పరిత్రాణాయ సాధూనాం – వివరణ
పరిత్రాణాయ సాధూనాం – వివరణ
పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం |
ధర్మ సంస్థాప నార్థాయ సంభవామి యుగే యుగే ||
జ్ఞాన యోగము (4-8)
సన్మార్గంలో నడుచుకునే వారికి, సాధుశీలురకు మాత్రమే భగవానుని రక్షణ లభించును. వారి కొరకు మాత్రమే ఆయన అవతరించును. ధర్మాన్ని పునఃస్థాపించుట కోసం, మంచిని రక్షించి, చెడును నాశింపచేయుటకై తనను తాను సృజించుకుంటున్నాడు.
ఉదాహరణకు: ప్రహ్లాదుని రక్షించడానికి మరియు హిరణ్యకశిపుని అంతం చేయుటకు భగవంతుడు నరసింహావతారంగా అవతరించాడు. ద్వాపర యుగంలో కంసుడిని, కౌరవులను అంతం చేయుటకు పాండవులను రక్షించుటకు శ్రీకృష్ణునిగా అవతరించాడు. త్రేతాయుగంలో రావణుడిని సంహరించుటకు శ్రీరామునిగా అవతరించాడు. ఈ కలియుగంలో మానవాళిని ఉద్ధరించుటకై, సంస్కరించుటకై భగవాన్ శ్రీ సత్య సాయి బాబా అవతరించారు.
ఒక ప్రదేశంలో కొద్దిపాటి అల్లరి జరిగితే, వాటిని అణచటానికి ఒక కానిస్టేబుల్ చాలు. అతనికి సాధ్యం కాకపోతే సబ్-ఇన్‌స్పెక్టర్ వస్తాడు. మరీ పరిస్థితి విషమించినప్పుడు , పోలీసు సూపరింటెండెంట్ వస్తాడు. అదీ సాధ్యం కాకపోతే డి.ఐ.జి వస్తాడు. అదేవిధంగా ఆన్యాయాలు, అక్రమాలు ప్రబలినప్పుడు, ధర్మాచరణ కుంటుపడినప్పుడు మానవజాతి మొత్తం నైతిక వినాశనానికి గురవుతున్నప్పుడు, సాధువులు, మహాత్ములు, ఙ్ఞానులు వచ్చి వారి వారి ప్రయత్నాలు చేస్తారు.
‘భగవంతుడే స్వయంగా ఎందుకు అవతరించాలి? ఆయన ఆజ్ఞ మేరకు దేవదూతల ద్వారా ధర్మాన్ని ఎందుకు పునరుద్ధరించకూడదు?’. దీనికి ఉదాహరణగా ఒక చిన్న కథ :-
ఒకనాడు అక్బర్ చక్రవర్తి సభలో “ధర్మోధ్ధరణకై భగవంతుడే మానవాకారం ధరించి రావాల్నా?” అనే చర్చ జరిగింది.
ఆ సందర్భంలో అక్బర్ చక్రవర్తి “హిందూ మతానికి సంబంధించిన ఈ అవతార సిద్ధాంతంపై నాకు విశ్వాసం లేదు” అని అన్నాడు. అప్పుడు ఆస్థాన గాయకుడైన తాన్సేన్ “నాకు ఒక వారం రోజులు వ్యవధి ఇస్తే సమాధానం చెప్తాను” అన్నాడు.
వారం రోజుల తర్వాత ఒకనాటి సాయంత్రం అక్బరు చక్రవర్తి తన పరివారంతో నౌకావిహారం చేస్తున్నాడు. అతనితోపాటు చక్రవర్తి కొడుకు, తాన్సేన్ ఇద్దరూ వున్నారు. నౌక కొంతదూరం నీటిలో వెళ్లిన తర్వాత తాన్సేన్ తన వెంట తెచ్చిన యువరాజు వలే ఉండే ఒక బొమ్మను నీటిలో పడవేశాడు. “అయ్యో! అయ్యో!
ఇంకేముంది? యువరాజు నీటిలో పడి పోయాడు” అంటూ కేకలు వేశాడు.
తాన్సేన్ అరుపులు వినిన అక్బర్ చక్రవర్తి తన కుమారుని రక్షించటానికి నీటిలో దూకాడు. అక్బర్ ను నీటి నుండి నౌక ఎక్కడానికి సహాయ పడిన తర్వాత తాన్సేన్ “మహారాజా! మీ కుమారుడు సురక్షితంగానే ఉన్నాడు. ఇది నేను ఆడిన నాటకం మాత్రమే” అన్నాడు. అప్పుడు అక్బర్ కోపంతో “ఎందుకు ఈ నాటకం” అని గర్జించాడు. తాన్సేన్ వినయంతో “మన్నించండి మహారాజా! నేను చెప్పే విషయం వినండి. యువరాజు నీటిలో పడిపోయాడు అనే కేక వినగానే తమరు తక్షణమే నీటిలోనికి ఎందుకు దూకారు? ఇంత మంది పరివారం మీ వెంట ఉన్నారు. ఎవరినైనా ఆజ్ఞాపించ ఉండవచ్చును కదా! మీరు ఎందుకు ఈ రక్షణకు పూనుకొన్నారు? మీ పుత్రప్రేమ అంత గాఢమైనది కనుక మరియు పరిస్థితి ప్రమాదమైనది కనుక. అదేవిధంగా మునిగి పోతున్న బిడ్డ వంటి ధర్మాన్ని రక్షించడానికి ఈ జగత్పతి తానే స్వయంగా వస్తాడు. అది చాలా తీవ్రమైన పరిస్థితి. దాన్ని చక్కబెట్టడం వేరే ఎవరి వల్ల కాదు.”
“భగవంతునికి మానవుల పట్ల ఉన్న ప్రేమయే అవతరణకు ప్రేరణ” అని తాన్సేన్ చక్కగా సమాధానం ఇచ్చాడు.