మయూరధ్వజుని భక్తి -అర్జున గర్వ భంగము

Print Friendly, PDF & Email
మయూరధ్వజుని భక్తి -అర్జున గర్వ భంగము

ధర్మరాజు అశ్వమేధయాగం చేసి అశ్వాన్ని వదిలాడు. దాని వెనుకనే కృష్ణార్జునులు బయలుదేరారు. అశ్వమేధ యాగంలో వదిలిన అశ్వాన్ని ఎవరైనా పట్టుకుంటే వారు యాగం చేసే చక్రవర్తి అధికారాన్ని ఎదిరించినట్లే. పాండవులు వదిలిన యాగాశ్వాన్ని మయూరధ్వజుడనే రాజు పట్టుకున్నాడు. అది తెలిసి కృష్ణార్జునులు మయూరధ్వజుని నగరం చేరుకున్నారు.

మయూరధ్వజుడు కృష్ణు భక్తుడని, అతనితో యుద్ధం చేసే ముందు, వెనుకా ముందు చూడవలసి ఉంటుందని కృష్ణుడు చెప్పాడు. యాగనియమం ప్రకారము అశ్వాన్ని పట్టుకున్న రాజుతో తాను ధర్మరాజు పక్షాన యుద్ధం చేయవలసి ఉంటుందన్నాడు అర్జునుడు. ‘సరే’ అన్నాడు కృష్ణుడు. అర్జునుడు మయూరధ్వజునితో యుద్ధం చేశాడు. కాని అతనిని ఓడించలేకపోయాడు. పైగా తన దివ్యధనుస్సు గాండీవం కూడా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. ఇంక విధిలేక కృష్ణుని సాయం అర్థించాడు. కృష్ణుడు కూడా అర్జునునితో కలిసి యుద్ధంలో దిగాడు.

మయూరధ్వజునికి తన ఆరాధ్య దైవంతో పోరాడడం ఇష్టములేదు. కాని రణరంగంలో వెన్న తీయడం క్షత్రియ ధర్మం కాదని తలచి, కృష్ణా! కృష్ణా!! అని నామస్మరణ చేస్తూ బాణాలు వదిలాడు. ఆ శరాల ధాటికి కృష్ణుడు కూడా చెలించాడు.

అర్జునుడు దిగ్భ్రాంతుడై “బావా ! ఎందుకు ఆలసిస్తావు. నీ చక్రంతో మయూరధ్వజుని చంపలేవా” అని ప్రేరేపించాడు. కృష్ణుడు మందహాసంతో “బావా ! గాండీవంగాని, నా చక్రముగాని ఈ మహాభక్తుని మీద పని చేయవు” అన్నాడు. కాని అర్జునికి మయూరధ్వజుడు కృష్ణుడు చెప్పినంత మహాభక్తుడని నమ్మకము కలగలేదు. కృష్ణుడు అర్జునుని మనస్సు గ్రహించాడు. కృష్ణుని భక్తులలో తనను మించినవారు లేరు అని అర్జునునికి కొంత గర్వము ఏర్పడింది అని కూడా గ్రహించాడు. మయూరధ్వజుని భక్తి ఎంత గొప్పదో అర్జునునికి చూపించదలచుకున్నాడు. ఇద్దరూ ఆనాటికి యుద్ధంనుండి విరమించారు.

మరుసటిరోజు కృష్ణార్జునులు బ్రాహ్మణులవలె వేషాలు ధరించి మయూధ్వజుని మందిరానికి అతిధులుగా వెళ్ళారు. ఇద్దరు బ్రాహ్మణులు రావడం గమనించి ఆ రాజు వారికి ఎదురువచ్చి గౌరవ పురస్కకంగా ఆతిధ్యం ఇచ్చాడు. జలము తెప్పించి స్వయంగా వారి పాదాలు కడిగాడు.

“అయ్యా మీరు ఈనాడు నా ఆతిధ్యం స్వీకరించి నా మందిరము పావనము చేయండి” అని ప్రార్థించాడు. కృష్ణుడు, “రాజా! నీ ఇంట భుజించడానికి మాకు వ్యవధి లేదు. మా కొక పెద్ద ఆపద వచ్చిపడింది. అది తీరితేగాని మేము మరొక విషయము ఆలోచించ లేము” అన్నాడు.

