ప్రార్ధనలోని మహత్తు

Print Friendly, PDF & Email
ప్రార్ధనలోని మహత్తు

కిరణ్ తల్లిదండ్రులకు ఏకైక పుత్రుడు. అతడు యింటి యందు, బడియందు కూడ వినయ విధేయతలు కలిగి మంచి ప్రవర్తనతో ఉత్తమ బాలుడని పేరుగాంచాడు. తన వినమ్రత, సత్ప్రవర్తనలచేత పెద్దల మనస్సులు చూరగొని, ఉపాధ్యాయుల  మన్ననల నందుకొనెడివాడు.

కిరణ్ 10 సంవత్సరముల పసివాడైనను, తల్లిదండ్రుల దైనందిన కార్యక్రమములను అతి ఆసక్తితో పరిశీలించెడివాడు. అతని తండ్రి ఒక జిల్లా న్యాయాధికారి. ఆయన నిజాయితీగా తన కర్తవ్యమును నిర్వహిస్తూ గొప్ప వారిని, పేదవారిని కూడా సమానంగా చూచుకొనేవాడు. అతని తల్లి ఒక భక్తురాలు. ఆమె ఆర్తులను అతికరుణతో ఆదరించేది. అట్టి తలిదండ్రులకు తాను జన్మించినందులకు గర్వపడుతూ, కిరణ్వారితో ఎంతో ప్రేమగా వుండేవాడు. . కాని భగవంతునియందు తన తల్లిదండ్రులకు గల భక్తి భావము అంతగా నచ్చేది కాదు. అప్పుడప్పుడు తల్లిని “అమ్మా! నాన్నగారు ప్రతి ఆదివారము శివాలయమునకు ఎందుకు వెళ్తారు? అమాయకులైన పల్లెటూరి వానిలా అక్కడ సత్సంగములో ఎందుకు కూర్చుంటారు? అమ్మా! నీవు కళ్ళు మూసుకొని ఉదయము, సాయంకాలము కూడా ధ్యానము చేస్తూ , మంత్రాలు చదువుతూ, దుర్గాదేవిని ప్రతిరోజు ఎందుకు ప్రార్థిస్తూ ఉంటావు? కాలమును అలా వృధా చేసేదాని కంటే మరేదైనా మంచిపనికి ఉపయోగించ వచ్చునుకదా!” అని అడిగేవాడు.

అది విన్న అతని తల్లి, ఒక చిరునవ్వు నవ్వి, ఊరుకొనేది. మనస్సులో దుర్గాదేవిని స్మరించి “అమ్మా! కిరణ్, కపటం తెలియని పసివాడు. బుద్ధి వికసించిన వాడు కాదు. అతనికి భక్తి విశ్వాసములు ప్రసాదించి, అనుగ్రహించు తల్లీ!” అని ప్రార్ధించేది.

ఒక రోజు కిరణ్, బడినుండి యింటికి చేరేసరికి, పొరిగింటి వారు పరుగెత్తుకొని వచ్చారు. “కిరణ్! కిరణ్! మీ నాన్నగారు కారు క్రింద పడ్డారు. స్పృహ తప్పిపోయింది. హాస్పటల్లో ఉన్నారు” ఆయాసపడుతూ చెప్పారు. కొండవిరిగి మీద పడినట్లయింది. కాళ్ళక్రింద నేల కదలిపోతున్నట్లనిపించింది. కిరణ్ ఏమి చెయ్యాలో తెలియని అయోమయ స్థితిలో పడ్డాడు. అమాంతంగా హాస్పటల్ కి బయలుదేరి వెళ్ళాలనుకొన్నాడు. అనుకోకుండా అతని కళ్ళు, వాళ్ళమ్మగారు పూలతో అతిసుందరంగా అలంకరించిన అమ్మవారి విగ్రహం మీద పడ్డాయి.

దేదీప్యమానంగా వెలుగొందుతున్న ఆ దేవి విగ్రహాన్ని నిశ్చేష్టుడై చూస్తూవుంటే, వాళ్ళమ్మగారు పూజ చేస్తున్నప్పుడు, అప్పుడప్పు డు తను వింటున్న మంత్రాలు అతని చెవులలో మారుమోగాయి. అప్రయత్నంగా చేతులు జోడించి, కళ్ళవెంట నీళ్ళు కారుస్తూ, గద్గద కంఠంతో, “తల్లీ! దుర్గాదేవీ నా తండ్రి గారిని రక్షించు. ఆయనను విడిచి అరక్షణం కూడా జీవించలేను”. అని వినమ్రుడై వేడుకొన్నాడు. శిరస్సువంచి దేవి పాదాలకు నమస్కరించి ఆ పాదపీఠం మీది ఒక పుష్పాన్ని అందుకొని, చరచరా బయటకు నడిచాడు.

అతి త్వరలో హాస్పటల్ను సమీపించి, అచేతనంగా పడివున్న తండ్రిని చూసేసరికి, దుఃఖం పెల్లుబికింది “నాన్నా” అని అతి బిగ్గరగా పిలవబోయాడు. కాని అతి చేరువలో ఉన్న అతని తల్లిని చూచి ఆగిపోయాడు.

ఆమె కళ్ళు మూసుకొని, కదల కుండా కూర్చుని, ధ్యానంలో నిమగ్నమై ప్రార్ధన చేస్తూ ఉంది. ఆమెవంక చూసేసరికి, అతనిలోవున్న ఆవేదన, ఆతృతలు అంతర్ధాన మయ్యాయి. అత ని ముఖం అతి ప్రశాంతంగా ఉంది. విశ్వాసంతో వికసిస్తూవుంది. పవిత్ర తేజస్సుతో ధగధగ మెరిసిపోతూవుంది. కిరణ్ మెల్లగా ఆమె దగ్గరకు చేరి “అమ్మా! నాన్న గారి కోసం,
దుర్గాదేవి పాదముల చెంతనున్న యీ పుష్పాన్ని తెచ్చానమ్మా!” అని ఆమె చెవిలో అతి అనునయంగా చెప్పాడు. ఆమె కళ్ళు తెరచి చూసేసరికి ఆ ఎర్రగులాబీని తన తండ్రి నుదుట మీద వుంచాడు.

అంతే! అలా వుంచాడో లేదో! వెంటనే అతని తండ్రికి స్పృహరావటం ప్రారంభించింది. పువ్వు పెట్టి పెట్టగానే వచ్చిన మార్పుకి అక్కడి వారంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. అంతలో డాక్టరు వచ్చారు. పరీక్షచేస్తూనే “గండం గడిచింది. బయటపడ్డాడు, భగవంతుడు రక్షించాడు” అన్నాడు.

కిరణ్ చాలా తెలివైన వాడవడంచేత యీ అపూర్వ అనుభవం అతని హృదయంలో హత్తుకుపోయింది. ఒకనెల గడిచి పోయింది. తండ్రి హాస్పటల్ నుండి సుఖంగా తిరిగివచ్చాడు. తండ్రి తన కుమారునిలో వచ్చిన మార్పుకి ఆశ్చర్యం చెందాడు.

తల్లి ధ్యానం చేసుకొంటుంటే, తానుకూడా ధ్యానానికి కూర్చోవడం, ఆదివారం వస్తే ఆమె పూజ చేసుకొంటున్నప్పుడు కిరణ్ సహకరించడం గమనించిన తండ్రి ఎంతో ఆనందంతో ఉప్పొంగిపోయాడు. కిరణ్ తండ్రితో గుడికికూడా వెళ్ళడం అలవాటు చేసుకొన్నాడు.

బడిలోచెప్పిన పాఠాలు చదవడం పూర్తికాగానే స్వామి వివేకానంద, ఏసుప్రభువు, గౌతమబుద్ధుడు మొదలైన మహానుభావుల దివ్యచరిత్రలను కిరణ్ చదువుతూ వుండేవాడు.

ప్రార్ధనలయందు ఎంత మహత్తు ఉన్నదో అప్పటికిగాని కిరణ్ కి అవగాహన కాలేదు.

అవి మనలో సతాము, దయ, సేవాభావము, ప్రేమలను పెంపొందింపచేయును.

  • అవి మనలో సత్యము, దయ, సేవాభావము, ప్రేమలను పెంపొందింపచేయును.
  • మన హృదయమునందు విశ్వాసము, ధైర్యస్థైర్యములను అభివృద్ధిచేయును.
  • మనలను మంచి మార్గమున నడిపించి శాంతి, సంతృప్తి, సంతోషములను అందించును.
ప్రశ్నలు:
  1. నువ్వు ప్రతి రోజు ఎలా ప్రార్ధన చేస్తున్నావు?
  2. మన మెందుకు భక్తి విశ్వాసములతో ఉండవలెను?
  3. కిరణ్ తన పరీక్షలో ఉత్తీర్ణుడగుటకు భగవంతుని సహాయము కావలెననుకొన్నచో అతడేమి చేయవలెను?