ఇతర మతాలను ఆచరించడం

Print Friendly, PDF & Email
అధ్యాయం IX – ఇతర మతాలను ఆచరించడం

1874లో, శ్రీరామకృష్ణులు కలకత్తాలోని శంభు నాథ్ మల్లిక్ అనే వ్యక్తితో సన్నిహిత సంబంధం ఏర్పరచుకున్నారు. ఆయనకు దక్షిణేశ్వర్ కాళీ ఆలయం సమీపంలో ఒక తోట ఉన్నది. శ్రీరామకృష్ణులు ఆ తోట గృహంలో చాలా సమయం గడిపేవారు. శంభు మల్లిక్ శ్రీరామకృష్ణుల పట్ల నిజమైన ప్రేమ మరియు గౌరవాన్ని అభివృద్ధి చేసుకున్నారు. ఆయన క్రైస్తవుడు కాకపోయినా బైబిల్‌ను శ్రీరామకృష్ణులకు చదివి వినిపించేవారు. దీని ద్వారా శ్రీరామకృష్ణులు క్రీస్తు మరియు క్రైస్తవ మతం గురించి తెలుసుకున్నారు. ఈ కొత్త పద్ధతిలో జగన్మాత యొక్క చైతన్యాన్నిఅనుభవించాలనే బలమైన కోరిక ఆయనకు కలిగింది మరియు అది ఒక విచిత్రమైన విధంగా నెరవేరింది.

శ్రీరామకృష్ణులు తన భక్తుడైన జడులాల్ మల్లిక్‌కు చెందిన పొరుగింటి గదిలో కూర్చుని ఉన్నారు. ఆ గది గోడలపై అనేక అందమైన చిత్రాలు ఉన్నాయి. వాటిలో క్రీస్తు యొక్క చిత్రం కూడా ఉంది. శ్రీరామకృష్ణులు మడోన్నా మరియు దివ్య శిశువు చిత్రాన్ని శ్రద్ధగా చూస్తూ క్రీస్తు జీవితం గురించి ఆలోచిస్తున్నారు. ఆ చిత్రం జీవిం ఉట్టి పడుతున్నట్లుగా మరియమ్మ మరియు క్రీస్తు రూపాల నుండి వెలుగుకిరణాలు వెలువడి తనలోకి ప్రవేశిస్తున్నట్లుగా ఆయనకు అనిపించింది. ఇది ఆయన మానసిక దృక్పథాన్ని మార్చేసింది. ఆయన మనస్సు క్రీస్తు ఆలోచనలతో నిండిపోయింది మరియు ఆయన మూడు రోజుల పాటు ఆ స్థితిలోనే ఉన్నారు. నాలుగో రోజు పంచవటి సమీపంలో నడుస్తున్నప్పుడు ఆయన క్రీస్తుగా భావించిన ఒక ప్రశాంతమైన రూపాన్ని చూశారు. “ఈయన క్రీస్తు, మానవాళిని రక్షించేందుకు తన హృదయ రక్తాన్ని ధారపోసినవాడు” అనే అంతర్గత స్వరం ఆయన విన్నారు. ఆ రూపం ఆయనను ఆలింగనం చేసుకుంది మరియు శ్రీరామకృష్ణులు సమాధి స్థితిలోకి వెళ్లి బాహ్య చైతన్యం కోల్పోయారు. ఈ అనుభవం ద్వారా శ్రీరామకృష్ణులకు యేసు క్రీస్తు ప్రభువు అవతారమని నమ్మకం కలిగింది.

బుద్ధుడు మరియు ఇతర మత స్థాపకులపై శ్రీరామకృష్ణులు ఉద్ఘాటించిన మాటలను ఇక్కడ గమనించవచ్చు.

బుద్ధుని గురించి, అతను భగవంతుని అవతారమని ఆయన హిందువుల అభిప్రాయాన్ని పంచుకున్నారు. శ్రీరామకృష్ణులు బుద్ధునికి నిజమైన భక్తి మరియు పూజను అర్పించేవారు. ఒకసారి ఆయన ఇలా వ్యాఖ్యానించారు, “బుద్ధుడు భగవంతుని అవతారమనే విషయంపై ఏమాత్రం సందేహం లేదు. ఆయన సిద్ధాంతాలు మరియు వేదంలోని జ్ఞానకాండ సిద్ధాంతాల మధ్య ఎలాంటి తేడా లేదు.”

జైన మతాన్ని స్థాపించిన తీర్థంకరులు మరియు పదిమంది సిక్కు గురువుల గురించి, శ్రీరామకృష్ణులు తన తరువాత జీవితంలో ఆ మతాల ప్రతినిధుల నుండి చాలా విషయాలు విన్నారు మరియు వారిపట్ల గొప్ప గౌరవాన్ని అభివృద్ధి చేసుకున్నారు.

దక్షిణేశ్వర్‌లోని తన గదిలో తీర్థంకర మహావీరుడి చిన్న విగ్రహం మరియు క్రీస్తు యొక్క చిత్రపటము ఉండేవి. వాటి ముందు ప్రతి ఉదయం మరియు సాయంత్రం ధూపం వెలిగించబడేది.

సిక్కు గురువుల గురించి ఆయన ఇలా చెప్పేవారు. వారు అందరూ బ్రహ్మజ్ఞాన నిష్ఠు డైన రాజు జనకుని అవతారాలు.

అన్ని ఆధ్యాత్మిక సాధన రూపాల ద్వారా ఆయన పొందిన అనుభూతి ఫలితంగా శ్రీరామకృష్ణులు అన్ని మతాలు నిజమైనవే అని, ప్రతి సిద్ధాంత పద్ధతీ భగవంతుని వైపు దారి చూపే మార్గమే అని గట్టిగా నమ్మేవారు. ద్వైతం, విశిష్టాద్వైతం మరియు అద్వైతం(అన్నీ) మనిషి ఆధ్యాత్మిక సాధనలోని వేర్వేరు దశలుగా ఆయన భావించారు. ఇవి పరస్పర విరుద్ధమైనవిగా కాకుండా పరస్పర సహాయకమైనవిగా, వేర్వేరు మానసిక దృక్పథాలకు అనుగుణంగా ఉన్నవిగా ఆయన పరిగణించారు.

అందువల్ల ఆయన తన శిష్యులకు ఇలా చెప్పేవారు, “నేను అన్ని మతాలను ఆచరించాను. హిందూమతం, ఇస్లాం, క్రైస్తవ మతం, అలాగే హిందూ మతంలోని వివిధ పంథాలను కూడా అనుసరించాను. మార్గాలు వేర్వేరు అయినా అన్ని మార్గాలు ఒకే భగవంతుని వైపు దారి తీస్తున్నాయని నేను కనుగొన్నాను. ఒక చెరువుకు అనేక ఘాట్లు ఉంటాయి. ఒక ఘాట్ వద్ద హిందువులు కుండలలో నీటిని తీసుకుంటారు మరియు దాన్ని ‘జల’ అంటారు. మరొక ఘాట్ వద్ద ముస్లింలు తోలుతో చేసిన బాటిళ్లలో నీటిని తీసుకుంటారు మరియు దాన్ని ‘పానీ’ అంటారు. మూడవ ఘాట్ వద్ద క్రైస్తవులు, వారు దాన్ని ‘వాటర్’ అంటారు. నీరు ‘జల’ కాదు, ‘పానీ’ కాదు, ‘వాటర్’ మాత్రమే అని ఊహించగలమా? ఎంత అబద్ధం! పదార్థం ఒకటే, పేర్లు వేర్వేరు, ప్రతి ఒక్కరూ అదే పదార్థాన్ని అన్వేషిస్తున్నారు. ప్రపంచంలోని ప్రతి మతం ఒక ఘాట్ వంటిది. ఈ ఘాట్లలో ఏదో ఒక దాని ద్వారా నిజమైన మరియు శ్రద్ధగల హృదయంతో నేరుగా వెళ్లండి, మీరు శాశ్వత ఆనంద జలాన్ని చేరుకుంటారు. కానీ మీ మతం ఇతర మతాల కంటే మెరుగైనదని చెప్పకండి. వేర్వేరు మతాలు ఒకే దేవుని చేరుకునే వేర్వేరు మార్గాలు. కలకత్తాలోని కాళీఘాట్ ఆలయానికి వెళ్లే మార్గాలు వేర్వేరు. అలాగే, ప్రభువు ఇంటికి తీసుకెళ్లే మార్గాలు కూడా అనేకం. ప్రతి మతం అలాంటి మార్గాలలో ఒకటి మాత్రమే.”

ఆయన ప్రకటించారు, “అన్ని మతాలు నిజమైనవే. ఎన్ని విశ్వాసాలు ఉంటాయో, అన్ని మార్గాలు ఉంటాయి.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *