మన్మనా భవ – వివరణ

Print Friendly, PDF & Email
మన్మనా భవ – వివరణ
మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు |
మామే వైష్యసి యుక్త్వైవ మాత్మానం మత్పరాయణః ||

రాజవిద్యా రాజగుహ్య యోగము (9-34)

భగవత్ ప్రాప్తికి నిరంతరం భగవత్ చింతన, భగవత్పరాయణత్వం తప్ప అన్యమైన మార్గము ఏదీ లేదు. మనసును పరమాత్ముని వైపుకు మరల్చి, వారినే ఆరాధించుచూ, వారికే నమస్కరించవలెను.

ఆర్తి-ప్రాప్తి : పూర్వకాలం గ్రామాలలో ఒక ఆచారం వుండేది. గ్రామంలోని ప్రతి గృహిణి సంధ్యా సమయంలో గ్రామాధికారి యింట వెలిగించిన దీపం నుండి తమ దీపం వెలిగించి తెచ్చుకొనేది. సిరిసంపదలతో, సదాచారముతో నిండిన గ్రామాధికారి వారికి అదర్శము. కనుక, వారి యింటినుంచి జ్యోతిని వెలిగించుకొని వస్తే వారికి అటువంటి సంపదలు, సౌభాగ్యము చేకూరునని ఆనాటి ప్రజల విశ్వాసం. అట్టి ఆచారము వ్రేపల్లెవాసులందరూ పాటించేవారు.ఆ గ్రామానికి మహారాజు నందుడు. అతని యింటిముంగిట వెలుగుతున్న దీపంనుండి ప్రతి గృహములోని వారు వారి దీపములను వెలిగించుకొనేవారు. వ్రేపల్లెలోని నందయశోదల యింటికి వెళ్ళటం తమ అదృష్టంగా భావించేవారు.ఆ విధంగా శ్రీకృష్ణుని చూడవచ్చునని ఆనందించేవారు. ఆ సమయం కోసం ఎదురు చూసేవారు.ఒక గోపిక వ్రేపల్లెకు కొత్తగా వచ్చిన కోడలు. ఆమె శ్రీకృష్ణుని భక్తురాలు. అత్తగారి ఊరు శ్రీకృష్ణుడు నివసించే ఊరు అని తెలిసి చాలా సంతోషించింది. కానీ వారు ఆమె శ్రీకృష్ణుని చూడరాదని కట్టడి చేశారు. ఆమె చాలా నిరాశ చెందింది. ఆమె అత్తగారే ప్రతి సాయంత్రం దీపం వెలిగించుకుని రావడానికి నందుని ఇంటికి వెళ్లేది. ఒకరోజు అత్తగారికి జ్వరం వచ్చినందువల్ల ఆ గోపికను నందుని ఇంటికి దీపం వెలిగించుకుని రావడానికి పంపించింది. తనకు మంచి అవకాశం లభించినందుకు ఆ గోపిక ఎంతో సంతోషించింది. శ్రీకృష్ణుని చూడాలి అన్న ఆలోచనలతో తన చేతిలో ఉన్న దీపాన్ని వెలిగించు కోవడానికి, నందుని ఇంటిలో వెలుగుతున్న జ్యోతి వద్దకు వెళ్ళింది. జ్యోతిని చూస్తున్నది. కృష్ణ ధ్యానం వలన ఆమెకు బాహ్య ప్రపంచానికి తెలియలేదు. హఠాత్తుగా యశోదాదేవి తన చేయి పట్టి లాగింది. యశోదాదేవి ఆమెతో “ఏమిటమ్మా అంత పరధ్యానం?” అని ప్రేమగా మందలించింది. అప్పుడు ఆమె తన చేతిని చూచుకుంటూ “అమ్మా నా వేలు కాలిందా? నాకు ఏమి జరిగిందో తెలియదు. వెలుగుతున్న జ్యోతిలో శ్రీకృష్ణుడు కనిపించాడు. ఆ దివ్య సుందరరూపాన్ని తనివితీరా చూస్తూ నన్ను నేను మరచిపోయాను” అన్నది. ఇంతలో చాలామంది గోపికలు తమ దీపాలను వెలిగించుకొనుటకు అక్కడ చేశారు. ఆ గోపిక చెప్పిన మాటలను విన్నారు. వారికి ఎంతో ఆనందము, ఆశ్చర్యం కలిగాయి. ఏమిటి ఈ వింత? దీపంలో శ్రీకృష్ణుడు కనిపించాడా? ఈ విషయం అందరికీ చాటాలి అనుకొని వీధిలోనికి వచ్చి అందరికీ చెప్పారు. అరుగు మీద కూర్చుని ఆ గోపిక రాక కొరకు ఎదురు చూస్తున్న అత్తగారు ఇది విని ఎంతో ఆశ్చర్యపోయారు. తన కోడలు ఎంత గొప్ప భక్తురాలు. ఇటువంటి కోడలు తన ఇంటికి రావడం తన భాగ్యమని పొంగిపోయారు. భగవద్దర్శనం ఏ విధంగానైనా లభించాలన్న కాంక్ష, తపన, ఆర్తి కలిగినప్పుడు భగవంతుడు ఆ కోరిక తప్పక తీరుస్తాడు.

భగవాన్ బాబా వారు ఇలా చెప్పారు: భగవంతుడు సమస్త జీవుల హృదయాలలో ఆత్మ స్వరూపుడై వెలసి ఉన్నాడు. ఈ విషయాన్ని ఎవరైతే మనసా వాచా కర్మణా విశ్వసిసించి, నిరంతరం ఎరుకతో ఉంటారో అదే ధ్యానము.

అప్పుడే భగవంతుని అందరిలో దర్శించుకోగల్గి, “అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు” అన్న స్వామి సూక్తిని ఆచరించిన వారవుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *