రామేశ్వరము
రామేశ్వరము
రావణుడు అపహరించిన సీతను వెతుక్కుంటూ వచ్చిన రాముడు దక్షిణ సముద్ర తీరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి అర్పించిన క్షేత్రము రామేశ్వరము. ఆ సముద్రాన్ని దాటి లంకను చేరుకోడానికి సేతువు కట్టడం ప్రారంభించాడు రాముడు. పగలంతా శ్రమపడి వానరులు సేతువు నిర్మించేవారు. రాత్రి రావణుడు దీనిని పడగొట్టేవాడు. ఈ విధంగా
జరగటంతో ఎన్నాళ్ళయినా సేతువు నిర్మించడం సాధ్యం కాలేదు. అప్పుడు జాంబవంతుడు ఒక సలహా ఇచ్చాడు. “ఈ తీరాన శివునికి ఒక దేవాలయం నిర్మించండి. రావణుడు మహా శివభక్తుడు. దానిని పడగొట్టడు.” రాముడు దీనికి అంగీకరించి రామేశ్వర దేవాలయం నిర్మించాడని ఒక కథ ఉంది.
కాని అనేక గ్రంధాలలో కధ వేరుగా ఉంది. రావణుని సంహరించి సీతతో అయోధ్యకు తిరిగి వస్తున్న రాముడు కృతజ్ఞతా సూచకంగా మహేశ్వరుని అర్చించదలిచాడు. లింగానికి అవసరమయిన రాయిని తెమ్మని హనుమను పంపాడు. హనుమ రాయి తేవడం ఆలస్యం అయింది. ఈ లోపల రాముడు ఇసుకతో ఒక లింగాకారాన్ని చేశాడు. ఇంతలో హనుమ వచ్చి బాధపడ్డాడు. అతనిని ఓదారుస్తూ రాముడు హనుమ తెచ్చిన లింగానికే ముందు పూజ జరుగుతుందని వరం ఇచ్చాడు.
అందువల్లే, రామేశ్వరంలో దేవాలయంలో రాముడు ప్రతిష్టించిన రామేశ్వరుని అర్చించేముందు హనుమ తెచ్చి ప్రతిష్ఠించిన విశ్వేశ్వరుని ముందు పూజించడం సంప్రదాయ మయింది. ఈ క్షేత్రాన్ని వేలమంది యాత్రికులు సందర్శిస్తారు. కాశీ యాత్ర చేసిన మోక్షం వస్తుంది. కాని రామేశ్వర యాత్రతో గాని ఆ యాత్ర పరిపూర్ణం కాదని సంప్రదాయం ఏర్పడింది.