పురుషః సపరః – వివరణ

Print Friendly, PDF & Email
పురుషః – వివరణ:-
పురుషః సపరః పార్ధ భక్త్యా లభస్త్వ నన్యయ |
యస్యాంతః స్థాని భూతాని యేన సర్వమిదం తతమ్ ||

అక్షర పరబ్రహ్మ యోగము (8-22)

ఓ అర్జునా! ఎవని యందు ఈ ప్రాణికోటి వెలసి యున్నదో, ఎవని చేత ఈ సమస్త జగత్తు వ్యాపించబడి యున్నదో, అట్టి పరమ పురుషుణ్ణి అనన్య భక్తితో పొందగలరు.

ఇక్కడ పరమాత్మ స్వరూపాన్ని గురించి చెప్తున్నారు. ఏమనగా సమస్త ప్రాణికోటి ఆయనలోనే వున్నది, ఆయన ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నారు.

అంతేకాకుండా ఆయనను పొందు మార్గం గురించి చెప్తున్నారు. ఎలా? అనన్య భక్తి చేత. ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న విరాట్పురుషుడు మన ఊహకు అందనివాడు. అటువంటి అతనిని పొందాలంటే “అనన్యభక్తి” ఉంటే చాలు. భగవంతుడు తప్ప ఇతరమైనవి లేవు అన్నస్థితి.

అనన్య భక్తికి ఉదాహరణ: కృష్ణావతారంలో గోపికలు.

గోపికల అనన్య భక్తి:- ఒకసారి శ్రీకృష్ణుడు తనకు తలనొప్పి వచ్చినట్టు నటించాడు. రుక్మిణీ, సత్యభామ, జాంబవతి మొదలగు వారందరూ తమకు తోచిన మందులన్నీ తెచ్చి వాడారు. అయినను తగ్గలేదు. ఇంతలో అక్కడికి నారదమహర్షి వచ్చాడు. అందరూ మహర్షి చుట్టు చేరి “స్వామీ! మీరే ఏదో ఒక ఉపాయం ఆలోచించి మా నాధుని తలనొప్పిని పోగొట్టాలి” అన్నారు. నారద మహర్షికి అంతయు తెలుసు. అయినను శ్రీకృష్ణుని అడగాలని నిశ్చయించాడు. “స్వామీ! మీ శిరోవేదనను ఏవిధంగా నివారించగలమో తెలియజేయండి?” అని అడిగాడు. అందుకు శ్రీకృష్ణుడు “నారదా! ఈ వ్యాధికి ఒకే మందు ఉన్నది. అది నిజమైన భక్తుని పాద ధూళి. దానిని సంపాదించు” అన్నాడు. నారదమహర్షి భక్తుల పాదధూళి సేకరించుటకు బయలుదేరాడు. ఎంతో మంది భక్తులను అడిగాడు. వారందరూ “మహర్షీ! మా పాదధూళిని ఏవిధంగా భగవంతుని శిరస్సుపై ఇవ్వగలము? మీరే చెప్పండి. అది గొప్ప అపచారము కాదా” అన్నారు. మరికొందరు “మహర్షీ! మేము అంతటి భక్తులము కాము” అన్నారు. నారదమహర్షి శ్రీకృష్ణుని వద్దకు వచ్చి “స్వామీ! ఏ భక్తులూ తమ పాదధూళిని ఇవ్వటానికి సిద్ధంగా లేరు. వారు అటువంటి కార్యమును చాలా అపచారంగా భావిస్తున్నారు” అన్నాడు. శ్రీకృష్ణుడు “నారదా! బృందావనంలోని గోపికలను అడుగు” అన్నాడు. ఈ మాటలన్నీ విన్న శ్రీ కృష్ణుని భార్యలు, బంధువులు గొల్లున నవ్వారు. అంత నారదుడు సందేహంతో “స్వామీ! ఆ గోపికలకు భక్తి అంటే ఏమిటో తెలుసా?” అని అడిగాడు. శ్రీకృష్ణుని ఆజ్ఞ ప్రకారం బృందావనం వెళ్ళాడు.

నారదుడు గోపికలతో “అమ్మా! నేను శ్రీకృష్ణుని దగ్గర నుండి వస్తున్నాను” అన్నాడు. ఈ మాట వినగానే అందరూ ఆతురతతో అతని చుట్టూ చేరి “మహర్షీ! మా గోపాలుడు బాగున్నాడా?” అని అడిగారు. అంత నారదుడు “అమ్మా! ఏమని చెప్పేది? శ్రీకృష్ణుడు శిరోవేదనతో చాలా బాధ పడుతున్నాడు. దానికి కావలసిన మందు కూడా చెప్పాడు. దాని కొరకై నేను వచ్చాను” అన్నాడు. “అయితే మహర్షీ! మందు ఏమిటో చెప్పండి. మేము వెంటనే తెచ్చిఇచ్చెదము” అన్నారు. “అమ్మా! మీ పాదధూళిని తెమ్మని చెప్పాడు శ్రీకృష్ణుడు” అన్నాడు. ఆ మాట వినగానే గోపికలందరూ మారుమాట్లాడకుండా ఒక కంబలి తెచ్చి, తమ పాదములను దానిమీద దులిపారు. అది ఒక మూటకట్టి నారద మహర్షి కి ఇచ్చారు. “అమ్మా! పాదధూళి, పరమాత్మకు ఇచ్చుట పాపం కదా” అని అడుగగా “మా కన్నయ్య శిరోవేదన తగ్గితే మాకు అంతేచాలు. ఈ పాపపుణ్యాలేవీ మాకు తెలియవు” అన్నారు. ఆ ధూళి మూటతో నారదుడు ద్వారకకు చేరాడు. అప్పటికే శ్రీకృష్ణుని శిరోవేదన మటుమాయమైనది. దానికి కారణం గోపికలు నిర్మలమైన మనస్సుతో భగవంతుని వాక్కును పాటించడమే. ఇది నిజమైన భక్తుని లక్షణం. ఇది చేయవచ్చునా, చేయకూడదా అన్న సంశయము భగవంతుని మాటలకు వర్తించదు. గోపికల అనన్య భక్తిని అందరికీ తెలియజేయుటకు శ్రీకృష్ణుడు ఈ నాటకం ఆడాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: