శ్రీ కృష్ణ జన్మాష్టమి

Print Friendly, PDF & Email
శ్రీ కృష్ణ జన్మాష్టమి

భారతీయులు శ్రీకృష్ణుని జన్మదినాన్ని శ్రీ కృష్ణాష్టమి పర్వ దినంగా జరుపుకుంటారు. దుష్టశిక్షణ, శిష్టరక్షణ, ధర్మ సంస్థాపన కొరకు అవతరించినదే శ్రీకృష్ణావతారము. (ఆంగ్ల మాసాలలో ఇది ఆగస్టు సెప్టెంబర్ లో వచ్చును) శ్రీకృష్ణుడు శ్రావణ బహుళ అష్టమినాడు జన్మించాడు.

మానవాళిని వుద్ధరించుటకై “భగవద్గీత” అను మహత్తరమైన కానుకను ప్రసాదించాడు. గీత మహాభారతంలోని 18 వ అధ్యాయంలోని భీష్మ పర్వం లోనిది (23 నుండి 40). శ్రీ కృష్ణ పరమాత్మ అర్జునుని నిమిత్తంగా చేసుకుని లోకానికి అందించిన ఆదర్శం భగవద్గీత. భగవద్గీత మానవాళి శాంతియుతంగా ఎలా జీవించాలి? అన్నది నేర్పుతుంది.శ్రీకృష్ణుడు అష్టమి రోజు అర్ధరాత్రి జన్మించినందున ప్రజలు ఆరోజంతా ఉపవాసం ఉండి, రాత్రంతా కృష్ణ నామ సంకీర్తనలు గానం చేస్తూ, శ్రీ కృష్ణ చరితాన్ని తెలియజేసే భాగవత గాధలను వింటూ, భగవద్గీత శ్లోకాలను వింటూ, పఠిస్తూ పండుగను జరుపుకుంటారు. రాత్రంతా సామూహికంగా శ్రీకృష్ణ లీలలను తెలియజేయు భజనలను పాడుతారు.

భారతదేశంలో మణిపూర్, అస్సాం, గుజరాత్, రాజస్థాన్ వంటి ప్రాంతాలలో కృష్ణ జన్మాష్టమి కి కొన్ని రోజుల ముందు నుండి “రాసలీల లేదా కృష్ణ లీల” అని పిలువబడే నృత్య నాటిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇవి ఆయా ప్రాంతాలలో పండుగ వాతావరణాన్ని సృష్టించుటకు దోహదపడతాయి. ఎంతో మంది కళాకారులు అనేక ప్రాంతాల్లో పండగ స్ఫూర్తిని కలిగించుటకై ఇటువంటి నాటకాలను ఉత్సాహంతో నిర్వహిస్తారు.

మహారాష్ట్రలో ప్రజలు ఒకరి భుజాల మీద ఒకరు ఎక్కి, బాగా ఎత్తులో కట్టిన మట్టికుండను (ఉట్టిని) పగలగొట్టే కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా చేసుకుంటారు. శ్రీకృష్ణుడు బాల్యం లో తన స్నేహితులతో కలిసి గోపికల ఇళ్లలోని పాలు, పెరుగు కుండలను పగలగొట్టి, వెన్నను దొంగిలించడం వంటి చిలిపి పనులు చేస్తూ, వారికి దొరకకుండా పారిపోయేవాడు.

శ్రీకృష్ణుని బాల్య క్రీడలను ఉట్టి కొట్టే వేడుకగా ఈ ఉత్సవాన్ని ప్రజలంతా ఎంతో ఉత్కంఠతో,ఉత్సా హంతో చూసేవారు. గుజరాత్ రాజస్థాన్ ప్రాంతాలలో తాజా వెన్న తో “మఖ్ఖన్ హండీ” పేరుతో ఈ ఉట్టి కొట్టే వేడుకను జరుపుకుంటారు. జన్మాష్టమి రోజున ప్రజలంతా శ్రీకృష్ణ మందిరాలను సందర్శిస్తారు. సత్సంగాలు, భజన లో పాల్గొంటారు. అనేక ప్రాంతాలలో జరిగే జానపద నృత్యాలు పండుగ ఆనందాన్ని ఇనుమడింప చేస్తాయి.

గుజరాత్ లోని‘’కచ్’ లో ఎడ్లబండ్లను అందంగా అలంకరించి భక్తిపూర్వకంగా భజనలు పాడుతూ, నృత్యాలు చేస్తూ శ్రీకృష్ణుని ఊరేగింపు ఉత్సవాలను ఎంతో ఆనందంతో జరుపుకుంటారు.

ఉత్తర భారతదేశంలో కూడా శ్రీ కృష్ణాష్టమి ప్రసిద్ధమైన పండుగ. శ్రీ కృష్ణాష్టమి పర్వదినం రోజు శ్రీకృష్ణుడు జన్మించిన మధురను మరియు శ్రీకృష్ణుని బాల్య నివాస ప్రదేశమైన బృందావనాన్ని ఎంతో దేదీప్యమానంగా అలంకరించి, ఎంతో వైభవంగా జరుపుకుంటారు. శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా మధుర, బృందావనము, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, ఉత్తరాఖండ్, హిమాలయాలలో చేసే విద్యుత్ దీపాలంకరణ సందర్శకులను ఎంతో ఆకర్షిస్తుంది. అన్ని శ్రీ కృష్ణ మందిరాలు విద్యుద్దీపాలతో అలంకరిస్తారు. శ్రీకృష్ణుని బాల్య లీలలు, రాధాకృష్ణుల రాసలీల మొదలగు నాటికాలతో ప్రేక్షకులను అలరిస్తారు. భక్తులు ఢిల్లీలో ప్రసిద్ధి చెందిన ఇస్కాన్ దేవాలయాన్ని సందర్శిస్తారు.

జమ్మూలో శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా గాలిపటాలను ఎగురవేస్తారు.

భారతదేశంలో కృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణుని వారి ఇంటికి ఆహ్వానించే సంప్రదాయంగావ వారి ఇంటి వద్ద నుండి శ్రీ క్రిష్ణ మందిరం వరకు అందమైన రంగులతో కృష్ణ పాదముద్రల ముగ్గులు వేసి శ్రీకృష్ణుని వారింటికి ఆహ్వానిస్తారు. ఆ రోజంతా భక్తులు భగవద్గీతను పారాయణం చేస్తారు.

ప్రత్యేకమైన భజన లో పాల్గొంటారు. శ్రీ కృష్ణునికి ఎంతో ఇష్టమైన పిండి వంటలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఆరోజు వేడుకలు సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు కొనసాగిస్తారు.

ఆంధ్రప్రదేశ్ లో కూడా కృష్ణాష్టమి సందర్భంగా భగవద్గీత పారాయణం, భక్తి సంకీర్తనలు ఆలపించడం వంటివి చేస్తారు. అంతేకాకుండా కృష్ణాష్టమి రోజు చిన్నపిల్లలను శ్రీకృష్ణుని వేషధారణ తో అలంకరించి వేడుకలను ఎంతో ఆనందంగా జరుపుకుంటారు.

సందేశము: పరిపూర్ణ ప్రేమ తత్వాన్ని బోధించును.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *