రావణుని అంతం
రావణుని అంతం
రాముడు, అతని సైన్యంతో దీర్ఘంగా సాగిన యుద్ధానికి ముగింపు పలికేందుకు రావణుడు యుద్ధ భూమికి వేగంగా వెళ్ళేడు. రావణుడు రాముని పై ఖచ్చితంగా విజయం సాధించడానికి ‘పాతాళ హోమం’ అనే హోమం చేద్దామనుకున్నాడు. కానీ విభీషణుని హెచ్చరికతో రాముడు అంగదుడినీ, హనుమంతుడినీ ఆ హోమం జరగనియ్యకుండా చూడమన్నాడు. రావణుని సైన్యాన్ని సులభంగా నాశనం చేసేరు. అప్పుడు రాముడు వానరులందరినీ విశ్రాంతి తీసుకుంటూ తనకూ, రావణునికీ జరిగే యుద్ధం చూడమన్నాడు. త్వరగానే రావణుడు గర్జిస్తూ వచ్చాడు. ఆ సమయంలో రాముడు రావణుడిని తాను చెప్పేది వినమని, “రావణా! మూడు రకాల వ్యక్తులున్నారు. మొదటిది ‘పాతాళి’ వృక్షం. చక్కగా పువ్వులు పూస్తుంది. కాని ఆ పువ్వులు ఫలాలుగా మారవు. కేవలం మాటలు మాత్రమే చెప్పి, వారు చెప్పిన దానిలో కొంచెం కూడా చెయ్యని వారు ఇలాంటి వారు. రెండవ సమూహం వారు అరటిచెట్టు లాంటివారు. ఇది పళ్ళూ, పువ్వులు రెండూ ఇస్తుంది. ఎవరైతే చెప్పి, చేసి, స్థిరంగా చెప్పేది ఆచరిస్తారో, వారు ఇటువంటి వారు. మూడవది పనసచెట్టు లాంటివారు. దానికి పువ్వులుండవు కానీ పండ్లు ఉంటాయి. నిశ్శబ్దంగా పనిచేస్తూ, ఎవరు గొప్పలు చెప్పుకోరో వారు ఉత్తమోత్తములు. నీతి బాహ్యమైన నీ పరిపాలన నీ జాతి అంతటి వినాశనానికి కారణమైంది” అని రాముడు రావణుని చెప్పేడు.
గురువులు బాలలకు బోధించవలసినవి:
మనం నిశ్శబ్దంగా పనిచేయడం నేర్చుకోవాలి. మనం డంబాలు చెప్పుకోకూడదు. మనం చేసే ఏ పనికీ మనం ప్రతిఫలం ఆశించకూడదు. గురువులు వివరించవలసిన సంఘటన: స్వామి జీవిత కథ నుండి “చెప్పినట్లు చేస్తారా” నాటకం.
గ్రహించి అలవరుచుకోవలసిన విలువలు: పుంఖాను పుంఖంగా చేసే బోధనలకన్న చిన్నమెత్తు ఆచరణ మేలు.
మన విధియే దైవం, పనియే పరమాత్ముని పూజ.
రావణుడు నిందిస్తూ, రాముని పై బాణాలు ప్రయోగించాడు. కానీ రాముడు అగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. అది రావణుని బాణాలని దహించి వేసింది. రాముడు రావణుని శిరస్సు ఖండించినా వెంటనే కొత్త తలలు పుట్టుకొచ్చేయి.
గురువులు బాలలకు బోధించవలసినవి:
దురలవాట్లూ, వ్యతిరేక భావాలు ఒక మారు అలవరుచుకుంటే అంత వేగంగా పోవు. ఒక దురలవాటుని జయించాలనుకుంటే ఇంకొకటి పుట్టుకొస్తుంది. మనం ఈ దుర్మార్గమైన చక్రంలో ఇరుక్కుపోతాం. అందుచేత మనం మంచి అలవరుచుకోవడంలో చిన్న వయసు నుండీ అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే తదుపరి సంవత్సరాలలో ఇది పెద్ద పోరాటమే అవుతుంది.
గ్రహించి అలవరుచుకోవలసిన విలువలు:
ఎల్లప్పుడూ జాగరూకుడివై ఉండు. మంచిగా ఉండు, మంచినే చూడు, మంచినే చెయ్యి. ముందుగా ప్రారంభించు, నెమ్మదిగా నడువు, సురక్షితంగా చేరుకో.
యుద్ధం పద్దెమిది రోజులు జరిగింది. పద్నాలుగేళ్ళ వనవాస కాలం ముగియడానికి కొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. రాక్షసుల అంతం చేరువలోనే ఉందని దేవతలకు తెలుసు. ధర్మ విజయాన్ని దర్శించేందుకు వారంతా ఆకాశం పైకి చేరుకున్నారు. రాముడు రావణుని పై బాణపరంపర ప్రయోగించేడు. అవి అతని శిరస్సులనీ, చేతులనీ ఖండించేయి. ఆ విధంగా రావణుడు రాముని
చేతుల్లో ప్రాణాలు కోల్పేయేడు. ఆ రోజు చైత్రశుద్ధ చతుర్దశి. వానరులందరూ సంతోషించారు. రాముని బల, సామార్థ్యాలకీ, రాముని దివ్య తేజస్సుకీ ఆశ్చర్యచకితులయ్యేరు.
ఎప్పుడూ సహాయం చెయ్యి, ఎన్నడూ గాయపరచకు.
అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు. ఎల్లప్పుడూ జాగరూకుడివై ఉండు. చెడు సహవాసాల నుండి తప్పుకో. మంచి చూడు, మంచి చెయ్యి మొదలైన దివ్యమార్గదర్శకాలు అనుసరించడం వలన జీవితాంతమూ మనం ఎప్పుడూ మంచిగా ఉంటాము.
గురువులు బాలలకు బోధించవలసినవి: మంచి పై విజయానికి చెడు ఎంతైనా ప్రయత్నించవచ్చు కాని అది విఫలమౌతుంది. కాని అంత వరకూ మంచి విలువలతో, ఓర్పుతో కట్టుబడి ఉండాలి. మనం మన సహనాన్ని కోల్పోకూడదు. మనం దృఢనిర్ణయం, పట్టుదలని కాపాడుకోవాలి, వ్యతిరేక భావాలని అధిగమించడానికి
ప్రయత్నించాలి. ఎప్పుడూ మంచిగా ఎలా ఉండాలో గురువులు వివరించాలి.
గ్రహించి అలవరుచుకోవలసిన విలువలు: అంతరాత్మను అనుసరించు, మనోభూతాన్ని ఎదుర్కో, అంతం వరకూ పోరాడు, ఆటను పూర్తి చెయ్యి.
రావణుని మరణం తరువాత రాముడు లక్ష్మణుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు, అంగదుల్ని పిలిచి నలుడు, నీలుడు మిగిలిన వారినీ లంకకు తీసుకుని వెళ్ళి, విభీషణునికి రాజుగా పట్టాభిషేకం చేయమని చెప్పేడు. రాముడు రావణుని ఓడించాడనే శుభవార్తని సీతకు చెప్పడానికి హనుమంతుడిని పంపించేడు. వెంటనే సీతను రాముని వద్దకు తీసుకువచ్చారు.