మయూరధ్వజుడు వినయంతో అన్నాడు, “స్వామీ! అదేదో చెప్పండి. నా శాయశక్తులా తీర్చడానికి ప్రయత్నిస్తాను. అవసరమైతే ప్రాణమైనా ఇస్తాను.”

కృష్ణుడు వివరించాడు, “రాజా! మేము అడవిలో ప్రయాణించే సమయంలో నా కుమారుణ్ణి ఒక పులి పట్టుకుంది. బాలుడి శరీరము సగం మిగిలిన తర్వాత ఒక అశరీర వాణి పలికింది. “మయూరధ్వజ మహారాజు శరీరంలో సగ భాగాన్ని తెచ్చి ఈ వ్యాఘ్రానికి అప్పగిస్తే ఈ బాలుడు జీవిస్తాడు !” అని.

ఇది విన్న మయూరధ్వజుడు అన్నాడు. “ఆహా ! నా జన్మ ఈనాటికి తరించింది. ఒక అతిధికి నా శరీరము ఉప యోగ పడబోతున్నది. అయ్యా ! సందేహించకండి. నాశరీరం పరులకు ఉపయోగపడడంకన్నా మించిన ఆనందము లేదు. వెంటనే నా శరీరంలో సగభాగాన్ని తీసుకొని వెళ్ళి పులికి అప్పగించి మీ పుత్రుణ్ణి రక్షించుకోండి. ఆలస్యం చేయకండి” అని వారిని అర్ధించాడు. వెంటనే తన భార్యా పుత్రులను పిలిచి తన శరీరాన్ని కోయమన్నాడు. వారు కూడా మయూరధ్వజుడు
ఏదో మహత్తర కార్యానికి తన శరీరాన్ని త్యాగం చేస్తున్నాడని అర్ధం చేసుకొని, ఏ మాత్రము సందేహించక రాజు శరీరాన్ని ఛేదించడం ప్రారంభించారు.

కృష్ణార్జునులు ఆశ్చర్యంతో ఈ దృశ్యాన్ని చూస్తున్నారు. అలా చూస్తుండగా వారికొక వింత కనుపించింది. మయూరధ్వజుని ఎడమ కంటినుండి నీటిచుక్కలు రాలుతున్నాయి. కృష్ణుడు తెచ్చి పెట్టుకున్న కాఠిన్యంతో “దుఃఖిస్తూ అర్పిస్తున్న వస్తువు మాకు పనికిరాదు. మనస్పూర్తిగా, సంతోషంగా చేస్తేనే అది త్యాగమవుతుంది. ఆ విధంగా శరీరాన్ని అర్పించడం నీకు ఇష్టం లేదు కాబోలు,” అన్నాడు.

ప్రశాంతంగా కూర్చుని ఉన్న మయూరధ్వజుడు “అయ్యా ! నా శరీరము అర్పిస్తున్నానని నాకు బాధ లేదు. మనస్ఫూర్తిగా ఇస్తున్నాను. నాకే నిజంగా బాధ ఉంటే రెండు కళ్ళు గూడా నీరు కార్చాలిగదా ! ఒక కంటినుండి నీరు ఎందుకు వస్తున్నదని మీరు ఆలోచిస్తున్నారుగదూ! వినండి. నా శరీరంలో కుడి భాగము అతిధులకు అర్పించబడు తున్నదని, ఎడమభాగానికి ఆ భాగ్యము కలగలేదని ఎడమ కన్ను దుఃఖిస్తున్నది. మిగిలిపోయిన తనను ఏ కాకులకో, గ్రద్ధలకో వేస్తారు అని ఆ బాధ” అని జవాబిచ్చాడు

ఈ మాటలు విని కృష్ణుడు చిరునవ్వుతో అర్జునుని వైపు చూచాడు. అర్జునునికి ఇప్పుడు . ఇదంతా తనకు గర్వభంగం చేయడానికే కృష్ణుడు ఆడిన నాటకమని అర్థమైంది. కృష్ణుడు తమ నిజరూపాలుచూపించి మయూరధ్వజుని ఆశీర్వదించాడు. ఆ రాజు శరీరము పూర్వపు స్థితి పొందింది. అతడు అశ్వాన్ని అర్జునునికి అప్పగించాడు.

ప్రశ్నలు :
  1. అర్జునునికి కలిగిన గర్వమెటువంటిది ?
  2. కృష్ణుడు ఆ గర్వాన్ని ఏవిధంగా భంగపరిచాడు?
  3. మయూరధ్వజుని త్యాగ మెట్టిది ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: