Part III-te

Print Friendly, PDF & Email
శ్రీ సత్య సాయి దివ్య జీవితము దివ్య సందేశముపై – ప్రశ్నా వినోదము
Part – III
  1. వారి జీవిత తత్వము మరియు విద్యాభ్యాసము(నకు) మూలమైన ఆదర్శములను / ఏ ప్రాథమిక సూత్రములపై ఆధారమైనదో తెలపండి?

    జ: బాబా వారి జీవన విధానము, విద్యాభ్యాసము ప్రబోధించు ఆరు ఆదర్శములు / మానవతా విలువలు – 1. సత్యము, 2. ధర్మము, 3. శాంతి, 4. ప్రేమ, 5. అహింస, 6. త్యాగము

  2. మానవతా విలువ అనగా ఏమి?

    జ: మానవునికి విలువ ఆపాదించునది. మానవుడు ఎందు నుండి వచ్చాడో ఆ యొక్క స్వస్థానమును, స్వరూపమును గుర్తించటమే.

  3. 3 H V అనగా?

    జ: 3H అనగా – Head, Heart, Hand (శిరము, హృదయము, కరము); V – Value – విలువ

  4. నైతిక నిష్ఠ/అఖండత/సజ్జనత/సమగ్రత కలిగిన వ్యక్తిత్వము అనగా?

    జ: ఎవరైతే ఆదిశంకరాచార్యుని మనస్సు(Head), బుద్ధుని హృదయము (Heart), జనకుని కరములు (Hands) కలిగి ఉంటారో వారు

  5. ఆరు మానవతా విలువలలో ప్రేమ అంతర్వాహినిగా ప్రవహిస్తుంది అంటారు. ఎలా?

    జ: తలంపులో, మాటలో ప్రేమ ఉన్నప్పుడు అది సత్యము అవుతుంది. కర్తవ్య నిర్వహణ, ఆచరించు కర్మలు ప్రేమపూరితమైనప్పుడు అదియే ధర్మము, భావనలో ప్రేమ ఉంటే అదియే శాంతి, అవగాహనలో ప్రేమయే అహింస, నిస్వార్ధమైన సేవయే త్యాగము.

  6. శ్రీ సత్య సాయి విద్యా విధానములోని ఆదర్శములను తెలుపుము?

    జ: శ్రీ సత్య సాయి విద్యా విధానము యొక్క ఆదర్శములు – నాలెడ్జ్, నైపుణ్యము/ప్రవీణత, సంతులనము, అంతర్దృష్టి, పరిజ్ఞానము, సేవ. సత్య శోధన లౌకిక, ఆధ్యాత్మిక జ్ఞానమును ఇస్తుంది. ధర్మమనగా మూడు రకములైనటువంటి ప్రావీణ్యతను సంపాదించుట – స్వీయ సాయ ప్రావీణ్యత, నైతిక ప్రావీణ్యత, సాంఘిక ప్రావీణ్యత. శాంతి శోధన సంతులనమును ప్రసాదిస్తుంది. సంకల్పమునకు / ఆలోచనకు మరియు కర్మకు మధ్య సంతులనము. ప్రేమ ద్వారా అంతర్దృష్టి, అహింస ద్వారా తత్వ స్పృహ బోధపడుతుంది. ఇక్కడ ప్రేమ అనగా సత్యమార్గంలో వాస్తవమును తెలుసుకొనుట. అహింస అనగా ” మామాత్మా సర్వభూతాంతరాత్మ ” అను వాక్యము యొక్క సారము తెలుసుకునుట. అందరిలో ఉండు ఆత్మ ఒక్కటే అదే పరమాత్మ యొక్క అంశము అని అర్థము చేసుకొనుట. త్యాగము నిస్వార్థ ప్రేమకు చిహ్నము.

  7. ఎన్ని విధములైన జ్ఞానములు (knowledge) కలవు?

    జ: బుకిష్ నాలెడ్జ్, సూపర్ ఫిషియల్ నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్, డిస్క్రిమినేటరీ నాలెడ్జ్ (నిత్యానిత్య పరిశీలన), ప్రాక్టికల్ నాలెడ్జ్

  8. ఇండివిజువల్ డిస్క్రిమినేషన్కు ఫండమెంటల్ డిస్క్రిమినేషన్కు భేదం ఏమి?

    జ: వ్యక్తిగత అనుకూలంగా, అనుగుణంగా నిత్యానిత్య పరిశీలన చేసినప్పుడు అది ఇండివిజువల్ డిస్క్రిమినేషన్. నాకు, నీకు జగత్తునకు సత్యము అయినటువంటి నిత్యానిత్య పరిశీలనను ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ అంటారు. ఇది రావాలి. అప్పుడే ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది.

  9. 3Ps అనగా?

    జ: Purity (పవిత్రత), Patience (సహనము,ఓర్పు), Perseverance (స్థిరత్వము పట్టు)

  10. 4 Fs అనగా అవి ఏవి? అవి వేటిని తెలుపుతాయి?

    జ: Follow the Master, Face the Devil, Fight to the End, Finish the Game. ధర్మము, అర్థము, కామము, మోక్షములను తెలుపుతాయి. (సేవ, బంధ విముక్తి ద్వారా ధర్మమును భాగ్యమును సఫలము చేసుకొనుట).

  11. విద్యార్థులు జీవితములో అనుకున్నది సాధించుటకు అలవరచుకోవాల్సినటువంటి 5 Ds ఏవి?

    జ: డకార పంచకములు – అంకిత / సమర్పణ భావము. భక్తి, నియమబద్ధత / క్రమశిక్షణ, విచక్షణ, దృఢ సంకల్పము

  12. మనము త్యజించవలసిన 14 అవాంఛనీయ లక్షణములను తెలుపుము?

    జ: 8 రకములైనటువంటి మదములు – కుల మదము, బల మదము, యవ్వన మదము, సుందర మదము, విద్యా మదము, ధన మదము, పద / అధికార మదము, తపః మదము మరియు 6 అరిషడ్వర్గములు – కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యము

  13. భగవంతుని అర్చించుటకు కావలసిన అష్టపుష్పములు ఏవి?

    జ: అహింస, ఇంద్రియ నిగ్రహము, దయ, క్షమ, శాంతి, తపస్సు, ధ్యానము, సత్యము

  14. విద్యార్థులు వదిలివేయవలసిన ఐదు రకములైన దోషములు / దుర్గుణములు ఏవి?

    జ: చెడు వినుట, చెడు మాట్లాడుట, చెడు చూచుట, చెడు ఆలోచించుట, చెడు చేయుట

  15. మానవులు నాలుకతో సలుపు నాలుగు రకములైనటువంటి పాపములు/ దోషములు ఏవి?

    జ: అసత్యము మాట్లాడుట, అతి భాష, పరనింద, కట్టు కథలు కల్పించుట / వృధా మాటలాడుట

  16. కోరికలపై అదుపు నియంత్రణలో ఉన్నటువంటి నాలుగు భాగములు —

    జ: ఆహారమును వృధా చేయరాదు – అన్నము పరబ్రహ్మ స్వరూపము
    ధనమును వృధా చేయరాదు – ఐశ్వర్యము భగవంతుని కటాక్షము
    సమయమును వృధా చేయరాదు – భగవంతుడు కాలస్వరూపుడు
    శక్తిని వృధా చేయరాదు – శక్తి దైవము యొక్క కానుక /వరము.

  17. మన యొక్క నిజమైన బంధుమిత్రులు –

    జ: సత్యము – తండ్రి
    ప్రేమ – తల్లి జ్ఞానము
    వివేకము – కుమారుడు
    శాంతి – కుమార్తె
    భక్తి – సోదరుడు
    యోగులు – స్నేహితులు

  18. Fill up the blanks:
    1. Study in order to….
    2. Truth is more fundamental than….
    3. Spirit of love is ….
    4. Science is…..
    5. Body is a ….. Mind is a ….
    6. Don’t follow… Don’t follow …. follow your….

    జ:

    1. Study in order to Steady
      (విద్య నిలకడకు)
    2. Truth is more fundamental than atom
      (సత్యము పరమాణువు కన్నా మూలమైన ముఖ్యమైన సూక్ష్మమైన ఆధారము)
    3. Spirit of love is spirituality
      (ప్రేమకు ఊపిరి, ప్రాణము – ఆధ్యాత్మికత)
    4. Science is split of Love
      (సైన్స్ అనగా ప్రేమ యొక్క విభజన)
    5. Body is a Water Bubble Mind is a Mad Monkey
      (శరీరము నీటి బుడగ వంటిది మనస్సు పిచ్చి పట్టినటువంటి కోతితో సమానము)
    6. Don’t follow the Body Don’t follow the Mind follow your Conscience
      (దేహమును అనుసరించవద్దు, మనస్సు అనుసరించవద్దు, అంతరాత్మను అనుసరించవలెను)
  19. MAN, నరుడు, మానవ, మోక్షము, సమాధి, History, Human, Hindu

    జ: M=Maya, A= Atma, N= Nirvana మాయ, ఆత్మ, నిర్వాణ – మాయను నిర్మూలము గావించుకుని, ఆత్మను సాక్షాత్కరింపచేసుకుని, నిర్వాణమును / మోక్షమును పొందుట
    ‘మానవ’ – ‘మా’ అనగా అజ్ఞానము, మాయ, అంధకారము
    ‘న’ అనగా ఇట్టి అజ్ఞానము, అంధకారము’ చీకటి లేకుండా చేసుకొనుట
    ‘వ’ అనగా వర్తించుట
    ఈ విధముగా సత్యమార్గంలో వర్తించుటయే మానవత్వం యొక్క సహజ అర్థము.
    ‘మానవ’ – మా + నవ (నూతనము కానటువంటి వాడు)
    ‘మోక్షము’ – మోహ క్షయము (మోహ – భ్రమ, మాయ; క్షయము – నాశనము చేయునది)
    ‘సమాధి’ – సమ స్థితి (సుఖదుఃఖములను, లాభనష్టములను, నిందాస్తుతులను సమరీతిలో స్వీకరించుట, ద్వందాతీతులుగా వర్తించుట)
    History – His Story (అతని (దైవము) చరిత్ర)
    ‘నరుడు’ – ‘న’ అనగా కాదు; ‘రః’ అనగా నాశనం (నాశనం కానటువంటి వాడు – నరుడు)
    ‘Human’ – మానవత్వం కలిగి ఉండుట
    మానవజాతి యొక్క మహిమాన్వితమైన గుణము
    మానవజాతి ని అర్థము చేసుకోగలటం
    కర్తవ్య పరాయణుడిగా ఉండుట
    ఆనందము
    దివ్యత్వము
    ‘HINDU’
    ‘H’ – Humility – వినయము
    ‘I’ – Individuality – వ్యక్తిత్వము
    ‘N’ – Nationality – జాతీయత, దేశాభిమానము
    ‘D’ – Devotion – భక్తి
    ‘U’ -Unity – ఐకమత్యము

  20. శివరాత్రి నాడు స్వామి ప్రసాదించిన ఐదు అక్షరముల మంత్రము–

    జ:WATCH

  21. క్రమపరుచుము – (a) Head, Food, God (b) World, Self, God (c) God Father, Mother (d) Unity, Purity, Charity, Divinity

    జ:

    1. Food- Head- God
    2. God – World – Self
    3. Mother – Father – God
    4. Charity – Unity – Purity – Divinity.
  22. మనము గుర్తుంచుకోవలసిన / జ్ఞప్తియందు ఉంచుకోవలసిన మరియు మర్చిపోవలసిన రెండు విషయములు —

    జ: ఇతరులు చేసిన కీడును, మనము ఇతరులకు చేసిన మేలును మరిచిపోవలెను.
    మనకు ఇతరులు చేసిన మేలును, ఇతరులకు మనము చేసిన కీడును మరచిపోరాదు, గుర్తుపెట్టుకోవాలి.

  23. ప్రపంచంలో అత్యంత ధనికుడు ఎవరు?

    జ: మితమైన కోరికలు కలవాడు ఈ లోకంలో మిక్కిలి ధనవంతుడు.

  24. కలి ప్రభావమునకు లోను కానటువంటి వాడు ఎవరు?

    జ: ఎవరి హృదయము దయతో నిండి ఉంటుందో, ఎల్లప్పుడూ సత్యమునే పలుకుతారో, ఎవరు తమ శరీరమును పరోపకారార్థమై ఉపయోగిస్తారో వారు కలి ప్రభావమునకు లోను కారు.

  25. మానవుని నిజమైన ఆభరణములు ఏవి?

    జ: దానము హస్తమునకు ఆభూషణము. సత్యము వాక్కునకు ఆభరణము. చెవులకు పవిత్ర గ్రంథముల శ్రవణము ఆభరణము.

  26. విద్యార్థులు అనుసరించవలసిన నాలుగు పురుషార్థములు ఏవి?

    జ: మైత్రి (స్నేహము), కరుణ (దయ), ముదిత (హర్షము వ్యక్తపరచుట), ఉపేక్ష (తగని వారికి, పనులకు దూరముగా ఉండుట)

  27. స్వామివారు కొన్ని పదములకు ప్రత్యేకమైనటువంటి అర్థమును తెలిపారు. దానిని వివరింపుము? మైత్రి, Foreigners, Forest, Interview

    జ: మైత్రి – My Three – త్రికరణ శుద్ధి – మనో వాక్ కర్మల శుద్ధి
    Foreigners – are far – nears (దూరముగా ఉన్నటువంటి ఆప్తులు)
    Forest – is for Rest
    Interview – to enter view

  28. స్వామివారు ఈ సందర్భంగా ఈ క్రింద తెలిపిన సాదృశ్యములను (పోలిక) ఉపయోగిస్తారు – (a) Lock and Key (b) Garland of Flowers (c) Seed and Tree (d) Registered Letter (e) Postman (f) Mariners Compass (g) Current, wire, bulb, light (h) Car

    జ: a) Lock and Key: మానవుని బంధ హేతువును చేయుటకు, బంధ విముక్తిని గావించుటకు మనస్సే మూలకారణము అని చెప్పుటకు / అనే సత్యమును బోధపరుచుటకు స్వామి దీనిని ఉపయోగిస్తారు.
    b) Garland of flowers: పూమాలలోని దారము ఏ విధంగా అయితే కనపడకుండా మరుగున ఉంటుందో, అదే విధంగా సృష్టిలోని జీవరాశులన్నిటియందు దివ్యత్వము దాగి ఉంటుంది అని బ్రహ్మసూత్రమును వివరించుటకు ఉదాహరణగా స్వామివారి దీనిని వినియోగిస్తారు.
    c) “తత్వ మసి”, “ఏ కోహం బహుశ్యం” ఈ మహా వాక్యముల వివరణకు, ఈ ఉపమానములను స్వామి చెప్తారు. తన నుండి వచ్చిన వృక్షమును చూసి విత్తనం / బీజము ‘అది నేనే’ అంటుంది (“తత్వ మసి” ).
    ఒక చిన్న చెట్టు నుండి కొమ్మలు, శాఖలు, ఆకులు, పువ్వులు, విత్తనములు మొదలైనవి ఏ విధంగా వస్తాయో / ఉద్భవిస్తాయో, అదే విధముగా ఈ సృష్టి అంతా ఒకే ఒక దివ్యత్వము నుండి ఉద్భవించాయి / వచ్చాయి. ఏకము అనేకమైనది.
    d) Registered letter: ఒక రిజిస్టర్ పోస్ట్ వచ్చినప్పుడు దానిని నీవు సంతకం చేసి, స్వీకరించినపుడు మాత్రమే అది మీది అవుతుంది, లేనిచో ఎవరైతే పంపుతారో వారి వద్దకి తిరిగి పంపి వేయబడుతుంది. అదే విధముగా ఎప్పుడైతే పరులు నిన్ను దూషించినప్పుడు తిరిగి ప్రతినింద చేయక నెమ్మదిగా ప్రశాంతంగా ఉన్నచో, ఆ దూషణలు వారికే చెందుతాయి. ఆ దూషించిన వారు కూడా కొద్దిసేపటికి శాంతిస్తారు.
    e) ఒక పోస్ట్మాన్ నీకు అడ్రస్ చేసినటువంటి ఉత్తరములను నీకు అందిస్తాడు, అందులోని విషయములతో ఎటువంటి సంబంధము ఉండదు. ఆ ఉత్తరములలోని మంచి చెడులతో ఎటువంటి సంబంధం ఉండదు. అదేవిధంగా దైవము ఒక పోస్ట్మాన్ లా వ్యవహరిస్తాడు. మన సుఖదుఃఖములకు భగవంతుడు కారకుడు కాదు. అవి మన యొక్క కర్మల ఫలితమే.
    f) దిక్సూచి లోని ముల్లు ఏ విధముగా అయితే ఎల్లప్పుడూ ఉత్తర దిక్కును చూపిస్తుందో, అదే విధంగా భక్తుని దృష్టి ఎల్లప్పుడూ భగవంతుని వైపు మరలి ఉండాలి (సుఖములోనూ దుఃఖములోనూ).
    g) Current – సత్యము, Wire – ధర్మము, Bulb – శాంతి, Light – ప్రేమ. ఈ నాలుగు విలువలు, ఒకదానిపై ఒకటి ఆధారపడి, చేర్చబడి ఉంటాయి / కూర్చబడి ఉంటాయి.
    h) Car మానవ దేహం వలే ఉంటుంది. నాలుగు చక్రములు చతుర్విధ పురుషార్థములను సూచిస్తాయి. చక్రములలో నిండి ఉండు గాలి భగవత్ విశ్వాసము. Steering Wheel మనస్సు. స్విచ్ బుద్ధితో సమానము. ఇంద్రియ నిగ్రహము కారు బ్రేకులు. జీవుడు దానికి డ్రైవరు. కారు యొక్క యజమాని ఆత్మ. యజమాని సూచనల మీద కారు నడపబడుతుంది.

  29. సత్సంగత్వము యొక్క ప్రాముఖ్యమును దుస్సాంగత్యమును విడువ వలయును అని స్వామి అనేక ఉదాహరణలతో, ఉపమానములతో చెప్తూ ఉంటారు. అటువంటి మూడు ఉదాహరణలు తెలుపుము?

    జ: బొగ్గు అగ్ని యొక్క సంపర్కము చేత నిప్పుగా మారుతుంది. తన యొక్క సహజమైన నల్లటి రంగుని విడిచి నిప్పు యొక్క ఎర్రటి రంగును పొందుతుంది. అదే విధముగా ఇనుము కూడా కొలిమిలో నిప్పు యొక్క సాంగత్యం వల్ల ఎర్రగా, ప్రకాశవంతముగా మారుతుంది. అలా కాకుండా తడి, నీరు తగిలిన తుప్పు పట్టి పాడైపోతుంది / నాశనమైపోతుంది. ధూళి వాయువుతో కలిసి పైపైకి పోతుంది పయనిస్తుంది, ఉచ్ఛస్థితిని అందుకుంటుంది. అదే నీటితో కూడినట్లయితే నిమ్నస్థాయికి చేరుతుంది. మానవుడు కూడా సత్ సాంగత్యము చేత ఉద్ధరింపబడతాడు. దుష్టులు యొక్క సాంగత్యముతో దుర్గుణములను అలవరచుకుని పతనమయ్యి అధోగతికి లోనవుతాడు.

  30. వివరింపుము (a) జీవితము ఒక పరిమితమైన సంస్థ / కంపెనీ (b) నీ హృదయములో ఒకే ఒక సోఫా ఉండవలెను (c) మనస్సు ఒక పిల్లి వంటిది (d) Hurry; Worry; Curry

    జ: a) జీవితము ఒక పరిమితమైన / సంస్థ కంపెనీ – జీవించుటకు దేహము అత్యవసరము. ఆనందముగా, ప్రశాంతముగా సుఖమయమైన జీవనము గడపటానికి శరీరంలోని వివిధ అంగముల పనితీరు తెలుసుకొని ఉండవలెను. కళ్ళు చూచుటకు ఉపయోగించటం – దానికి కూడా కొంత పరిధి పరిమితి ఉంటుంది. కాంతి యొక్క ప్రకాశమును కొంతమేరకు మాత్రము చూడగలము. ఉదాహరణకు సూర్యుని యొక్క కాంతిని, ప్రకాశమును నేరుగా కంటితో చూడలేము. కళ్ళు ప్రమాదమునకు గురి అయ్యే అవకాశము కలదు. అలానే చెవుల వినికిడి శక్తి పరిమితముగా ఉంటుంది. ఒక స్థాయి దాటిన తర్వాత శబ్దములను వినలేము, భరించలేము. అదేవిధంగా శరీరములోని వివిధంగములు ముక్కు, చర్మము మొదలగునవి ఒక నిర్దిష్టమైన పరిమితికి లోబడి పని చేస్తూ ఉంటాయి. మితిమీరి వాటిని ఉపయోగములోకి ప్రవేశపెట్టిన, ప్రమాదము సంభవించి, దుఃఖము కలుగుతుందే తప్ప ఎటువంటి ఆనందము ఉండదు. అలాగే రక్తపు పోటు, గుండె కొట్టుకోవడం, నాడి అన్నిటి పనితీరుకు ఒక పరిమితి ఉంటుంది. వివిధ అంగముల పనితీరు పరిధిలో మితిమీరినా, లేక నిర్దేశించిన పరిధికి పనితీరు తగ్గినా శరీరము వ్యాధులకు, అనారోగ్యమునకు లోనవుతుంది. అందులకే మానవ జీవితము / దేహము ఒక పరిమితమైన సంస్థ / కంపెనీ అంటారు. అంతేకాకుండా శరీరమును చెడు వినటకు, చెడు చూచుటకు, చెడు మాట్లాడుటకు చెడు చేయుటకు వినియోగించరాదు.

    b) నీ హృదయములో ఒకే ఒక సోఫా ఉండవలెను – మన హృదయములో ఒకే ఒక ఆసనము ఉండాలి. అది కూడా భగవతర్పితమై ఉండాలి.

    c) మనస్సు ఒక పిల్లి వంటిది – మానవుని మనస్సు పిల్లితో పోల్చబడింది. పిల్లి తన పిల్లను నోట కరుచుకుని, దానిని కాపాడుతూ జాగ్రత్తగా ఒక ప్రదేశము నుండి ఇంకొక ప్రదేశమునకు తీసుకు వెళుతుంది. అదే పిల్లి పంజా విసిరి, దుమికి ఎలుకను నోట కరిచినప్పుడు, అది దాని ప్రాణమును తీస్తుంది. ఈ విధముగా మనస్సు కూడా మంచి తలంపులు, దైవ తలంపులను పట్టినట్లయిన మేలు, హితవు చేస్తుంది అలాకాకుండా దుష్టతలంపులను పట్టినట్లయితే అధోగతికి దిగజారుస్తుంది.

    d) Hurry ; Worry ; Curry – గుండె సంబంధ వ్యాధులకు స్వామివారు మూడు కారణములు చెప్తారు – Hurry ; Worry ; Curry. ఈ తొందరపాటు, చింత మానసిక ఒత్తిడిని కలుగ చేసి, రక్తపు పోటును పెంచుతాయి. అయోగ్యమైనటువంటి ఆహారము రక్తపు సరఫరా మరియు కొలెస్ట్రాల్ స్థాయిల సంతులనాన్ని చెడగొడుతుంది / పాడు చేస్తుంది. అందువల్లనే వైద్యులు మందులతో పాటు ఆహార నియమాలు కూడా పాటించాలి అని చెప్తారు.

  31. వీటికి బాబా వారు ఇచ్చినటువంటి అనువాదము తెలుపుము (a) పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం (b) ఓం సహనావవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వి నావధీతమస్తు మావిద్విషావహై శాంతి శాంతి ఓం శాంతిః శాంతిః శాంతిః

    జ:

    a) “ఎల్లప్పుడూ సేవించు ఎన్నడూ బాధించకు”

    b) కలిసిమెలిసి తిరుగుదాం

    కలసి మెలసి పెరుగుదాం

    కలసి మెలసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం

    కలసి మెలసి కలతలేక చెలిమితో జీవించుదాం

  32. ఈ క్రింది సంభాషణల సందర్భములను వివరించండి
    1. “వారికి కనక ఆహారం ఇచ్చినట్లయితే నీవు పస్తు ఉండవలసిందే”
    2. “నీవు సామాన్య బాలుడువి కావు నీ దివ్య శక్తితో వేల మందికి సాయం చేస్తావు”
    3. “ఎవరికి కావలసిన బట్టలు వారిని ఎంచుకొనివ్వు మిగిలినది నేను తీసుకుంటాను”
    4. “లింగములన్నీ ఇక్కడ ఉన్నాయి”.
    5. “నీకు నా పూర్వతారమైన షిరిడి సాయి పాదముద్రలను ఇస్తాను”.
    6. “భవానీ మాత ఛత్రపతి శివాజీ చేతిలో ఖడ్గమును పెట్టి, హిందూ మత ఉద్ధరణకు నియమించి పురికొల్పెను.
      ఈ శివశక్తి ధైర్యమను ఖడ్గమును పండితులకు ఇచ్చి సనాతన ధర్మ ఉద్ధరణకు నియమించెను”.
    7. “నీ కంఠమున జపమాలను ధరిస్తావు. నీ శిక్ష పూర్తి అయిన పిదప నేనే స్వయంగా జపమాలను ధరింపచేసేదెను”.
    8. “పశుపక్షులు పరస్పరము ఏ విధముగా సహాయపడుచున్నవో గమనించుడు”.
    9. “అయ్యో పాపం! పక్కకు పెట్టానని బాధపడుతున్నాయి. సరే, వాటిని కూడా అనంతపురం తీసుకువెళ్తాను”.
    10. “ఇది నా ట్రేడ్ మార్క్”.

    జ:

    1. ఇవి దివ్య జనని ఈశ్వరమ్మ గారి పలుకులు. బాల్యమునందే బాబా వారు తమ సోదరీమణులను పేదవారికి ధాన్యము, ఆహారము ఇవ్వమని అడిగేవారు. గృహము నందలి పెద్దవారికి సహజముగా ఇది చిరాకుగా ఉండెను. బాబా వారి యొక్క ఈ దాన గుణమును మాన్పించుటకై, ఈశ్వరమ్మ గారు సత్యం చేయి పట్టుకుని వేలితో హెచ్చరిస్తూ ఈ పలుకులు పలికెను.
    2. ఈ మాటలు ఇంగ్లీష్ టీచర్ గారైన మెహబూబ్ ఖాన్ గారు మాట్లాడారు. సత్యం అంటే ప్రత్యేకమైన అభిమానంతో మెలిగేవారు. అప్పుడప్పుడు సత్యం కు ప్రత్యేకంగా తయారు చేసినటువంటి తినుబండారములను ఇచ్చేవారు. సత్యమును తన పక్కన కూర్చుండబెట్టుకొని తల నిమురుతూ ఈ మాటలు పలికెను. సత్యములో దాగి ఉన్నటువంటి దివ్యత్వమును ముందుగా గుర్తించిన మహనీయులలో వీరు ఒకరు.
    3. బాబా వారు పలికిన పలుకులు. తాతగారైన కొండమ రాజుగారు పండుగకు కొత్త బట్టలు కుట్టించుకోవటానికి, బాబా వారిని తమకి ఇష్టమైన, నచ్చిన దానిని ఎంచుకో మన్న సందర్భంలో స్వామి ఈ విధంగా పలికారు.
    4. పాత మందిర నిర్మాణ సమయంలో, స్వామి చూపించినటువంటి స్థలము నందు తవ్వకములు జరుపుతుండగా, గూని వెంకన్న తవ్వుతున్నటువంటి ప్రదేశంలో అనేక పానవట్టములు బయటపడెను, కానీ శివలింగములు మాత్రం కనిపించలేదు. చుట్టూ ఉన్నభక్తులు ఆశ్చర్యపడుతుండగా, స్వామి తమ యొక్క పొట్ట వైపు వేలితో చూపిస్తూ “లింగములన్నీ ఇక్కడ ఉన్నాయి” అని అన్నారు.
    5. బాబా వారు తమ 22వ సంవత్సరంలో మద్రాసు దగ్గర గిండీ అనే ప్రాంతంలో ఉన్నటువంటి షిరిడి సాయిబాబా ఆలయమును పునర్జీవనము గావించినప్పుడు, ఆలయమును నిర్మించినటువంటి భక్తుడు, స్వామి పాదపద్మములను కడిగి, పూజించి పట్టు వస్త్రము పై బాబా వారి పాదముద్రలను ప్రసాదించమని వేడుకొనెను. అప్పుడు బాబా వారు పూర్వావతారమైన షిరిడి సాయి పాదముద్రలను ఇచ్చెదను అని పలికారు.
    6. 20.10.1965 న దసరా పండుగ సందర్భంలో విద్వాన్ మహాసభ ప్రారంభోత్సవ సమయంలో వేదోద్ధరణ తమ లక్ష్యముగా ప్రకటించిన సమయమునందు స్వామి ఈ పలుకులను పలికారు.
    7. కల్పగిరి అనేటువంటి ఒక అపరాధి, హంతకుడు పోలీసుల నుండి తప్పించుకొని, సన్యాసి వేషం వేసుకొని, దక్షిణ భారతదేశంలోని పుణ్యక్షేత్రములన్నీ తిరిగి ప్రశాంతి నిలయం చేరాడు. అప్పుడు స్వామి అతనికి ఇంటర్వ్యూ ఇచ్చి, పోలీసులకు లొంగిపొమ్మని తద్వారా మరణశిక్ష తప్పించుకోవచ్చని నచ్చచెప్పి, విభూతి ప్రసాదము, కొంత పైకము ఇచ్చి పంపునప్పుడు పలికిన పలుకులు ఇవి.
    8. స్వామి ఆఫ్రికా సందర్శించినప్పుడు, భక్తుల, విద్యార్థుల, ఆఫ్రికన్ల బృందముతో నైలునది తీరమునకు వెళ్లారు. అక్కడ కొన్ని మొసళ్ళు నది ఒడ్డున ఎండ కాచుకొనుచుండగా, ఆ మొసళ్ళ మధ్య ప్లోవర్ పక్షులు యదేచ్ఛగా, నిర్భయంగా తిరుగాడసాగాయి. స్వామి ఆ పక్షులను చూపించి, మొసళ్ళు తమను మింగుతాయన్న భయము లేకుండా ఆ పక్షులు తెరిచి ఉన్నటువంటి మొసలి నోట్లో వాలి, వాటి పళ్ళ మధ్య ఇరుక్కున్నటువంటి మాంసపు ముక్కలను తిని, శుభ్రము చేసి మొసళ్ళకు పంటి నొప్పిని తగ్గిస్తున్నాయి. కాబట్టి మొసళ్ళు కూడా వాటికి ఏ అపకారము తలపెట్టడం లేదు, అని అన్నారు.
    9. ఇవి బాబా వారి భాషితములు. ధర్మక్షేత్రములో హిస్లాప్ గారితో స్వామి, అనంతపురంలోని కళాశాల నిర్మాణంలో పనిచేయుచున్న మహిళలకు ఇవ్వటానికి 100 చీరలు తెప్పించమన్నారు. అందులో నుండి స్వామి 96 చీరలు ఎంచి పక్కకు తీశారు. మిగిలిన నాలుగు చీరలను ఒక పక్కన పెట్టమన్నారు. ఒక గంట తర్వాత మరలా వచ్చి చూస్తే, ఆ నాలుగు చీరల కవర్లలో చిన్న చిన్న నీటి బిందువులు కనిపించాయి. హిస్లాప్ గారికి అర్థం కాలేదు. అప్పుడు స్వామి చెప్పారు ప్రతి కళాఖండంలోనూ / వస్తువులోనూ మనుషుల వలె భావములు ఉంటాయి అని. అంతేకాకుండా స్వామివారు గోవర్ధనగిరి పర్వతం యొక్కవృత్తాంతమును కూడా తెలిపారు.
    10. ఈ పలుకులను స్వామి పలికారు. బాబా వారు సృష్టించి ఇచ్చిన వాటిపై T P S అని ముద్రించి ఉండుట గమనించి, శ్రీ బి ఫణిబండ గారు కుతూహలంతో దాని గురించి బాబాను ప్రశ్నించారు. అప్పుడు స్వామి ఇలా వివరించారు – T – మానవ రూపంలో జన్మించిన తార లేక నక్షత్రము. PS – అనగా పత్రి సాయి, పర్తి సాయి మరియు ప్రేమ సాయి. TPS స్వామి యొక్క ట్రేడ్ మార్క్ అని చెప్పారు.
  • స్వామి తమ భక్తులను “బంగారు” అని ఎందుకు సంబోధిస్తారు?

    జ: స్వామి తమ భక్తులను బంగారు అని సంబోధించడంలో ఉన్నటువంటి పరమార్థము – అపరిశుద్ధమైన, మాలిన్యముతో కూడిన బంగారము శుభ్రపరచబడి అపరంజిగా ఎలా అయితే మారుతుందో అదే విధముగా స్వామి మనలోని మాలిన్యములను తొలగింపచేసి పరిశుద్ధమైన బంగారం ఎలా శోభిస్తుందో, అలా పరిశుద్ధులుగా మనలను సంస్కరించి మనకు వన్నె తెస్తారు. మనము శుద్ధమైన అపరంజి వలె శోభిల్లవలెనని స్వామి యొక్క అభిమతము. మాలిన్యముతో కూడినటువంటి బంగారమును కొన్ని రకములైనటువంటి రసాయనములతో కడిగి, నిప్పు కొలిమిలో కాల్చి, కరిగించి, సుత్తితో అనేక మారులు కొట్టిన పిదప పరిశుద్ధపడి ప్రకాశవంతముగా మెరిసిపోతూ ఉంటుంది. అదే మాదిరి బాబా వారు మనలను సంస్కరింప తలచి కష్ట నష్టములనేటువంటి శిక్షణకు గురిచేసి, మనలోని మాలిన్యములన్నిటిని తీసివేసి త్రికరణశుద్ధులుగా, పరిశుద్ధులుగా గావిస్తారు. మనము చేయవలసిందల్లా స్వామి పట్ల పరిపూర్ణ విశ్వాసంతో పెట్టిన పరీక్షలు, శిక్షణలు ఓర్పుతో, నేర్పుతో అధిగమించటమే.

  • క్రింద తెలిపిన నామావళికి సంబంధించిన సంఘటనలు అనుభవములు తెలుపుము
    (a) సుజ్ఞాన మార్గదర్శకాయనమః (b) ముక్తి ప్రదాయ నమః

    జ:a) స్వామి బాల్యములో పుట్టపర్తి లో ఒక దివ్య బాలుడు ఉన్నాడు అతనిని సవాలు చేయమని పురిగొల్పబడి ఒక దిగంబర సన్యాసి పుట్టపర్తికి వచ్చిన సంఘటన ఇది. స్వామి అంటే గిట్టని కొందరు ఈ దిగంబర సన్యాసిని పుట్టపర్తికి ఆహ్వానించారు. అతని ముసలివాడు, కుంటివాడు, మూర్ఖుడు. మౌనవ్రతము పూని దిగంబరుడిగా పుట్టపర్తి లో ప్రవేశించాడు. అతని శిష్యులు ఒక పల్లకిలో అతనిని కరణం గారి ఇంటికి తీసుకువచ్చారు. అప్పుడు బాబా వారు పెద్ద కండువాను చేత పట్టుకుని బయటకు వచ్చారు. స్వామి ఆ సాధువుతో ప్రేమతో, దయతో స్థిరమైనటువంటి కంఠముతో ఇలా మాట్లాడారు, “ఈ దిగంబర ప్రదర్శన ఏమిటి?, ఈ మౌనము ఎందులకు? ప్రజలు నిన్ను ఒక ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశం కు ఎందుకు మోయాలి? ఇవన్నీ చూస్తే జీవనోపాధి కోసమై నీవు సాధువు వేషము వేసినట్లు ఉన్నది. దేహాభిమానం, దేహావసరములు లేనిటువంటి వారు సాధువులు. కనుక మొదట నీ శరీరమును ఈ కండువాతో కప్పి, నేటి నుండి నిజమైనటువంటి సాధువుగా ప్రవర్తించుము. అరణ్యమునకు వెళ్లి, ఒక గుహలో ధ్యానము చెయ్యి. భయపడవద్దు. నీ ఆహార అవసరములను నేను తీరుస్తాను. క్రూర మృగముల నుండి నేను రక్షిస్తాను”. చల్లని, ఊరట నిచ్చే, ఉత్తేజపరుస్తున్నటువంటి స్వామివారి పలుకులు విని ఆ సాధువుకు కనువిప్పు కలిగింది. స్వామి పట్ల కృతజ్ఞతా భావంతో అతని హృదయమును నిండిపోయింది, ఎందుకంటే సుజ్ఞానమును ప్రబోధించి నిజమైన సాధువుగా మారుటకు దారి చూపించారు స్వామి.

    b) 1) ఈ నామము యొక్క అర్థము – బంధ విముక్తులను కావించి మోక్షమును ప్రసాదించువాడు అని. స్వామి తమ యొక్క అనుగ్రహమును, కృపాకటాక్షములను ప్రసాదించు తీరు ప్రత్యేకమైనది మరియు భిన్నమైనది. భక్తుల యొక్క ఈ జన్మ, పూర్వజన్మ సుకృతములపై మరియు సాధనలపై ఆధారపడి ఉంటుంది.

    శేషగిరి రావు గారు ప్రశాంతి నిలయ మందిరములోని పూజారి. స్వామి పట్ల పరిపూర్ణ భక్తి విశ్వాసమును కలిగినటువంటి వారు. ఒకసారి ఆయన తీవ్రంగా జబ్బు పడి కొన్ని నెలలు వ్యాధిగ్రస్తులై మృత్యువు సమీపము వరకు వెళ్లారు. మృత్యువును ఆహ్వానించుటకు, తన దేహమును వదిలివేయుటకు సిద్ధపడ్డారు. అప్పుడు స్వామి ప్రవేశించి కఠినంగా ఇలా మాట్లాడారు – “నేను టికెట్ ఇవ్వకుండా ఎలా వెళ్లగలవు? వెళ్ళు, నీ పనిని నీవు చెయ్యి”. శేషగిరి రావు గారు స్వామి ఆజ్ఞను శిరసావహించారు. మరి కొంతకాలానికి మరలా జబ్బున పడ్డారు. బంధుమిత్రులు ఆందోళనతో ప్రశాంతి నిలయముకు దూరంగా తీసుకువెళ్లాలని నిశ్చయించారు. అప్పుడు స్వామి మరలా వచ్చి తమ దివ్య హస్తములతో శేషగిరి రావు గారికి తినిపించి, వారి బంధువులతో ఇలా చెప్పారు, “కర్మ శేషమును ఈ జన్మలోనే తీసివేయతలచాను. అందుకనే అన్ని బాధలు ఈ జన్మలోనే అనుభవిస్తున్నాడు”. బాబా వారి అక్కడ నుంచి నిష్క్రమిస్తూ “ఇక నీవు వెళ్ళవచ్చు” అని శేషగిరిరావు గారితో అన్నారు. ఆ విధంగా శేషగిరి రావు గారు జనన మరణ చక్రము నుండి విముక్తులయ్యారు.

    2) ఆరు సంవత్సరముల చిన్న బాలిక ఏమి కావాలి? అన్న బాబా ప్రశ్నకు మోక్షమును ప్రసాదించమని అడిగింది. స్వామి ఆ పాపను తన ఈ కోరికను విరమించమని నచ్చచెప్ప ప్రయత్నించారు. ఆ బాలిక దృఢ చిత్తముతో మోక్షమునే ప్రసాదించమని అడిగింది. స్వామి ఆ బాలిక కోరికను తీర్చారు. ఆ కోరిక కలగడం కూడా స్వామి యొక్క అనుగ్రహమే. మనమందరము స్వామిని కోరవలసినది ఇదే.

    3) ఒకసారి ఒక తల్లిదండ్రులు అంధుడైన తమ కుమారుని తీసుకుని బాబా వద్దకు వచ్చారు. స్వామిని ఆ పిల్లవానికి చూపును ప్రసాదించమని వేడుకొన్నారు. “ఇతనికి నేను దృష్టి ప్రసాదించగలను. కానీ, కర్మఫలమును అనుభవించుటకు ఇతను మరలా గ్రుడ్డివానిగా ఇంకొక జన్మ ఎత్తి, పూర్వజన్మలో ఒక బాలుని గ్రుడ్డివానిగా చేసినటువంటి కర్మ శేషమును అనుభవించవలెను. కనుక ఇతనిని ఇలాగే ఉండనివ్వండి. కర్మ శేషమును ఈ జన్మలోనే అనుభవించనివ్వండి” అని స్వామి చెప్పారు.

  • ఈ పాటను పూర్తి చేయుము –

    ‘Love is my….

    …. is my….

    ….. is my food.

    My life is my message

    …. is my nature

    No…. for love

    No…. for love

    No…. No……’.

    జ:

    “Love is My form

    Truth is My breath

    Bliss is My food

    My life is My message

    Expansion is My nature

    No season for love

    No reason for love

    No birth No death.”

  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *