తిరిగి వచ్చిన కుమారుడు

Print Friendly, PDF & Email
తిరిగి వచ్చిన కుమారుడు

‘లెవి’ తృప్తిగా జీవితం గడుపుకుంటున్నాడు. జీవితా కాలమంతా కష్టపడి మంచి భూములు కొన్నాడు. తన సందకు తోడు ఇద్దరు కుమారులను తన ఆస్తిగా భావించు కున్నాడు. వారిద్దరు పెళ్ళిళ్ళు చేసుకొని చక్కగా కాపురాలు చేస్తుంటే చూడాలని ‘లెవి’ కోరిక. అప్పుడు మనమలు, మనమరాండ్రను చూడవచ్చు. ఈ విధంగా తన భూములను పశువులను, పెద్ద ఇంటిని చూచుకొని తృప్తి పడ్తున్నాడు తండ్రి లెవి.

Father receiving back the son

కాని ఈ హాయి ఎన్నాళ్ళో నిలవ లేదు. పెద్ద కొడుకు చక్కగా వ్యవసాయంలో దిగి ప్రతిదినం కష్టపడి పని చేసు కుంటున్నాడు. కాని చిన్నవాడు ‘సైమన్’ అలా కాదు. అతనికి అంతా విసుగ్గా ఉంది. ఈ పల్లెటూరి పనుల్లో సరదా లేదు. పెద్ద పెద్ద పట్టణాలుకు వెళ్లి సరదాగా కాలం గడుపుదామని అనుకుంటున్నాడు.

ఒకనాడు తండ్రివద్దకు వెళ్ళి “నాన్నగారూ! నా వాటా నాకు పంచివేయండి. నేను పట్టణానికి వెళుతున్నాను. ఈ మొరటు ఊళ్ళో ఉండలేను”.

తండ్రి లెవికి నోట మాట రాలేదు. సైమన్ కోరుకున్న మార్గం. మంచిది కాదని చెప్పిచూచాడు. పట్టణంలో డబ్బు ఎక్కువ కాలం నిలవదని, సుఖ జీవితం అంటే డబ్బుతో కొనుక్కు నేది కాదని అతనికి తెలుసు. కానీ తాను సైమన్ మనసు బాధ పెట్టలేదు. తన పశువులు, గొర్రెలు, కొంత భూమి అమ్మి సైమన్ వాటా అతనికి ఇచ్చాడు. ఒక సంచి నిండా డబ్బు ఇచ్చి జాగ్రత్తగా వాడుకో మన్నాడు.

సైమన్ ఇంక ఒక క్షణం కూడా నిలవలేక పోయారు. మంచి దుస్తులు ధరించాడు. డబ్బు సంచి జాగ్రత్తగా బెల్టులో దోపుకున్నాడు. తండ్రివద్ద, అన్నవద్ద సెలవు తీసుకొనే ఓపిక కూడా లేదు అతనికి. పట్టణానికి వెళ్ళిపోయాడు. తన చిన్న కుమారుడు వెళ్ళడం చూచి లెవి కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఏనాటికైనా తిరిగి వస్తాడని ఎదురు చూడడం తప్ప చేయదగినదేమీ లేదనుకున్నాడు.

పట్టణం చేరుకొని ఊపిరి పీల్చుకున్నాడు సైమన్. “అబ్బ! ఆ మొరటు పల్లెటూరు నుండి వదల్చుకొని వచ్చాను. ఎంత హాయిగా ఉంది”, అనుకున్నాడు ప్రతిదినము, విందులు వినోదాలతో సరదాగా కాలం గడిచిపోతోంది. తండ్రి కష్టపడి సంపాదించినదాన్ని చిల్ల పెంకులలాగా ఖర్చు పెట్టుతున్నాడు.

డబ్బు తరగసాగింది. సైమన్ తనలో అనుకున్నాడు. “ఇన్నాళ్ళు నా డబ్బు వీరికి పెట్టాను. నాకు అవసరమయినప్పుడు వీరు తప్పక ఇస్తారు. ఇంతమంది మిత్రులుంటే తనకెమిలోటు.” కాని తాను అనుకున్నట్లు జరగలేదు. డబ్బు అయి పోగానే స్నేహితులు ఒక్కొక్కరు తప్పుకున్నారు. నీతో మాకేమీ సంబంధం లేదన్నారు. సైమన్ చివరకు తిండి కోసం తన మంచి దుస్తులు కూడా అమ్ముకున్నాడు.

ఊరూరు తిరుగుతున్నాడు. ఎవ్వరూ సహాయం చేయడం లేదు. “ఏదైనా పనిచేసి బ్రతుకు తాను” అనుకున్నాడు. కాని ఎక్కడా పని దొరకలేదు. కట్టుకున్న బట్టలు కూడా పూర్తిగా పీలిక లైనాయి.

చివరకు ఒక పల్లెటూర్లో ఒక రైతు దయదలిచి పందులు కాచే పని ఇచ్చాడు. విధిలేక ఆపనికి ఒప్పుకున్నాడు. పందులు తినే ఆహారం ఎంతో రుచిగా అనిపించింది. పందులు కాచుకుంటూ తీరిగ్గా ఆలోచించాడు సైమన్. ఎంత బుద్దిలేని పనిచేశాను. నా తండ్రి దగ్గర పనిచేసే పని వాళ్ళు కూడా నాకన్నా బాగా జీవిస్తున్నారు. నేనిక ఈ జీవితం భరించలేను, మా నాన్నగారి వద్దకు వెళ్తాను.”

