది హనుమంతుని మీద అలిగి ఆగ్రహించాడు రామ చరణ్. కొంచెం తూలనాడాడు కూడా. అంతటితో ఆగక అతను ఆసాధువు వద్దకు వెళ్ళి, “నీవు మోసపు కబుర్లు చెప్పావు. భగవంతుడు మనకు ఎట్లా సహకరిస్తాడు? సహకరించడు. నా బండి బురదలో దిగిపోయింది. ఎన్నోసార్లు భగవంతుణ్ణి ప్రార్థించాను. కాని ఫలితం లేకపోయింది” అని విసుక్కొని, కోపంతో జరిగిందంతా చెప్పాడు.

Saint advicing him to try with his full energy first

రామ చరణ్ చెప్పిందంతా ప్రశాంతముగా విన్న సాధువు, అతని వీపు తట్టి, “నీ నిరుత్సాహాన్ని అర్థం చేసుకొన్నాను నాయనా! భగవంతుడు తప్పక సహకరిస్తాడు. కానీ ముందు నీ శక్తి ఉపయోగించి, నీ ప్రయత్నం నీవు చెయ్యాలి. నీవు ప్రయత్నం చేస్తే దైవం తప్పక సహకరిస్తాడు. వేలు కదపకుండా వెంకన్నబాబూ అంటే వెంట్రుక వాసికూడ సాధించలేము”. నీవు నూతి దగ్గర నిలచి “నాలుక ఎండి పోతోంది. , నీళ్ళు ఇవ్వు, అని నూతిని అడిగితే యిస్తుందా? ఇవ్వదు. నడుము వంచి నూతిలో చేదవేసి చేదుకొంటే, నూతిలో నీళ్ళన్నీ త్రాగవచ్చు. భగవంతుడు కూడా అంతే. నీ పూర్తి శక్తితో ప్రయత్నించు, అప్పుడాయనను ప్రార్ధించు, తప్పక అనుగ్రహిస్తాడు” అన్నాడు సాధువు.

Ramacharan feels help while pushing the cart

అది విన్న రామ చరణ్ బండిని సమీపించి “జై హనుమాన్” అంటూ భుజంతో ఒక చక్రాన్ని తోస్తూ ఎద్దుల్ని అదిలించాడు. అదే సమయంలో అవతలి చక్రాన్ని తనకంటే ఎక్కువ బలంతో ఎవరో తోస్తున్నట్లనిపించింది రామ చరణ్ కి. “ఎవరా చక్రాన్ని తోస్తున్నది” అని ఆశ్చర్యముగా అనుకున్నాడు. ఇంకెవరు? తను అనుక్షణం ఆరాధించే ఆ హనుమంతుడే బండిని బయటికి లాగుతున్నాడని గ్రహించి రామ చరణ్, అమితానందాన్ని పొందాడు. రెండు చక్రాలు చకచకా తిరిగాయి. ఎడ్లు పరుగెత్తాయి. బండి పొగ బండిలా నడిచింది. మెడలో కట్టిన చిరుమువ్వలు చెవులకు ఆనందాన్ని కలిగిస్తూవుంటే “జయ జయ హనుమంతా!” అని గళమెత్తి పాడుకుంటూ కృతజ్ఞతా పూర్వకంగా హనుమంతుణ్ణి కీర్తిస్తూ ఆనందంతో ఉప్పొంగి పోయా డు రామ చరణ్.

అప్పటినుండి రామ చరణ్, తన మిత్రులలో ఎవరికి ఏ మాత్రం కష్టం కలిగినా, “భగవంతుడన అనుగ్రహించిన , శక్తి సామర్ధ్యాలతో మొదట నీవు ప్రయత్నించు. ఆ పైన భగవంతుని భక్తితో ప్రార్థించు. దైవము నీకు తోడై తప్పక సహకరిస్తాడు. స్వయం సేవకులకు సర్వేశ్వరుడు సదా తోడ్పడతాడు” అని అందరికి చెపుతూ వుండేవాడు. మనము అడుగు ముందుకు వేస్తే దేవుడు మనవైపు పదడుగులు వేస్తాడు.

ప్రశ్నలు
  1. రామ చరణ్ మొదట ప్రార్థించినపుడు భగవంతుడు అతనికి ఎందుకు సహకరించలేదు?
  2. భగవంతుడు రామ చరణ్ కి ఎప్పుడు సహకరించాడు?
  3. భగవంతుని సహకారం నీకెప్పుడు అవసరం? దానిని ఎట్లు పొందగలవు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *