కర్ణుని శీలము

Print Friendly, PDF & Email
కర్ణుని శీలము

మహాభారతంలో ఎన్నో పాత్రలు వస్తాయి. కర్ణుని పాత్ర చాలా విశిష్టమైనది, ఆదర్శవంతమైనది. అతని ఎన్నో ఉత్తమ గుణాలు చూడవచ్చు.

అంగరాజైన కర్ణుడు త్యాగానికి సాటిలేనివాడని పేరు పొందాడు. అడిగినవారికి ‘లేదు’ అని అతడు ఎన్నడు అనలేదు. తన కుమారుడైన అర్జునుని ఓడించగలవాడు కర్ణుడు అని ఇంద్రుడు భావించి ఒకనాడు బ్రాహ్మణ రూపంలో కర్ణుని యాచించడానికి వచ్చాడు. తనవద్దకు వచ్చిన బ్రాహ్మణుని చూచి కర్ణుడు లేచి గౌరవమర్యాదలు జరిపి, “అయ్యా! మీకు నేను ఇవ్వగలది ఏదైనా ఉంటే చెప్పండి” అని అడిగాడు. “అంగరాజా ! నీకు నా ఆశీస్సులు, నేనొక బీద బ్రాహ్మణుడను. నీవు దానశీలివని విని యాచించడానికి వచ్చాను.”

ముందు రాత్రి కర్ణునికి ఒక కల వచ్చింది. కలలో సూర్యుడు కనుపించి” ఇంద్రుడు నీ శక్తి గ్రహించడానికి వస్తున్నాడు” అని హెచ్చరించాడు. అయినా కర్ణునికి దానం చేయడంలో ఎట్టి సంకోచము లేదు. అందుకే ఆ బ్రాహ్మణుని అడిగాడు “అయ్యా ! అడగండి! మీకు ఏది కావలసినా, చివరకు నా ప్రాణమయినా సరే ఇస్తాను. మీరెవరో నేను గ్రహించాను. మీ కుమారుడు అర్జునిని క్షేమం కోసము వచ్చిన సాక్షాత్తు దేవేంద్రులే మీరు. అయినా నేను సందేహించను. మీరు కోరండి నేను తీరుస్తాను.” ఇంద్రుడు ఎట్టి సంకోచము లేకుండా అడిగాడు. “అంగరాజా ! నీకు శుభమగుగాక. నీ కవచకుండలాలు ఇమ్మని కోరుతున్నాను”.
కర్ణుడు వెంటనే తన కవచకుండలాలు తీసి ఇంద్రుని చేతిలో పెట్టాడు. కవచకుండలాలతో తన శక్తిలో సగభాగము పోతుందని తెలిసి కూడా కర్ణుడు వెనుదీయలేదు. ఇంద్రుడు సంతోషించి, “కర్ణా! నీ త్యాగ బుద్ధి చాలా గొప్పది. నీకు ఒక ‘శక్తి’ని ప్రసాదిస్తున్నాను. కాని అది ఒకరి మీద మాత్రమే ప్రయోగించగలవు. ఒక సారి ప్రయోగిస్తే ఇకపనికిరాదు” అని ఆశీర్వదించి నిష్క్రమించాడు.

కర్ణుడు ఎటువంటి పరిస్థితులలోను తన ప్రాణ స్నేహితుడైన దుర్యోధనునికి అండగా నిలుస్తానని శపథం చేశాడు. తన రాయబారము విఫలమయిన తర్వాత కర్ణుని ఎలాగయినా పాండవులవైపు చేర్చగలిగితే తప్ప పాండవులకు క్షేమం లేదని

కృష్ణుడు ఆలోచన చేశాడు. నేరుగా కర్ణుని మందిరానికి వెళ్లి కుశల ప్రశ్నలు వేశాడు.

కర్ణుడు సగౌరవంగా కృష్ణుని ఆహ్వానించి కుంతీదేవి యొక్క, పాండవులయొక్క యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాడు. కృష్ణుడు తగినవిధంగా సమాధానం చెప్పి “బావా! నేను నీతో ఒక ముఖ్యమయిన పనిమీద వచ్చాను” అని అన్నాడు.

‘బావా’ అన్న పిలుపుకు కర్ణుడు ఆశ్చర్యపడి ఇందులో ఏదో ఆంతర్యం ఉందని గ్రహించి చిరునవ్వుతో ఊరుకున్నాడు. కృష్ణుడు “బావా ! నీకు ఇన్నాళ్ళు దాచిన రహస్యంమొకటి ఒకటి చెప్తున్నాను విను. నీవు కుంతీపుత్రుడివి గాని సూతపుత్రుడివి కాదు. ధర్మరాజు, భీమార్జున, నకుల సహదేవులు నీకు సోదరులు అవుతారు. మీ తల్లి కుంతీదేవి వివాహం కాకపూర్వమే తనకు దుర్వాస మహర్షి అనుగ్రహించిన సూర్య మంత్రము ఉపాసన చేసింది. సూర్యుడు ప్రత్యక్షమై ఆమెకు నిన్ను ప్రసాదించాడు. కాని అపవాదుకు భయపడి నిన్ను గంగలో వదిలేసింది. సూతుని భార్య రాధకు నీవు దొరికావు. అప్పటినుండి రాధేయుడుగా అందరికి తెలుసు, కానీ నిజంగా నీవు పాండవుడవే. కాబట్టి న్యాయంగా నీ రాబోయే యుద్ధంలో పాండవులవైపు చేరమని కోరుతున్నాను. నీవు వారి పక్షానికి వస్తే ధర్మరాజు, ఆయన సోదరులు నిన్ను రాజుగా, సోదరునిగా గ్రహించి సేవలు చేస్తారు” అన్నాడు.

కర్ణుడు చిరునవ్వు నవ్వి, “బావా ! నీ హిత వాక్కులకు కృతజ్ఞణ్ణి. కాని నేను ఎక్కడ జన్మించినా నన్ను పెంచి పెద్ద చేసిన వారికి దూరము కాలేను. పైగా నాకు నలుగురిలో ఒక గౌరవ స్థానం ఇచ్చి అంగరాజుగా చేసిన ప్రాణ మిత్రుడు

దుర్యోధనుని నా సహాయం అవసరమయిన సమయంలో వదలి వచ్చేటంత కృతఘ్నుణ్ణి కాలేను. పాండవ రాజ్య పట్టం కోసం ఆశపడి నా విద్యుక్తధర్మాన్ని విడవలేను. నన్ను క్షమించు కృష్ణా !” అని పలికాడు. కృష్ణుడు కర్ణుని సచ్ఛీలానికి సమబుద్ధికి లోలోన ఆనందపడి, సెలవు తీసుకున్నాడు.

తర్వాత కొన్నాళ్ళకు కుంతీదేవి స్వయంగా వచ్చి కర్ణుని పాండవ పక్షంలోకి రమ్మని వేడుకుంది. “నీవు శత్రు పక్షంలో ఉన్నంత కాలము పాండవులకు విజయం లభించడం సందేహమే” అని ఆమె పలికింది.

కర్ణుడు “అమ్మా! ఈనాటికి నీకు ఈ కుమారుడు గుర్తుకు వచ్చాడా ? అయినా స్వయంగా వచ్చి ప్రార్థించావు. అడిగినవారికి కర్ణుడు ఎప్పుడు లేదన లేదు.

రాబోయే యుద్ధంలో నేను పాండవ సోదరులలో ఒకడిని మాత్రమే చంపుతాను . ఆ విధంగా నీకు పంచపాండవులు బ్రతికే ఉంటారు” అని తల్లికి నమస్కరించాడు.

ప్రశ్నలు :
  1. ఇంద్రుడు తన కుమారుడు అర్జునునికి ఎట్లు సహాయము చెసెను?
  2. కృష్ణుడు కర్ణుని మనస్సు మళ్ళించుటకు ఎట్లు ప్రయత్నించెను?
  3. కర్ణుని ఉదాత్త గుణము లేవి?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *