సమయస్ఫూర్తి
సమయస్ఫూర్తి
అనుకోకుండా ఏదైనా ప్రమాదము సంభవించినప్పుడు, కరువు-కాటకాలు మరియు వరదలు వచ్చినప్పుడు, యుధ సమయాలలో, మనలో చాలా మంది భయాందోళనకు గురౌతాము.
ఆ భయము మూలాన ఆపదలో వున్నవారికి ఎటువంటి సహాయము చేయలేము. కానీ స్థిరచిత్తము కల కొందరు భయమునకు లోనుగాక, నిశ్చలంగా ఆలోచించి, సమయస్ఫూర్తితో, ప్రాణాలను, ఆస్తి నష్టాన్ని కాపాడి, సేవ చేయగలుగుతారు.
మనము కష్టాన్ని కాని బాధను కాని అధిగమించి(దాటి) ఆనందము, సంతోషము అనుభవించడానికి ఆ సమయానికి మన తెలివిని ఉపయోగించి తగిన ఆలోచన చేయడమే సమయస్ఫూర్తి. చిన్నతనం నుండే మనస్సును ఒక విధమైన క్రమశిక్షణను అలవరచుకున్న వారికి ఈ శక్తి వస్తుంది. ఎట్టి సమస్యలెదురైనా మనస్సున కలత చెందక, నిబ్బరంగా నిశ్చలంగా ఆలోచించి వివేకవంతంగా వ్యవహరిస్తారు. ఇట్టి ప్రజ్ఞ ప్రతి ఒక్కరిలోను ప్రేరేపించే ఒక చక్కని బాలుని గురించి తెలుసుకుందాము.
అలహాబాదు నగరంలో ఒక పెద్ద తోట ఉంది. అందులో చేరిన చాలా మంది పిల్లలు బంతి ఆట ఆడుకొంటున్నారు. అందులో ఒక కుర్రవాడు తన శక్తినంతా ఉపయోగించి బ్యాటుతో బంతిని ఆకాశంలోకి కొట్టాడు. ఆ బంతి చాలా పైకి ఎగిరి క్రిందకి దిగివస్తూ ఒక మఱ్ఱిచెట్టు తొర్రలో పడిపోయింది. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ బంతిని బయటికి తీయడానికి ప్రయత్నించారు. వాళ్ళ చేతులు చిన్నవి కావడం చేత లోతుగా ఉన్న ఆ తొఱ్ఱలోనుంచి బంతిని అందుకోలేక పోయారు. ఇదంతా చూస్తున్న ఒక పెద్ద మనిషికి ఆ పిల్లలపై చాలా జాలి కలిగింది. తాను కూడా ప్రయత్నించాడు. ఫలితం లేకపోయింది. చేసేదిలేక, ఆటగాళ్ళందరూ ఆ బంతిని ఆకాశంలోకి కొట్టిన ఆ పిల్లవాడి మీద కోప్పడ్డారు. నోటికి వచ్చినట్లుగా తిట్ట సాగారు.అప్పటి దాకా ‘ఆహా! ఎంత పైకి కొట్టాను’ అని ఆనందించిన ఆ పిల్లవాడి ముఖం ఒక్కసారిగా వాడిపోయింది. తిన్న తిట్లన్నీ జ్ఞాపకం చేసుకుని వెక్కివెక్కి ఏడుస్తున్నాడు.
ఆ సమయానికి ఒక చురుకైన కుర్రాడు తోటలో తిరుగుతూ అక్కడికి వచ్చాడు. ఈ కుర్రవాడు ఏడ్వటం చూసి, అతని వద్దకు వెళ్లి భుజం తట్టి ఓదార్చడం మొదలు పెట్టాడు. అక్కడ చేరిన వారి వల్ల జరిగినదంతా తెలుసుకున్నాడు. ఆ కుర్రవాడు “ఆ మామయ్య కూడా మాతోపాటు ప్రయత్నించాడు. అయినా బంతి దొరకలేదు” అని ఏడుస్తూనే చెప్పాడు. ఎంతో నిబ్బరంగా అతనిని ఓదారుస్తు, కంగారు పడకు. దాన్ని నేను బయటకు తీస్తాను. ఒక బాల్చితో నీళ్ళు తీసుకురండి” అన్నాడు.
వారు గబాగబా పరుగెత్తుకొని వెళ్ళి తోటమాలి సహాయంతో బాల్చీలో నీళ్ళు తెచ్చారు. వచ్చిన బాలుడు చాలా తెలివైన వాడవటం చేత తొర్రలో కొంచెం కొంచెం నీళ్ళు పోస్తున్నాడు. బంతి అతి తేలికైంది అగుట చేత, తొర్రలో పోసిన నీటిమీద తేలడం మొదలు పెట్టింది. అలా నీరు పోస్తూ వుంటే, పైకి తేలుతూ, తేలుతూ నీరుతోపాటు తొర్రలో నుంచి పొరలి ఆ బంతి కూడా క్రిందపడింది. అది చూచి అందరూ ఆనందంతో కిలకిలలాడేరు. ఆనందం పట్టలేని ఒక కుర్రవాడు చటుక్కున ఆ బంతినందుకొని ఉత్సాహంగా ఆకాశంలోకి ఎగర వేశాడు. ఆనందంగా కేరింతలు కొట్టు కుంటూ బయలు దేరారు. ఒకొక్కరి ముఖం వికసించిన పద్మంలా వెలిగిపోయింది. ఆనందంగా ఆడుకుంటున్న వాళ్ళని చూస్తూ ఉంటే పండు వెన్నెలకు ప్రకాశిస్తున్న కలువ పువ్వులు కదలాడుతున్నాయా! అన్నట్టు ఉంది. ఆ చురుకైన కుర్రవాడెవరునుకున్నారు? అతడే జవహార్ లాల్ నెహ్రూ.
ప్రశ్నలు:
- సమయస్ఫూర్తి అంటే ఏమిటి? దానినెట్లా అలవరచుకోవ గలుగుతావు?
- ఏదైనా ఒక గడ్డు పరిస్థితి నెదుర్కొనవలసి వచ్చినప్పుడు నీవు నిశ్చల చిత్తంతో ప్రవర్తించావా. అయితే ఎప్పుడు, ఎలా?
- ఒక ప్రమాదం జరిగిందని ఊహించుకొని, నీవు అక్కడున్నట్టుగా భావించుకుని, అక్కడ ఆపదలో చిక్కుకున్న వారిని రక్షించుటకై నీవు నీ సమయస్ఫూర్తిని ఏ విధంగా ప్రదర్శిస్తావో వ్రాయుము?