పనికిరానిది లేదు

Print Friendly, PDF & Email
పనికిరానిది లేదు

పూర్వకాలంలో బాలురందరూ “గురుకులం” లో చేరి అక్కడ వుంటూ శాస్త్రాభ్యాసం చేస్తూ వుండేవారు. విద్యాభ్యాసం తర్వాత గురువుల ఆశీస్సుల నందుకొని ఇళ్ళకు చేరి జీవితాధారాన్ని ఏర్పరచుకొని నిత్యజీవితంలో ప్రవేశించే వారు.

అదే రీతిగా ఇద్దరు శిష్యులు తమ విద్యాభ్యాసం ముగించి, ఇళ్ళకు చేరడం కోసం గురువుగారి వద్దకు వచ్చి అతివినయంగా నిలబడి “గురుదేవా! మీరు సకల విద్యలు నేర్పారు. జన్మజన్మలా తమకు మేము ఋణపడియున్నాము. మన ఆర్య సాంప్రదాయాన్ని అనుసరించి మేము గురుదక్షిణ సమర్పించవలసి ఉంది. కాబట్టి మమల్మి అనుగ్రహించి తమకు గురుదక్షిణగా యియవలసిన వస్తువుని తెలియజేయ కోరుతున్నాము” అని ప్రార్ధించారు.

దానికి ఆ గురువు ఆ శిష్యుల ప్రవర్తనకు ప్రసన్నుడై వారిని ఇంకా వివేకవంతులుగా చేయదలచి, “నాయనలారా! మీ గురుభక్తికి మెచ్చాను. మీరు మన ఆశ్రమానికి వెనుక వైపున ఉన్న అరణ్యానికి వెళ్ళి ఎందుకూ పనికిరాని ఎండిన ఆకులు తెచ్చి నాకు గురుదక్షిణగా ఇవ్వండి” అన్నాడు. ఆ గురువుగారు అట్టి కోరిక ఎందుకు కోరారో వారికి అర్ధము కాలేదు. అయినప్పటికి గురువుగారి ఆజ్ఞ శిరసా వహించి, అడవికి బయలుదేరి వెళ్ళారు.

వారు అడవికి చేరగానే ఒక చెట్టు క్రింద ప్రోగుపడివున్న ఎండిన ఆకులను చూశారు. అవి ఎవ్వరికీ పనికిరావని భావించి ఎంతో ఆనందంతో వాటిని ఎత్తుతుండగా ఒక వృద్ధుడు వారివద్దకు వచ్చి “అయ్యా! నా ఆకులు మీరెందుకు పాడుచేస్తున్నారు? నేను వాటిని ఎంతో శ్రమపడి ప్రోగు చేసుకొన్నాను. వాటిని తగులబెడితే చక్కటి బూడిద అవుతుంది” అది మా పొలంలో వేస్తే చక్కటి ఎరువై ఎక్కువ పంట పండుతుంది. నా ఆకులను నాకు వదిలేయండి. మీరు తీసుకు వెళ్ళడానికి వీలులేదు” అని అటకాయించాడు.

వారిద్దరూ ఆ ఆకులను వదలివేసి ఇంకా కొంచెము దూరము వెళ్ళారు. అక్కడ ముగ్గురు స్త్రీలు ఎండుటాకులు ఏరుకొని గంపల లోనికి ఎత్తుకొంటున్నారు. అది చూచి “మీరు వీటిని ఏం చేస్తారు?” అని ప్రశ్నించారు. అంత వారు ముగ్గురు ఈవిధంగా సమాధానం చెప్పారు.

  1. వ స్త్రీ :- సోదరా! నేనీ ఆకులు తీసుకొని వెళ్ళి నీళ్ళ పొయ్యి క్రింద వేసుకొని నీరు కాచుకుంటాను. ఆ నీటిని స్నానాలకు, బట్టలు ఉతుక్కోడానికి ఉపయోగిస్తాను.
  2. వ స్త్రీ :- వీటిని జాగ్రత్తగా ఏరి, ఒకదానికొకటి చేర్చికుట్టి, విస్తళ్ళు తయారుచేసి, వాటిని అమ్ముకొని తద్వారా నేను జీవిస్తున్నాను.
  3. వ స్త్రీ:- నేను ఈచెట్టు ఆకులు మాత్రం ఏరి తీసుకొని వెళ్ళి మా వారికిస్తాను. వారు మంచి ఆయుర్వేద వైద్యులు. వీటిని చూర్ణం చేసి చక్కటి మందు తయారు చేస్తారు. మందువల్ల చాలా రోగాలు నయం అవుతాయి.

అంత వారిద్దరు వాటి ఉపయోగాల్ని తలచుకొంటూ మరింత ముందుకు వెళ్ళారు. అక్కడ ఒక ఎత్తయిన చెట్టు కనిపించింది. అక్కడ ఆగి దాని క్రిందనున్న ఎండు ఆకులు తీసుకొని వెళదామా అని అనుకొంటున్నారు. అంతలో ఒక పక్షి వచ్చి అక్కడ ఉన్న ఒక సన్నని ఎండు ఆకు అందుకొని పైకి ఎగిరిపోయింది. అక్కడనే నిలబడి వారిద్దరు దాన్ని పరీక్షగా చూస్తున్నారు. అది ఆ ఆకును పట్టుకొని దగ్గరలో ఉన్న ఒక చెట్టుపైకి ఎగిరి, ఆ చెట్టుకొమ్మ మీద తాను తెచ్చిన సన్నటి ఆకులతోను, గడ్డితోను గూడు కడ్తున్నది.

ఆ శిష్యులిద్దరూ నిరాశ చెంది వెనక్కి తిరిగి గురుకులము చేరుకుందామని బయలుదేరారు. దారిలో ఒక చెరువు కనిపించింది. ఆ చెరువులో ఒక ఎండుటాకు తేలుతూవుంది. అది చూచిన వారిలో ఒకడు “ఆ ఎండుటాకు ఎవ్వరికి పనికిరాదు. దానిని తీసుకొనివెళ్ళి మన గురువుగారికిద్దాం” అన్నాడు. పాపం ఇద్దరూ ఎంతో శ్రమపడి దానిని బయటకు తీశారు. తీరా చూసేసరికి దానిమీద రెండు పెద్ద చీమలు ప్రాకుతున్నాయి. వీరిద్దరినీ చూసి అవి ప్రాకడం మాని తలఎత్తి వీరివంక చూశాయి. వాటి వాలకం చూస్తుంటే “దీనిని పాడు చెయ్యకండి, ఇది మా జీవన నావ. దీనివల్లనే మా ప్రాణాలు రక్షింపబడి, చెఱువునుండి బయటపడ్డాం” అన్నట్టు గా అనిపించింది.

వెంటనే వారి ప్రయత్నం విరమించి గురువుగారిని చేరారు. వారి ముఖాలు కళాహీనంగా కనుపించాయి. జీవితంలో ఓడి పోయిన వారివలే వున్నారు. గురువుగారి ముందు నిలబడి వినమ్రతతో వారి విచారాన్ని వ్యక్తం చేస్తూ, “గురుదేవా! ఎండుటాకుల వల్ల కూడా ఎంతో ఉపయోగం కనిపించింది. నిరుపయోగమైన ఆకులను కూడా మీకు తెచ్చి ఇవ్వలేక పోయాము, మీరు కోరిన యీ చిన్న గురుదక్షిణ కూడా మేము ఇవ్వ లేకపోయాము. మమ్మల్ని మన్నించండి” అని ప్రార్ధించారు.

అది విన్న గురువుగారు ఎంతో ఆనందంతో గంభీరంగా “చూడండి బిడ్డలారా! నాకు కావలసిన గురుదక్షిణ నాకు దక్కింది. మీరు ఈనాడు నేర్చుకొన్న విజ్ఞానమే నాకు గురుదక్షిణ. ఈ ప్రపంచంలో ఎండిన ఆకు కూడా మానవులకు, చీమలకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. ప్రతి మానవుడూ తన శరీరాన్ని సక్రమంగా ఉపయోగపెడితే ఇంకా ఎంతో మేలు జరుగుతుంది. అందుచేత మీ శరీరాన్ని మీరు చాలా జాగ్రత్తగా కాపాడుకొంటూ చక్కగా మీ జీవితాన్నే కాకుండా మిగిలినవారి జీవితాలను గూడా సుఖమయం చేసి, ఆనందించేటట్టు చెయ్యండి. ఆర్తులకు అవకాశం ఉన్నంతవరకూ అన్ని విధాలా సహాయం చేయండి. రోగులను, వృద్ధులను, అజ్ఞానులను, ఆర్తులను ఆదరించండి. మీరీనాడు నేర్చుకొన్న పరమ సత్యాన్ని జీవితాంతము వరకు మరువక జాగరూకులై యుండండి” అని ఆశీర్వదించి పంపించివేశాడు.

ప్రశ్నలు:
  1. పనికిరాని ఎండుటాకులు తేవడానికి అడవికి వెళ్ళిన ఇద్దరు శిష్యులు నిరాశచెంది ఎందుకు తిరిగివచ్చారు?
  2. గురువుగారు ఎండుటాకులను గురించి మానవ శరీరాన్ని గురించి నేర్పిన గుణపాఠ మేమిటి?
  3. మరేవైనా రెండు పనికిరాని వస్తువులని మీరు భావించే వాటిని పేర్కొని వాటి ఉపయోగాన్ని వివరిస్తూ వ్రాయుము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *