వివేకము లేని పాండిత్యము
వివేకము లేని పాండిత్యము
మహాభారతంలో ఎన్నో కథలు ఉన్నాయి. వీటికి ఉపాఖ్యానాలు అని పేరు. వీటి నుండి ఎంతో నీతిని గ్రహించవచ్చు.
అరణ్యవాసంలో గడుపుతున్న సమయంలో పాండవులు ఎన్నో తీర్థాలు, తపోవనాలు దర్శించి ఎందరో మహర్షులను సేవించారు. ఒక్కొక్క ఆశ్రమానికి తపోవనానికి వెనుక చరిత్ర ఉంది. ఇటువంటి వాటిలో గంగాతీరంలో ఉన్న రైభ్యుడి చరిత్ర ఒకటి.
రైభ్య మహామునికి ఇద్దరు కుమారులు. పరావసువు, అరావసువు. ఇద్దరూ శాస్త్రాలు క్షుణ్ణంగా అభ్యసించి పండితులనిపించుకున్నారు. ఒకసారి రైభ్యుడు తన కుమారులు నిద్దరిని, బృహద్యుమ్న మహారాజు తలపెట్టిన యజ్ఞాన్ని జరిపించమని పంపాడు. వారిద్దరు తండ్రి ఆజ్ఞ ప్రకారము బయలుదేరి వెళ్లారు. ఒకరోజు రాత్రి పరావసువు తన తండ్రి ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. ఆ చీకట్లో వనంలో ఒక వృక్షం క్రింద జంతువులాంటిది ఉన్నట్లు అతనికి కనుపించింది. వెంటనే ముందు వెనుక చూడక కొట్టి చంపివేశాడు. దగ్గరికి వెళ్ళి చూస్తే తన తండ్రినే తాను చంపినట్లు తెలుసుకొని భయకంపితుడైనాడు. హడావిడిగా అంత్యక్రియలు జరిపి తెల్లవారేసరికి యజ్ఞశాల చేరుకున్నాడు.
అక్కడ తన తమ్మునికి అంతా వివరించాడు. “ఆరావసూ! మన కుటుంబంలో జరిగిన ఈ దుర్ఘటన వల్ల జరిపించే యజ్ఞానికి ఎటువంటి ఆటంకము జరుగకూడదు. కానీ మన తండ్రికి జరగవలసిన కర్మకాండ జరపడం కూడా మన విధి. నేను లేకుండా నీ వొక్కడివే యజ్ఞాన్ని జరిపించలేవు. కాబట్టి నీవు మన ఆశ్రమానికి తిరిగి వెళ్ళి పితృ కార్యాలన్నీ జరిపి తిరిగిరా. పైగా ఈ యజ్ఞానికి ప్రధాన ఋత్విక్కును నేనే. అందుకని పితృ కార్యం నేను జరుపగూడదు.
ఈ విధంగా తన అన్న ఇచ్చిన ఆదేశాన్ని అరావసువు పాటించాడు. అతనిది నిష్కల్మష హృదయము. వేరే ఆలోచన లేకుండా తనకు అప్పగించిన విధులను మనస్ఫూర్తిగా నిర్వర్తించాడు. అన్ని పనులు ముగించుకొని అతడు యజ్ఞ శాలకు తిరిగి వచ్చాడు.
యజ్ఞశాలలో ప్రవేశిస్తున్న సోదరుని చూచాడు. తన సోదరుని ముఖం, పవిత్రమైన తేజస్సుతో వెలిగిపోతున్నది. అది చూచి పరావసు హృదయం ఈర్ష్యతో మండిపోయింది. అతని మనస్సు కుటిలమైన ఆలోచనలతో నిండిపోయింది. అక్కడ చేరిన బ్రాహ్మణ సమూహాన్ని ఉద్దేశించి బిగ్గరగా “చూచారా ! ఎంత అపచారం జరుగుతున్నదో! ఇతడు ఒక బ్రాహ్మణుణ్ణి చంపి బ్రహ్మ హత్యా పాతకం మూట కట్టుకున్నాడు. యజ్ఞశాలలో ప్రవేశిస్తున్నాడు. ఇక్కడ ప్రవేశించడానికి అతనికి అధికారం లేదు.”
ఈ ఆరోపణ విని అరవసువు అవాక్కయినాడు. తన అన్నగారి ప్రవర్తన ఇతనికి అర్థం కాలేదు. చుట్టుఉన్నవారు తనను వింతగా ఏదో నేరం చేసిన వాడుగా చూస్తున్నారు. తన నిర్ధోషిత్వం ఎలా ఋజువు చేసుకోవాలో అర్థం కావడం లేదు. అగ్రహం పట్టలేక బిగ్గరగా అరిచాడు “అయ్యలారా ! నేను చెప్పింది వినండి. సత్యము పలుకుతున్నాను. ఆయన నా అన్నగారు. మా తండ్రిగారిని చంపినది అతడే. పితృకార్యం పూర్తిచేయమని నన్ను పంపింది అతడే. తాను యజ్ఞానికి ఆధ్వర్యం వహిస్తానని నన్ను పంపేశాడు”.
ఈ మాటలకు అక్కడ సమావేశమయిన వారందరు పెద్ద పెట్టున అపహాస్యం చేశారు. “ఒకడు చేసిన పాపాన్ని తన నెత్తిన వేసుకున్నాడు పాపం !”
అరవసువుకు దిక్కుతోచలేదు. చేయని నేరానికి బాధ్యుడని అనడమే గాకుండా అసత్యము పలుకుతున్నాడని కూడా అనిపించుకున్నాడు. తాను నిష్కల్మష హృదయుడైన అతనికి ఇది భరింపరానిది అయింది. ఉద్వేగాన్ని అణుచుకో
లేక గిరుక్కున తిరిగి సరాసరి అరణ్యానికి పోయి కఠిన తపస్సు ప్రారంభించాడు.
అతని తపస్సుకు మెచ్చి భగవంతుడు ప్రత్యక్షమై వరము కోరుకోమన్నాడు. తపోదీక్షవల్ల, భగవంతునిపై నిరంతర ధ్యానమువల్ల అతనిలో ఉండిన కోపతాపాలు, ద్వేష భావాలు పూర్తిగా నశించాయి. అందుకని తనవలెనే ఇంకెందరో తన అన్నగారి దుష్టచింతనకు గురి అవుతారని భయపడి అన్నగారి మనస్సును మార్చి మంచివానినిగా చేయమని కోరాడు.
పరావసువు, అరావసువు ఇద్దరూ శాస్త్రాధ్యయనం చేసినవారే. అన్న పరావసువు కుటిల మనస్సుతో ఇతరులకు అపకారం తల పెట్టాడు. తమ్ముడు అరవసువు నిర్మల మనస్సుతో, విద్యుక్త ధర్మాలు నిర్వర్తించి తనకు అపకారం చేసిన వారికి కూడా ఉపకారమే తలపెట్టాడు.
పాండిత్యము ఒక్కటే మానవుణ్ణి ఉత్తముడిగా చేయదు. మనోవా క్కాయ కర్మలలో నిర్మలత్వమే మానవుణ్ణి మహా మానవుడిగా, మాధవుడి వద్దకు చేరుస్తుంది.
ప్రశ్నలు:
- పరావసువు తలపెట్టిన చెడ్డ పని ఏది?
- అరావసువు ఉత్తముడని ఎట్లు చెప్పగలరు?
- ఈ కథలో మీరు గ్రహించు నీతి ఏది?