పత్రం పుష్పం – మరింత చదవడానికి

Print Friendly, PDF & Email
మరింత చదవడానికి – వివరణ
పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి |
తదహం భక్త్యుప హృతం అశ్నామి ప్రయతాత్మనః ||

రాజవిద్యా రాజగుహ్య యోగము (9-26)

భగవంతుని అనుగ్రహము మనం సమర్పించే వస్తువు యొక్క గొప్పతనం పై కానీ, విలువపై కానీ ఆధారపడి ఉండదు. నిర్మల భక్తితో, నిర్మల హృదయంతో సమర్పించే చిన్న వస్తువు అయిననూ ఆయన స్వీకరించును.

బాబా వారు ఇలా చెప్తారు:- భగవంతుడు భావ ప్రియుడే కానీ బాహ్య ప్రియుడు కాడు. భగవంతునికి మనము మన దేహము అనే పత్రాన్ని, నిర్మల హృదయమనే పుష్పాన్ని, ఆత్మార్పణమను ఫలాన్ని, భగవంతుని కొరకై వచ్చే కన్నీటిని సమర్పించాలి. భగవంతుడు మనం సమర్పించే వస్తువుల కన్నా, హృదయ భావనకే స్పందిస్తాడు. భగవత్ కృపకు భక్తి, నిర్మల చిత్తము ప్రధానము. భగవంతుని ముందు పరిమళాలు వెదజల్లే అగరుత్తులను వెలిగిస్తాము. ఆ పరిమళాలు అన్ని దిక్కులకూ వ్యాపిస్తాయి. సద్భావనలనే పరిమళాలను వెదజల్లే అగరు వత్తులను మనము వెలిగించవలెను.

ఏకనాథ్ మహారాష్ట్ర దేశానికి చెందిన మహా భక్తుడు.అతను ఒకసారి కాశీకి వెళ్ళాడు. అక్కడ విశ్వేశ్వరుని దర్శించి గంగా జలమును బిందెలతో నింపుకుని కావడిలో పెట్టుకుని తన శిష్యులతో బయలుదేరాడు. కాశి తీర్థము రామేశ్వరం వద్ద సముద్రంలో కలుపుట ఒక ప్రాచీన భారతీయ సాంప్రదాయము. ఏకనాథ్ తన శిష్యులతో ప్రయాణం చేస్తున్నాడు. మార్గం మధ్యలో ఒక గాడిద నోరు తెరుచుకుని గిలగిలా కొట్టుకుంటూ నేలమీద పడి ఉండడం చూశాడు.అది ఎండాకాలం. ఆ గాడిద దాహంతో ప్రాణం విడిచే స్థితిలో ఉంది. వెంటనే ఏకనాథుడు కావడిలో ఉన్న బిందెడు నీరు దాని నోట్లో పోసి, దానిపై కొంచెం చల్లాడు. కొంతసేపటికి ఆ గాడిద కన్నులు తెరచి మెల్లగా లేచి తోకాడిస్తూ వెళ్ళిపోయింది. అదంతా చూస్తున్న శిష్యులు “స్వామి! పవిత్రమైన గంగా జలమును, రామలింగేశ్వర స్వామికి అర్చించవలసిన తీర్థమును ఈ గాడిద నోట్లో పోశారే?” అని ప్రశ్నించారు. అప్పుడు ఏకనాథ్ “నాయనలారా! ఈశ్వర సర్వభూతానాం” అన్న సత్యాన్ని మరిచారా? సర్వ జీవుల యందూ సర్వేశ్వరుడు ఉండునని తెలియదా? భగవంతునికి కాశీ జలమేమిటి? రామేశ్వర జలమేమిటి? అంతా ఒక్కటే. మీదృష్టికి అది గాడిదిగా కనిపించింది. కానీ నాకు ఆ జీవిలో రామలింగేశ్వరస్వామి కనిపించాడు. దాహం తీర్చమని కోరాడు. నేను చేసినది అతి పవిత్రమైన కార్యము” అని వారికి తెలియజేశాడు. అవసరమైన వారికి ఏ సేవ చేసినా అది భగవంతుడు స్వీకరిస్తాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: