శివలింగం ప్రతీక

Print Friendly, PDF & Email
శివలింగం ప్రతీక
శివరాత్రి

శివరాత్రి అనగా మంగళకరమైన రాత్రి అని అర్థం.ప్రతి మాసము నందలి కృష్ణపక్ష చతుర్దశిని శివరాత్రి అని అందురు. మాఘ మాస కృష్ణపక్ష చతుర్దశి(14వరోజు) మహాశివరాత్రి అంటారు. (ఆంగ్ల మాసం ప్రకారము ఫిబ్రవరి-మార్చి). శివరాత్రి ఎందుకు పవిత్రమైనది? చంద్రుడు మనస్సుకు అధిష్టానదేవత. శివరాత్రి నాడు (చతుర్దశి నాడు) మనసుకు చెందిన పదహారు కళలలో 15 లయమై ఒక కళ మాత్రమే మిగిలి వుంటుంది.ఈ ఒక్క కళను లయము గావించే నిమిత్తమై దైవచింతన, దైవ నామ సంకీర్తనలతో గడిపి మంగళ కరముగా మార్చుకొనవలసిన దినము. ఈరోజున భగవంతుని ధ్యానించడం ద్వారా మనస్సు పై నియంత్రణ పొందడం సాధ్యమవుతుంది.

అందుకే దీనిని పవిత్రమైన దినంగా పరిగణిస్తారు. శివరాత్రి రోజున భక్తులు శివాలయాలను సందర్శించడం, శివలింగాన్ని పంచామృతాలతో (పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర) అభిషేకం చేయడం, బిల్వపత్రములను సమర్పించడం చేస్తారు.భక్తులు రోజంతా వుపవాసం వుంటూ, శివనామ సంకీర్తనలు పాడుతూ రాత్రంతా జాగరణ చేస్తారు.

శివలింగం ప్రతీక

శివలింగం ఆద్యంతములు లేనిది. అనంతమైనది. నిరాకారమైనది.

లి- యనగా లీలయతే. నామ రూపములు లేనట్టిది. (లయమైనట్టిది) గం-యనగా గమయతే. జీవన గమనాన్ని సార్థకం చేసుకొనుటకు నామ రూపములతో కలిసి జీవించుట అని అర్థము.

ఉపవాసము అనగా‌ నిరాహారంగా ఉండటం కాదు. ‘ఉప’ అనగా సమీపము. ‘వాస’ అనగా వుండుట. దైవమునకు సమీపముగా ఉండుటయే ఉపవాసం. ఉపవాసం ఉన్నప్పుడు మనస్సును నియంత్రించి భగవంతుని వైపు మళ్ళించడం సులభం. తద్వారా దినమంతయు దైవచింతనలో ఉండి, దైవమునకు సమీపంగా ఉండుట సులభమగును. ఆహారం తీసుకొన కపోవటం నిజమైన ఉపవాసం కాదు. మన ఆలోచనలు, మాటలు, చేతలు పవిత్రంగా ఉంచుకొనుటయే నిజమైన ఉపవాసము.

జాగరణ అనగా నిద్రించకుండా ఉండుట. అనగా మన ఆలోచనలు,మాటలు, చేతలు పవిత్రంగా వుంచుకొనవలెనన్న ఎరుకతో వుండుట.

బిల్వపత్రం: బిల్వ పత్రము మూడు దళములతో కూడి ఉంటుంది. ఇది మానవులను ప్రభావితం చేసే త్రిగుణములయిన సత్వరజస్తమో గుణములను సూచిస్తుంది. విచక్షణ, భక్తి, నిర్లిప్తత వంటి భావాలను పెంపొందించుకొనుట వలన సత్వరజస్తమో గుణాలను అధిగమించవచ్చును.

మహాశివరాత్రి సందేశం:
  1. నిరంతర దైవ చింతన.(భజనలు,పూజలు)
  2. ఇంద్రియాల సద్వినియోగం.(జాగరణ)
  3. దైవత్వమును అనుభూతి లోనికి తెచ్చుకొనుట.
  4. శివం – అనగా …అణకువ.అనగా అంహకార రాహిత్యాన్ని తెల్పును.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *