లోభము
లోభము
లోభము అనగా పిసినారితనము ఉన్న వానికి సుఖశాంతులు సున్న. అతనివద్ద ఉన్న ధనము అతనికి ఉపయోగపడదు. మరొకరికి కూడా ఉపయోగపడదు.
ఎందుకంటే లోభి అడుగడుగునా తన ధనం ఎక్కడ హరించుకుపోతుందో అని భయపడుతూ ఉంటాడు. ఒక పరమలోభి కధ చెప్పుకుందాము. ఇద్దరు సోదరు లుండేవారు. ఒకరు లోభి, మరొకరు మహా లోభి. వారెంత పిసినారులంటే ఖర్చు అవుతుందని కడుపునిండా భోజనం అయినా చేసేవారు కాదు. దేవునికి పూజ చేసినపుడు, నైవేద్యానికి పెట్టిన పదార్థాలు దేవుడు ఎక్కడ తింటాడో అని, దేవునికి చేయి చూపించి తామే తింటారు. దీనికి ఇంకొక కారణం గూడా ఏం చెప్పేవారంటే నైవేద్యంకోసం ఉంచిన కలకండను అక్కడ ఎక్కువసేపు ఉంచితే ఏ చీమలో తిని పోతాయని వారి భయం.
ఒకనాడు వారి దగ్గరి బంధువు చనిపోయాడని వార్త తెలిసింది.ఉదయాన్నే బస్సు ఎక్కి వెళితే ఖర్చు అవుతుందని పెద్దవాడయిన మహాలోభి వేకువనే లేచి కాలినడకన వెళ్లి పరామర్శచేసి వస్తానని అన్నాడు.
వేకువజామునే లేచి అన్న ప్రక్క ఊరు వెళ్ళాడు. అన్న అటు వెళ్ళగానే తమ్ముడు దీపాన్ని ఆర్పివేసి కిటికీలో ఉంచాడు. అప్పుడు అతనికి చీకట్లో ఒక తేలు కుట్టింది. నొప్పితో బాధపడ్తున్నాడు. రెండు మైళ్ళు నడిచి వెళ్ళిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది. వెంటనే వెనక్కు తిరిగి ఇంటికి వచ్చాడు.
“అన్నా ఎందుకు తిరిగి వచ్చావని” తమ్ముడు అడిగాడు.
“తమ్ముడూ! నీవు నేను వెళ్ళగానే దీపం ఆర్పావో లేదో అని అనుమానం వేసి వచ్చాను” అన్నాడు. దానికి తమ్ముడు “అన్నా ఎంత పని చేశావు! దీపంలో నూనెను గురించి ఆలోచించావుగాని నీ చెప్పులు ఇంత దూరం తిరిగి వచ్చి వెళ్ళడానికి ఎంత అరిగిపోయాయో ఆలోచించావా?” అన్నాడు.
“తమ్ముడూ? నన్ను అంత తెలివిలేనివాడనుకున్నావా? చెప్పులు నా చేతుల్లో పట్టుకొని ఒట్టి కాళ్ళతో తిరిగాను” అన్నాడు.
ప్రశ్నలు:
- లోభిసోదరులు దేవుని ఎడల ఎటువంటి లోభత్వం చూపించేవారు?
- సోదరుల లోభ గుణం ఎటువంటిది?
- మహాలోభి ఏమి చేసాడు?
- మహాలోభి ఏమి ఆలోచించాడు?