ఎన్నో మెళ్ళు తిరిగి ప్రయాణం చేసి తమ ఊరికి చేరుకున్నాడు. చిరిగిన బట్టలతో, చింపిరి జుట్టుతో ఉన్న అతనిని ఎవ్వరూ గుర్తించలేదు. కాని ఇతని కోసం ఎదురు చూస్తున్న వారు ఒకరున్నారు. తండ్రి లేచి తన మేడమీద కూర్చొని బాటవైపు చూస్తున్నాడు. ఏనాటికైనా తన చిన్నారి కొడుకు తిరిగి రాకపోతాడా? అని అతని ఆశ.

అతడు సైమన్ను దూరంనుండి గుర్తించాడు. ఒళ్ళంతా దుమ్ము నిండుకొని కాళ్ళీడ్చుకొంటూ వస్తున్న పుత్రుడుని చూడగానే తండ్రి హృదయం ద్రవించింది. గబగబ దిగి పరుగెత్తి ఎదురు వెళ్ళి కొడుకును ఆప్యాయంగా కౌగిలించు కొని ఇంట్లోకి తీసుకొనివచ్చాడు. తండ్రి కౌగిట్లో సైమను పరవశుడై పోయాడు.

“నాన్న! నన్ను క్షమించు, తెలుసుకోలేక పట్టణవాసం సరదాలకు భ్రమపడి నీకు దూరమైనాను. నేను నీకు, భగవంతునికి ద్రోహం చేశాను. ఇప్పుడు నా తప్పు తెలుసుకున్నాను” అని రోదించాడు. కుమారుని ఊరడించి, సైమనుకు స్నానం చేయించి, మంచి బట్టలు కట్టించమని సేవకులకు ఆజ్ఞ ఇచ్చాడు. వెంటనే బ్రహ్మాండమైన విందు ఏర్పాటు చేశాడు. వాయిద్యాలు వాయించేవారు, పాటలు పాడేవారు అప్పటికప్పుడు వచ్చారు. మళ్ళీ ఇల్లు కళకళ లాడింది.

అప్పుడే రోజంతా పొలంలో కష్టపడి పనిచేసి ఇంటికి తిరిగి వస్తున్న పెద్దకొడుకు జూడ్కు ఈ రణగొణధ్వని అంతా వినిపడింది. అతనికి అర్థం కాలేదు. “ఏమిటి ఈ గొడవంతా. ఈ రోజు ఇంట్లో ఏ పండగా లేదే!” అనుకుంటూ ఇంట్లో ప్రవేశించాడు. అక్కడ జరుగుతున్న సందడి అంతా చూచాడు. ఒక సేవకుడు వెళ్ళి లెవికి, పెద్దబ్బాయి వచ్చారని చెప్పాడు. అది విని అతడు “అయితే వాణ్ణి వచ్చి డైనింగు టేబులువద్ద కూర్చోమను విందులో పాల్గోనమను” అని చెప్పాడు.

సేవకుడు వచ్చి చెప్పగానే జూడ్ మండిపడి “ఇల్లు వదలి వెళ్ళిపోయిన సైమన్ వచ్చినందుకు ఇంత హడావిడా? ఆ సోమరిపోతు కోసం విందు వినోదాలా! నేను దీనిలో పాల్గొనను” అని కసురుకున్నాడు. సేవకుని ద్వారా ఇది విన్న తండ్రి లేచి జూడ్ను బతిమాలుకున్నాడు. కాని తండ్రి మాటలను త్రోసిపుచ్చాడు, పట్టలేని కోపంతో “నాన్నగారూ! ఇన్నాళ్ళు రాత్రనక పగలనక పొలంలో కష్టపడి పనిచేస్తూ మీ మాటను జవదాటక ఉన్న నాకు ఏనాడయినా ఇటువంటిది ఏర్పాటు చేశారా? సోమరితనంతో పొగరెక్కి, తన వాటా పంచుకొని వెళ్ళిపోయి అంతా పోగొట్టుకున్న వాడికి ఈ విందు వినోదాలా? న్యాయం లేదా నాన్న గారూ?” అన్నాడు.

ఈ మాటలకు తండ్రి లెవి “నాయనా జూడ్!నీకు నాకు భేదంలేదు, నీవు నా దృష్టిలో ఎప్పుడు ఉన్నతుడివే. నీకు సన్మానం చేయనవసరం లేదు. ఇది నీ ఇల్లే, కాని నీ తమ్ముడు సైమన్ అజ్ఞానంతో ఇల్లు విడిచిపోయి చెడిపోయాడు. వాడిని క్షమించడం మన విధి. వాడు చనిపోయాడనే నేను భావించాను. చనిపోయిన వాడు తిరిగి బతికివస్తే ఎంత ఆనందంగా ఉంటుందో నీవే ఊహించు. నా ఆనందాన్ని నీవు కూడా పంచుకో.

ప్రశ్నలు:
  1. లెవి రెండవ కుమారుడు ఎటువంటివాడు?
  2. తనవాటాను అడిగినప్పుడు తండ్రి ఏమిచేశాడు.
  3. ఇల్లు విడిచి వెళ్ళిన కొడుకు తిరిగి వచ్చినపుడు తండ్రి ఏ విధంగా భావించాడు?
  4. తమ్ముని ఆదరించినందుకు అన్న ఎందుకు కోపగించాడు. తండ్రి ఎలా సర్దిచెప్పాడు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: