గర్వము పతన హేతువు

Print Friendly, PDF & Email
గర్వము పతన హేతువు

కృష్ణార్జునులు ఇరువురు ఒక రోజున యమునా నదీ తీరాన విహరిస్తున్నారు. ఆ నది వంక చూస్తుంటే కృష్ణునికి, తన లీలలు జ్ఞాపకానికి వచ్చాయి. కొద్ది రోజులలో ప్రారంభిచే కురుక్షేత్ర సంగ్రామం గురించి అర్జునుడు ఆలోచిస్తున్నాడు. కౌరవులను గురించి అలా ఆలోచిస్తూ తన విలువిద్యా నైపుణ్యాన్ని తలంచుకొంటూ తనకు విజయం తథ్యమని గర్వపడ్డాడు. “నేను విలువిద్యలో అనన్య ప్రజ్ఞాశాలిని” అని తనలో తాను అనుకుంటున్నాడు. తలచుకుంటే నేనీ విశాలమైన నదిపైన బాణాల తో ఒక వంతెన నిర్మించగలను” అని ఆ యమునా నదిని చూసి అనుకొన్నాడు.

అంతలోనే ఒక వింత తలంపు వచ్చింది. “రావణ సంహారానికి బయలుదేరిన రాముడు ఆనాడు నిర్మించలేని వారధిని కూడా నేనీనాడు నిర్మించగలను” అని అతి గర్వంగా అనుకొన్నాడు.

అర్జునుని హృదయంలో ఆవిర్భవించిన అహంకారం కృష్ణునికి తెలిసింది. వెంటనే కృష్ణుడు “అర్జునా! ఏమిటి నీలో నీవు నవ్వుకొంటున్నావు? నేను చేసిన పొరపాటు ఏదైనా గుర్తొచ్చిందా? అని అడిగాడు. “నిజమే నాలో నేను నవ్వుకొంటున్నాను. రాముడు తాను లంకలో ప్రవేశించడానికి, కోతులను ఉపయోగించి రాళ్ళతో వారధి కట్టించాడు. ఆనాడు నేను అక్కడ ఉండి ఉంటే, కళ్ళు మిరుమిట్లు గొలిపేటట్లు బాణాలతో వారధి కట్టి ఇచ్చి ఉండేవాణ్ణి” అని కొంచెం ధీమాగా చెప్పేడు.అర్జునుని గర్వం అణచడం అవసరం అనుకున్నాడు కృష్ణుడు. “కపిసైన్యం చాలా బలవంతమైనది. దాని భారంచేత కృంగిపోయే ప్రమాదం ఉంది. అందుకనే రాముడు ఆ వారధిని బాణాలతో నిర్మించలేదు” అని చెప్పాడు. కాని అర్జునుడు దీనికి ఒప్పుకోలేదు. “ఒక విధంగా ఆలోచిస్తే కోతులు నడిస్తేగూడా భరించే శక్తిగల వారధిని బాణాలతో రాముడు నిర్మించలేక పోయాడని ఒప్పుకోవాలి” అని గర్వంగా పలికాడు.

కొంతసేపు కృష్ణుడు అలోచించి “శ్రీరాముని సైన్యంలోని వానరులలో ఒకరు నేటికీ సజీవంగా ఉన్నాడు. అతన్ని పిలుద్దాము. నీవు బాణాలతో యమునకు వంతెన కట్టు, పరీక్షించి చూద్దాం బావా” అన్నాడు కృష్ణుడు. “అది ఎంతపని” అని గర్వంగా చెప్పాడు అర్జునుడు. వెంటనే విల్లందుకుని బాణాలతో యమునమీద వంతెన కట్టాడు. ఆజానుబాహుడైన ఒక వానరుడు వచ్చి కృష్ణుని పాదాల చెంత కూర్చున్నాడు. కృష్ణుడు ” హనుమా! ఆ వంతెన మీద నడుస్తావా?” అని అడిగాడు. అర్జునుడు వెటకారంగా నవ్వుతూ ‘ఒక కోతి నడిచినంత మాత్రాన నేను కట్టిన వంతెన పడిపోతుందా? అన్నాడు ఎంతో గర్వపడుతూ.

అనుమానిస్తూనే హనుమా తన కుడికాలు ఆ వంతెన మీద పెట్టాడు. రెండవ కాలు కదపక ముందే వంతెన అంతా కూలి నదిలో కలిసిపోయింది. అది చూచిన కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. అవమానంతో పశ్చాత్తాపంతో అర్జునుడు విల్లంబులు వదిలేసి కృష్ణుని పాదాలపై పడ్డాడు.

అప్పుడు కృష్ణుడు చక్కని ప్రబోధ చేసి అర్జునుని ఓదార్చాడు. “రాముడంతటి వాడే కట్టలేక పోయాడని నీవే చెప్పావు కదా? నీవు కట్టలేక పోయినంత మాత్రాన నీవు ఎందుకు బాధ పడాలి. నీవు ఎప్పుడూ ఈ సన్నివేశాన్ని గుర్తుంచుకో. ఎన్నడూ నీలో గర్వాన్ని అహంకారాన్ని ప్రవేశింపనీయకు. ఈ రెండూ ఎంతటివాడినైనా పతనం చేస్తాయి” అన్నాడు. అర్జునుడందుకు తలవంచి అంగీకరించాడు. అందుకనే అర్జునుడు హనుమంతుణ్ణి తన పతాకముపై చిత్రించుకుని రధం పై ఎగుర వేసుకుని కపిధ్వజుడని పేరుగాంచాడు.

ప్రశ్నలు
  1. గర్వము, అహంకారము మానవునకు ఎట్టి విధంగా అపకారము చేస్తాయి?
  2. అర్జునునిలో కృష్ణుడు తెచ్చిన పరివర్తన ఏమి?
  3. ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయిన విద్యార్థి గర్వానికి, అహంకారానికి లోనైతే ఏమి జరుగుతుంది?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *