కృష్ణ రాయబారము

Print Friendly, PDF & Email
కృష్ణ రాయబారము

భారతంలో కృష్ణుని పాత్ర గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అభిప్రాయ పడతారు. కృష్ణుడు పాండవుల వెంట ఉండి, ఆపదల్లో వారిని రక్షిస్తాడు. దానికి తార్కాణాలు ద్రౌపది మాన సంరక్షణ. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునునికి రధసారధ్యము, పంచమ వేదమని పేరు పొందిన భారతంలో శ్రీ కృష్ణుడు అర్జునునికి తద్వారా సర్వ మానవ ప్రపంచానికి ఇచ్చిన దివ్య సందేశము భగవద్గీత ఉంది.

యుద్ధం చేయనని, ఆయుధాలు వదలి తిరిగి వెళ్ళిపోతానని, నిస్పృహతో కూర్చున్న అర్జునుని కృష్ణుడు యుద్ధము చేయమని ప్రోత్సహిస్తాడు. దీనినిబట్టి, కృష్ణుడు యుద్ధోన్మాది అని, శాంతి కోరుతున్న వారిని గూడా యుద్ధానికి ప్రేరేపిస్తున్నాడని కొందరు అభిప్రాయ పడ్తున్నారు. కాని భారతం జాగ్రత్తగా చదివి అర్ధం చేసుకుంటే కృష్ణుడు ఎప్పుడూ శాంతి కోసమే కృషి చేశాడని, యుద్ధం నివారించడానికి ఎంతో ప్రయత్నించాడని తెలుస్తుంది.

పాండవులు ఒప్పందం ప్రకారం 12 ఏళ్ళు అరణ్య వాసము, ఒక సంవత్సరము అజ్ఞాతవాసము పూర్తి చేసి ఇంద్రప్రస్థానికి తిరిగి వచ్చారు. తిరిగి రాజ్యంలో తమ భాగం ఇవ్వవలసినదని వారు అడిగారు. కాని దుర్యోధనుడు తిరస్కరించాడు. కొరవ పాండవుల మధ్య ఒక విధమైన అశాంతి వాతావరణము ఏర్పడింది. కృష్ణుడు ఇది గ్రహించి శాంతి కోసం సంధానము చేయడానికి నిశ్చయించుకున్నాడు. తానే స్వయంగా కౌరవుల వద్దకు పాండవ దూతగా వెళ్ళివస్తానన్నాడు. వెళ్ళేముందు పాండవులతో సంప్రదించాడు.

కృష్ణుడు ధర్మరాజుతో “బావా ! యుద్ధం తప్పదని నాకు తెలుసు. కొరవులు అహంకారంతో మిడిసిపడ్తున్నాడు కాని ఆఖరి ప్రయత్నం ఒకటి చేస్తాను. మీరు చెప్పవలసిన ఏమైనా ఉంటే దూతగా వారికి చేరవేస్తాను.”

పాండవులందరు, ద్రౌపది, కుంతీదేవి గూడా తాము చెప్పదలచుకున్నవి చెప్పారు. కృష్ణుడు సాత్యకితో సహా హస్తినాపురికి చేరుకున్నాడు. కృష్ణుడు వస్తున్నాడని విని కౌరవులు, పెద్దఎత్తున స్వాగ త సన్నాహాలు చేశారు. కృష్ణుడు పాండవ పక్షపాతి, అతడిని తమ ఆతిధ్యంతో ముంచెత్తి తమ వైపు త్రిప్పుకోవాలని వారి ఉద్దేశము. తమ ఐశ్వర్యము, భోగభాగ్యాలు, వైభవము, స్వాగత సత్కారాలతో తప్పక కరిగిపోతాడని వారి ఊహ. నగర ద్వారాల వద్దనే స్వయంగా దుర్యోధనుడు తన తమ్ములతో, కర్ణునితో కృష్ణుడు రథము దిగగానే ఘనంగా స్వాగతం పలికాడు. తమ రాజప్రాసాదంలో ఆతిధ్యం స్వీకరించమని ప్రార్థించాడు. కాని కృష్ణుడు చిరునవ్వుతో “బావా! నేను నీ ప్రతికక్షులనుండి దూతగా వచ్చాను. దూతగా కార్యం ఆయేవరకు మీ ఇంట ఎటువంటి ఆతిధ్యం స్వీకరించడం మర్యాద కాదు.” అని విదురుని ఇంట విడిది చేశాడు.

అనుకోకుండా తన నివాసానికి వచ్చిన కృష్ణ భగవానుని విదురుడు ఎంతో భక్తిశ్రద్ధలతో సేవించాడు. కృష్ణుడు ఆత్మీయతతో విదురునితో గడిపాడు. విదురుడు “ప్రభూ! కౌరవులు యుద్ధం కోసం చూస్తున్నారు అని తెలిసికూడా నీ వెందుకు ఈ శాంతి ప్రయత్నాలు చేస్తున్నావో నాకు అర్ధం కావడం లేదు.” కృష్ణుడు నవ్వి “విదురా! నాకు తెలియక కాదు కౌరవులు సంధికి ఒప్పుకుంటారని నేనెప్పుడూ అనుకోలేదు. కాని యుద్ధం, తద్వారా సర్వనాశనము జరుగబోతుందని తెలిసి శాంతికోసము చివరివరకు ప్రయత్నం చేయడం నా కర్తవ్యము. ఇదేవిధంగా శాంతి కోరే నీవంటి, భీష్ముడు లాంటివారు కూడా ఉన్నారు. కాని వారందరు అశక్తులు. దుర్యోధనుని మనస్సు వారు మళ్ళించలేరు” అన్నాడు.

మరునాడు ఉదయము కృష్ణుడు విదురునితో ధృతరాష్ట్ర చక్రవర్తి సభామందిరాన్ని ప్రవేశించాడు. సభ అంతా రాజులతో, మంత్రి సామంతాదులతో, భీష్మ, ద్రోణ, కృపాచార్య వంటి ప్రముఖులతో నిండి ఉంది. జబాలి మొదలైన మహర్షులు కూడా ఆసీనులయి ఉన్నారు. దుర్యోధనుడు, కర్ణుడు, ఇతర కౌరవ రాజపుత్రులు ఒక వర్గంగా ఉన్నారు. కృష్ణుడు ప్రభామండపం ప్రవేశించగానే గౌరవ సూచకంగా అందరు లేచి నిలబడ్డారు. ధృతరాష్ట్రుడు ఆప్యాయంగా పలకరించాడు. “కృష్ణా మా అందరి వద్దకు నీవు రావడం చాలా సంతోషకరంగా ఉంది. ఏమి చేయగలమో సెలవియ్యి”.

కృష్ణుడు ఒకసారి చుట్టూ కలయజూచి పెద్దలందరినీ మర్యాద సూచకంగా పలకరించాడు. మహర్షులు, ఆచార్యులు కూర్చున్న తర్వాత తనకు ఏర్పాటు చేయబడిన ఆసనం ఆలంకరించాడు. సభలో కలకలం అణిగిన తర్వాత కృష్ణుడు లేచి “మామా! ధృతరాష్ట్ర చక్రవర్తీ! చాలాదినముల గౌరవనీయులైన ఈ ఆచార్యులను, బంధువులైన మిమ్మల్ని, ఇంకా ఇతర మిత్రవర్గాన్ని కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను వచ్చిన పని వివరిస్తాను. అందరు సావధానంగా వినండి. పాండవులు నన్ను తమ దూతగా పంపారు. ఒప్పందం ప్రకారము 12 ఏళ్ళు వనవాసము, ఒక ఏడు అజ్ఞాత వాసము వారు పూర్తిచేశారు. ఇప్పుడు తమకు న్యాయంగా రావలసిన రాజ్య భాగము ఇమ్మని వారి పెద నాన్న అయిన ధృతరాష్ట్ర మహారాజును కోరుకున్నారు. దీనివలన అనవసరమయిన రక్తపాతం లేకుండా శాశ్వత శాంతి ఏర్పడుతుందని వారి మాటగా చెప్పమన్నారు. ఒప్పందం ప్రకారం జరగకపోతే వారు తమ పరాశ్రమంతో రావలసిన రాజ్యభాగాన్ని గెల్చుకోగలరు.”

భీష్ముడు, ద్రోణుకు మొదలైన పెద్దలు ఈ మాటలు చాలా సమంజసంగా ఉన్నాయని అభిప్రాయము వెలిబుచ్చారు. కాని దుర్యోధనుడు దిగ్గున లేచి “కృష్ణా! ఎటువంటి పరిస్థితులలోను మేము పాండవులకు ఒక్క అంగుళం నేల కూడా ఇవ్వము. చేతనైతే యుద్ధం చేసి గెలుచుకోమని మా మాటగా చెప్పు”అన్నాడు. ఈ మాటలు చెప్పి తన మిత్ర వర్గంవైపు సగర్వంగా చూచాడు.

ధృతరాష్ట్రుడు తన కుమారుని మాటలకు లోలోపల ఆనందించాడు. కాని పైకిమాత్రం అనునయంగా అన్నాడు. “నాయనా దుర్యోధనా! వారు మాత్రం నా కుమారులు గారా. నీ మొండితనము మాని స్నేహం కలుపుకో”. గాంధారి కూడా తన పుత్రుణ్ణి సోదరులతో కలహం పెంచుకో వద్దని వేడుకొంది. కాని దుర్యోధనుడు వీరి మాటలను అహంకార పూరిత స్వరంతో తిరస్కరించాడు. కృష్ణుడు ధృతరాష్ట్రుని ద్వంద్వ వైఖరి గమనించాడు.

భీష్మకు ద్రోణుడు మొదలైన వయోవృద్ధుల మాటలు చెల్లవని కూడా గ్రహించాడు. ఆఖరి మాటలుగా అన్నాడు మీరందరూ అంతా విన్నారుగదా. కర్ణుని అండ చూసుకొని ఈ దుర్యోధనుడు మిడిసిపడుతున్నాడు. అది ఎంత కాలం ఉంటుందో త్వరలోనే తెలుస్తుంది. సంధికోసము ప్రయత్నిస్తున్నారు కదా అని పాండవులు చేతగాని వారు మీరు భావిస్తే అది చాలా పొరపాటు. ధర్మ స్వరూపుడు అయిన యుధిష్ఠిరుడు ఆగ్రహించిననాడు ఈ కర్ణుడి లాంటివారు వేయి మంది వచ్చినా కౌరవుల నాశనాన్ని ఆపలేరు. మామా ఇప్పటికైనా పరిస్థితి గుర్తించి నీవు నీ కుమారులను సరి అయిన మార్గం త్రిప్పుకోమని మరొకసారి కోరుతున్నాను.

ధృతరాష్ట్రుడు “కృష్ణా ! నన్నేం చేయమంటావు. చూస్తున్నావు కదా. నా మాటలు వినే వారు ఎవరూ లేరు” అని తప్పించుకొన్నాడు. ఒకవైపు సంభాషణ జరుగుతుండగా మరొకవైపు దుర్యోధనుడు తన మిత్రులు, సోదరులతో బంధించడానికి ప్రయత్నించాడు. ఆ క్షణాల్లో కృష్ణుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఆ దివ్య కాంతిని భరించలేక దుర్యోధనాదులు అచేతనులైనారు. ఆ ఆ విశ్వరూపాన్ని దర్శించడానికి ధృతరాష్ట్రునికి క్షణం దృష్టి ప్రసాదించాడు కృష్ణ భగవానుడు. నా జన్మ తరించింది. ఈదృష్టితో మరి దేనిని చూడలేను. దృష్టి ఉపసంహరింపమని వేడుకొన్నాడు చక్రవర్తి.

కృష్ణుడు, విదురుడు పాత్యకిలతో కలిసి సభామందిరం వదలి వెళ్ళాడు. శాంతికొరకు చివరి క్షణంవరకు ప్రయత్నించాడు కాని యుద్ధము, రక్తపాతము, జననష్టము తప్పలేదు.

ప్రశ్నలు:
  1. కృష్ణుడు నిజముగా యుద్ధం కోరుకున్నాడా? శాంతికోసం ప్రయత్నించాడా? ఎట్లు?
  2. కృష్ణని రాయబారం విఫలం కావడానికి కారకులెవ్వరు?
  3. కృష్ణుడు తాను సర్వ శక్తిమంతుడైన భగవంతుడని ఎట్లు నిరూపించాడు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *