అసూయ తెచ్చిన అనర్థము
అసూయ తెచ్చిన అనర్థము.
ఒక ఊరిలో మాధవుడు, కేశవుడు అని ఇద్దరు రైతులు ఉండేవారు. మాధవుడు చాలా తెలివైనవాడు. దానికితోడు బాగా కష్టపడి పని చేసేవాడు. తనకు లభించిన దానితో సంతృప్తి చెందుతూ సంతోషంగా జీవితాన్ని గడిపేవాడు. కేశవుడు స్వతహాగ బద్ధకస్తుడు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ విచారంగా ఉండేవాడు. మాధవుడు అంటే అతనికి గిట్టదు. ఎల్లప్పుడూ మాధవుని గురించి అసూయపడేవాడు. అసలు మాధవుడు కనిపిస్తేనే చాలు కేశవుడుకి ఎక్కడిలేని కోపం వచ్చేది.
మాధవుడు అంటేనే అతనికి గిట్టేదికాదు. అందుచేత అతనెప్పుడ మాధవుడికి కీడు జరగాలనే భగవంతుణ్ణి కోరుకునేవాడు. మాధవుడు ఎల్లప్పుడూ అందరూ తనలాగే సుఖంగా జీవించాలని కోరుకునేవాడు. అందుచేతనే భగవంతుడెప్పుడూ అతనిని కాపాడుతూ ఉండేవాడు. కొంతకాలం అలా గడచిపోయింది. మాధవుడు చాలా శ్రమపడి, తన తోటలో గుమ్మడిపాదులు వేసి పెంచాడు. అందులో ఒక పాదుకి ఒక చక్కటి గుమ్మడికాయ కాసింది. అటువంటిది దొరకటం కష్టం. అది నవనవ లాడుతూ సప్తవర్ణాలతో చాలా అందంగా వుంది. మొగలిపువ్వులా మంచి సువాసన వెదజల్లుతూ ఉంది. అన్నిటికంటే ముఖ్యం, అది ఒక ఏనుగు ఆకారంలా ఉంది. దానికి నాలుగుకాళ్ళు, ఒక తొండము, ఒక తోక కనిపిస్తున్నాయి. మంచి సువాసన వెదజల్లతూ తేనే వలె తియ్యగా వున్నది.
ఇంత మంచి గుమ్మడిపండు మహారాజుకి బహుమతిగా ఇస్తే బాగుంటుందని మాధవుడు అనుకున్నాడు. దానిని రాజధాని నగరానికి తీసుకొని వెళ్ళి “యీ కానుకను స్వీకరించండి మహారాజా!” అని వినయంగా సమర్పించుకున్నాడు. మహారాజు అది చూచి చాలా ఆనందించాడు. ఇటువంటి ప్రత్యేకమైన కానుకను తన కిచ్చినందుకు ఒక మంచి ఏనుగును మహారాజు మాధవుడికి బహుమతిగా ఇచ్చాడు.
కేశవుడికి ఈ వార్త తెలిసింది. అసూయతో అలమటించాడు. రాత్రంతా నిద్రపోలేదు. రాజును మెప్పించి, మాధవుని కంటే మంచి బహుమతిని రాజు వద్ద పొందాలని ఆలోచించాడు. ఏనుగు ఆకారంలో వున్న గుమ్మడి కాయను ఇచ్చినంత మాత్రంచేతనే ఏనుగు నిచ్చాడా మహారాజు. నిజమైన ఏనుగునే యిస్తే యింకా ఎంతకానుక ఇస్తాడో! నాకు తప్పక ఒకటి రెండు గ్రామాలనిస్తాడు. అప్పుడు నేనొక జమీందారునవుతాను” అనుకున్నాడు.
మరుసటి రోజున తనకున్న ఆవులు, ఎడ్లు, గొర్రెలు, మేకలు సర్వస్వం అమ్మేశాడు. ఆ సొమ్ముతో ఒక పెద్ద ఏనుగును కొని రాజుగారికి కానుకగా తీసుకొనిపోయాడు. సాధారణ రైతు తనకు ఎందుకు ఏనుగును బహూకరిస్తున్నాడో రాజుకు అర్థం కాలేదు. అతడు మంత్రిని పిలిచి “ఇందులో ఏదో అంతరార్థముంది. ఆలోచించి చెప్పండి. ఇతనికి తగిన బహుమతి ఏమిటో నిర్ణయించండి” అని చెప్పాడు.
ఆ మంత్రిగారు కేశవుడితో కాసేపు సరదాగా కబుర్లు చెప్పాడు. మాటలలో పెట్టి నిజాన్ని తెలుసుకొన్నాడు. మాధవుడి మీద ఉండే అసూయే ఇందుకు కారణమని తెలుసుకొన్నాడు. అతనికి ఒక గుమ్మడి కాయను బహుమతిగా యిస్తే బాగుంటుందని రాజుకి సూచించాడు.
రాజు ఇచ్చిన ఆ గుమ్మడికాయను చూసి కేశవుడు కుప్పకూలి పోయాడు. అతని హృదయం బద్దలయ్యింది. అతని ఆస్థి అంతా అమ్మేసుకొన్నాడు. తినడానికే తిండిలేక, కట్టుబట్టల్లేక ఇక్కట్లకు గురి అయ్యాడు. అసూయవల్ల వచ్చే అనర్థం ఇంతా అంతా అని చెప్పనలవికాదు.
ప్రశ్నలు
- మాధవునికి కేశవునికి గల తేడా ఏమి? వారిరువురిలో నీకు ఎవరు ఇష్టం. ఎందువలన?
- మాధవుడికి ఏనుగునిచ్చి, కేశవునికి గుమ్మడికాయ మాత్రమే మహారాజు ఎందుకు బహూకరించాడు?
- నీకు నీ తరగతిలో వచ్చిన బహుమతికి, నీ సహాధ్యాయుడు అసూయ పడతాడనుకో, అతని మనసు మారునట్లు మంచి సలహానిస్తూ ఒక ఉత్తరం వ్రాయి?