నందనారు
నందనారు
నందుడు సుమారు ఆరువందల సంవత్సరాల క్రిందట ఒక హరిజన కుటుంబంలో జన్మించాడు. అతడు బాల్యం నుండే పరమ శివభక్తుడు. తోటి బాలురవలె, వ్యర్థమైన ప్రసంగాలలో కాలం గడువక, మట్టిలో దేవుని విగ్రహాలు చేసిపూజించుకుంటూ, దైవనామాలు పాడుకుంటూ, ఆ విగ్రహాలచుట్టూ, నృత్యం చేసుకుంటూ, కాలంగడిపేవాడు, తవ దేవుళ్ళుకు ఉత్సవాలు – ఊరేగింపులు జరిపేవాడు. ఆదనూరులోని శివాలయం యొక్క ఎత్తయిన గోపురాన్ని విస్మయంతో చూస్తూ ఉండేవాడు. అతని భావనలో భగవంతుడు ఉన్నతుడు, సర్వవ్యాపి, సర్వశ క్తిమంతుడు. ఏమయినాసరే దేవుణ్ణి చూడాలని అతనికి బలమైన కోరిక ఉండేది. నందుడు పెద్దవాడయేకొలది అతని భావసంపద, భక్తి పారవశ్యము ఎక్కువ కాసాగాయి. దేవుని తృప్తికొరకు ఏదయినా చేయాలని ఆతురత పడేవాడు. లేని అధములలో జన్మించిన తాను భగవంతునికి ఏమిసేవ జేయుగలడు? తనను దేవాలయాల పరిసరాలలోనికి కూడా రానివ్వరు. అతనికి ఏమి చేయాలో లోచలేదు.
ఒకనాడు హఠాత్తుగా నందుడికి ఒక ఆలోచనవచ్చింది. “నేను దేవాలయంలో నగారాలకు ఢంకాలకు చర్మం ఎందుకు తయారు చేసి ఇవ్వకూడదు ?” అనుకున్నాడు. వెంటనే వెళ్ళి ముతక చర్మం తెచ్చి, తడిపి, పదును పెట్టి శుభ్రంచేసి, కావలసిస పరిమాణాల్లో కోసి దేవాలయం వద్ద ఇచ్చేవాడు. ఈ పనులు చేసే సమయంలో భగవంతుని శక్తిని, గొప్ప దనాన్ని వర్ణించుకుంటూ ఉండేవాడు. ఒక్కొక్కసారి తన్మయత్వంలో పాటలు పాడుకుంటూ గడిపేవాడు, కాని ఇంతలోనే నిరాశ ముంచుకొచ్చేది. తనను దేవాలయంలోనికి రానివ్వరు గదా అని. దేవాలయంలోపల అనేకమంది భక్తులు, శివలింగానికి పూజచేస్తుంటారు, దీపారాధన చేస్తుంటారు, కర్పూరహారతి ఇస్తుంటారు. అవన్నీ ఎంత బాగుంటాయో అన్న ఆలోచన వచ్చేది.
ఒకనాడు ఒక పండితుడు “పవిత్రక్షేత్రం చిదంబరంలో నటరాజస్వామిని దర్శించినవారికి పునర్జన్మ లేదు” అని చెప్పడం విన్నాడు. ఇంకా పండితుడు చిదంబర దేవాలయాన్ని, నటరాజ విగ్రహాన్ని ఎంతో అందంగా వర్ణించాడు. ఈ మాటలు నందునిపై మంత్రాలలాగ పనిచేశాయి. అప్పటినుండి, ఏపనిలో ఉన్నా, కూర్చొనిఉన్నా, నడుస్తున్నా, పడుకున్నా, అతని మనస్సులో నటరాజస్వామి తప్ప మరొకరు లేరు.
నటరాజును చూడకుండ నేను ఇంక నిలవలేవని తీర్మానించుకున్నాడు. యజమాని అయిన బ్రాహ్మణుని వద్దకుపోయి “స్వామి ఒక్కసారి చిదంబరం వెళ్ళి నటరాజ స్వామిని చూచేందుకు అనుమతి ఇవ్వండి” అని వేడుకున్నాడు. ఆ బ్రాహ్మణుడు మండిపడి చిదంబరానికి వెళ్తావా? చండాలుడివి నీవు. ఇందుకు నిన్ను దండించాలి. అన్నాడు, కాని నందుడు చలించలేదు. స్వామి అనుగ్రహం వచ్చినపుడే వెళ్తానని అనుకొని ఊరకున్నాడు. తాను భక్తి శ్రద్ధలతో భగవంతుని ప్రార్థించాలి అనుకున్నాడు. కొన్నాళ్ళతర్వాత బ్రాహ్మణుడు నందుని పిలిచి “నందా ! చిదంబరం వెళ్తావా ? పంపిస్తాను. అయితే ఈ రాత్రికి పొలం అంతాకోసేసి కుప్పవేసి రా, నిన్ను చిదంబరం పంపిస్తాను అన్నాడు. నందుడు మహానందంతో పొలంలోకి వెళ్ళి శివుడిమీద పాటలు పాడుకుంటూ తెల్లవారేసరికి పొలం అంతా కోసికుప్పలు వేసి ఉదయాన్నే బ్రాహ్మణుని వద్దకు వెళ్ళి చెప్పాడు. బ్రాహ్మణుడు నమ్మక పొలానికివచ్చి చూచాడు. అతనికళ్ళు మిరుమిట్లు గ్రమ్మాయి. పొలం అంతా పంట కోయబడి కుప్పలుగా వేసిఉంది. బ్రాహ్మణుడు అనుకున్నాడు. “ఇది సాధ్యమా? అంతా మాయగా ఉంది. ఎవరి సహాయం లేక ఇక్కడే ఇంత పొలాన్ని కుప్ప పెట్టడం సాధ్యమా ? ఇది తప్పక దైవలీల తప్ప వేరు గాదు.
చిదంబరానికి వెళ్ళడానికి నందుడికి అనుమతి లభించింది. తన స్నేహితులతో ఆడుకుంటూ పాడుకుంటూ నందుడు చిదంబరం చేరుకున్నాడు. అక్కడ కొందరు అతన్ని నిప్పుల మీద నడవమన్నారు.. నందుడు దేవుణ్ణి తలచుకుంటూ ఆనందంగా నడిచాడు. అతనికి వేడి అంటలేదు. ఇతడు గొప్ప దైవభక్తుడని చూచిన వారందరు కొనియాడారు. పూజారులు స్వయంగా నందుని దేవాలయంలోకి తీసుకొని వెళ్ళి దైవదర్శనం చేయించారు.
మొట్టమొదటిసారిగా నటరాజస్వామిని దర్శించిన నందుని ఆనందానికి అవధులు లేవు. పారవశ్యంతో “నటరాజా నటరాజా” నర్తన సుందర నటరాజా అని పాడడం మొదలు పెట్టాడు. పూర్తి తన్మయత్వంతో పాడి, పాడి అచేతనంగా క్రింద పడిపోయాడు. నందనారు ప్రాణాలు నటరాజస్వామిలో లీనమయ్యాయి.
ప్రశ్నలు :
- ఇతర బాలురకు అతనికి గల భేదమేది?
- భగవంతుని సేవలో అతడు ఎట్లు పాల్గొన్నా డు?
- నందుడు బాల్యంలో భక్తి ఎట్లు ప్రదర్శించాడు.
- నందుడు నిజమైన భక్తుడని యజమాని అయిన బ్రాహ్మణుడు ఎట్లు గ్రహించాడు?
- చిదంబరంలో నందుని భక్తి ఎట్లు వెల్లడి అయింది?
[Illustrations by G. Vishweshwaran, Sri Sathya Balvikas Student]
[Source: Stories for Children-II, Sri Sathya Sai Books & Publications, PN]