తల్లిని మించిన దైవము లేదు

Print Friendly, PDF & Email
తల్లిని మించిన దైవము లేదు
[మాతృదేవో భవ]

ఆ రోజు సాయంత్రము నాలుగు గంటలకు మేఘాలు దట్టంగా పట్టాయి. కారు చీకట్లు కమ్మాయి. ఒక వానజల్లు కూడా కురిసింది. రోడ్లన్నీ చెమ్మచెమ్మగా ఉన్నాయి. బడిగంట మ్రోగింది. పిల్లలు బిలబిలమంటూ బడినుండి బయటికి వచ్చేస్తున్నారు. ఎవరి మట్టుకువాళ్ళు యిల్లుచేరడానికి ఆతృతతో అడుగులు వేస్తున్నారు.

పాపం! ఒక ముసలామె చాలా సేపటినుంచి ఆ ద్వారం దగ్గర అలా నిలబడి ఉంది. ఆమె వచ్చేపోయేవాళ్ళవంక దిగులుగా చూస్తూ ఉంది. ఆమె వాలకం చూస్తుంటే రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తోందా? అన్నట్టుంది. ఆమె ముఖము ముసలి తనముచేత ముడుతలు పడి ఉంది. అతి నీరసంగా కనిపిస్తోంది. దానికితోడు వానకు తడవడం చేత చలికి వణకుతూవుంది. జారిపడతానేమో అన్న భయంవల్ల అడుగులు వేయడానికి సాహసించలేక పోతోంది. ఎవరన్నా రోడ్డు దాటడానికి సాయంచేస్తే బాగుండును అన్నట్లు అందరివంకా చూస్తూవుంది. కానీ వచ్చే పోయేవాళ్ళు ఎవరూ ఆమెవంక చూడడంలేదు. బడినుంచి ఇంటికి వెళుతున్న కొంతమంది విద్యార్థులు చూశారుగాని ఇంటికి త్వరగా చేరాలని ఆమెను ఎవ్వర పట్టించుకోలేదు

మోహన్ కూడా బడినుండి బయటకు వస్తున్నాడు. అతడు చాలా ధృఢకాయుడు. ఆటలలోను, పరుగులలోను అతను అందె వేసిన చెయ్యి. బడిలో ఫుట్బాల్ జట్టుకు అతను నాయకుడు. బడి నుండి బయటికి అడుగు పెట్టగానే వణకుతున్న ఆ ముసలమ్మ కనుపించింది. నిస్సహాయ స్థితిలోవున్న ఆమెను అలా నిలబడి కాస్సేపు చూశాడు. ఏదో ఆలోచన అతనిలో స్ఫురించింది. వెంటనే అతని ముఖంలో మార్పు వచ్చింది. అతని మిత్రులు “ఒరేయ్ మోహన్, త్వరగా రా. ఫుట్బాల్ ఆడుకుందాము” అని బిగ్గరగా అరుస్తున్నారు. కాని అతనికి ఏమీ వినిపించడంలేదు. నెమ్మది నెమ్మదిగా నడచి ఆ ముసలామె దగ్గరకు వెళ్ళాడు. అనురాగంతో ఆమెను పలుకరించాడు. “అమ్మా! నీకు చలి వేస్తోందా? పాపం! వణకుతూ వున్నావు. కొంచెము సహాయము చేయమంటావా?” అని అతి ప్రేమగా పలుకరించాడు.

అతని ప్రేమతో కూడిన పలుకులు ఆమెకెంతో శక్తిని చేకూర్చి ఆనందంతో ముఖము వికసించింది. అశ్రువుల నుండి ఆనంద భాష్పాలు కారాయి. అరక్షణం క్రితం తనకెవ్వరు దిక్కులేరని, ఏకాకినని, నిస్సహాయురాలినని ఎంతగానో వాపోయింది. అంతలోనే ఆ భగవంతుడు “అమ్మా !” అని ఆప్యాయతతో పిలిచి అనుగ్రహించినందుకు ఎంతో ఆనందంతో కృతజ్ఞతలు తెలుపుకుంది. “నాయనా! నాకు రోడ్డు దాటడానికి సహాయము చెయ్యవా? నేలమీద కాలు పెడితే జర్రున జారుతోంది. నడవ లేక ఉన్నాను. ఈ రోడ్డు దాటగానే ఆ రోడ్డు అవతల మా యిల్లు” అని అతి దీనంగా అంది. వణకుతున్న ఆమె చేతిని అందుకుని మెడమీద వేసుకుని “నడువమ్మా! నెమ్మదిగా నడు. నిన్ను ఇంటికి చేర్చివస్తాను” అన్నాడు మోహన్.

వారిద్దరు అలా నడుస్తూ నడుస్తూ ఉండగా వారి ఇరువురి మధ్య ప్రేమతో సంభాషణ సాగింది. అతని సేవా భావమునకు ఆమె ఎంతో సంతోషించి కుశల ప్రశ్నలు వేసి, అతని స్వస్థలం గురించి, తల్లిదండ్రుల గురించి వివరాలు తెలుసుకున్నది. ఇంటికి చేరిన తరువాత కృతజ్ఞత తెలుపడానికి ప్రయత్నించింది. అమిత ఆనందంతో మనస్సు మూగపోయింది. మాట రాలేదు. రెండు చేతులు ఎత్తి “ఆ భగవంతుడు నీకు సదా అండగా ఉంటాడు. ఆయన నీకు ఎల్లప్పుడూ ఆనందమయిన జీవితమును ప్రసాదిస్తాడు”! అని ఆశీర్వదించింది.

అమితమైన ఆనందంతోను, ఉత్సాహముతోను తిరిగి వస్తున్నాడు మోహన్. తన మిత్రులను చేరే సరికి వారందరూ అతనిని సమీపించి “ఎవరామె? నీవెరుగుదువా? అంత శ్రమ తీసుకుని ఇంటిదాకా సాగనంపి వచ్చావు? అని తలో ప్రశ్నవేశారు. అతడు గంభీరంగా “ఎవరి తల్లో ఆమె!” అన్నాడు. “ఎవరి తల్లో అయితే నీవు ఎందుకు సహాయం చేయాలి?” మరొకరు అడిగారు. “అవును! మంచి ప్రశ్న వేశావు. నేను లేనప్పుడు నా తల్లికి అటువంటి స్థితి సంభవిస్తే మీరు ఎవరన్నా ఆదరంగా సహాయం చేయరా? ఆమె నిజంగా నీ తల్లి అయితే నీవు చూస్తూ ఊరుకోగలుగుతావా?” అన్నాడు. అది విన్న ప్రతి ఒక్కరు స్థాణువులా నిలచిపోయారు.

మోహన్ చెప్పిన విషయం అందరికి నచ్చింది. అందులో ఒకడు “మోహన్ కి తన తల్లి అంటే ఎంత ప్రేమో!” అని ఆశ్చర్యంగా అన్నాడు. “అవును, ఎవరి తల్లిని ఎవరు ప్రేమించరు? పది నెలలు మోసి, ఎన్నో కష్టాలకు ఓర్చి కని పెంచిన తల్లిపైనే ప్రేమ లేకపోతే ఇక ఈ ప్రపంచంలో ఎవరిని ప్రేమించ గలము? తనువిచ్చిన తల్లినే గౌరవించకపోతే తనయుడనిపించు కోగలుగుతామా?” అన్నాడు. “సెహబాష్ మోహన్, నీ నుంచి ఈ రోజు ఒక మంచి విషయం నేర్చుకున్నాము. నీవు మాకు మిత్రుడైనందుకు మేమెంతో గర్వపడుతున్నాము” అన్నారు.

ప్రశ్నలు:
  1. మోహన్ వలె తన తల్లిని ఎందుకు ప్రేమించాలి ?
  2. ఆ ముసలామెకు ఎప్పుడు సంతోషం కలిగింది? మరి మోహన్ ఎప్పుడు ఆనందించాడు ?
  3. నీ ఇంటిదగ్గర నీవు చేసిన పనివల్ల నీ తల్లిదండ్రులు సంతోషించిన ఒక సన్నివేశాన్ని వివరించుము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *