రావణ వధ

Print Friendly, PDF & Email
రావణ వధ

Ravana Meets His End

రామ రావణ యుద్ధము ప్రారంభమయింది. వానరులు, రాక్షసులు హోరా హోరీగా పోరాడుతున్నారు. సుగ్రీవ, హనుమ, జాంబవంత, అంగదాది వానరవీరుల చేతుల్లో ప్రముఖ దావన సేనాధిపతులు ఒక్కొక్కరు మరణిస్తున్నారు.రావణునికి ఆందోళన ఎక్కువయింది. ఎటు చూచినా వానర వీరులు విజృంభిస్తున్నారు. దావన సేనాధిపతి ప్రహస్తుడు కూడా రణరంగంలోకూలిపోయాడని తెలిసి రావణుడే స్వయంగా యుద్ధరంగంలోనికి ప్రవేశించాడు. రాముడు మొదటిసారిగా రావణుని చూచాడు. “ఆహా ఏమి ఇతని తేజస్సు! అహంకారము, మోహము అనే దుర్గుణాలే లేకుంటే ఇతన్ని నేను జయించగలనా!” అనుకున్నాడు.

రామ రావణులు కొంత సేపు తీవ్రంగా యుద్ధం చేశారు. రాముడు దివ్యాస్త్రాలతో రావణుని రధాన్ని, సారధిని కూల్చి ఒక్క బాణంతో రావణుని కిరీటాన్ని ఎగురగొట్టాడు. ధనుస్సును ఖండించాడు. రావణుడు దిగ్బ్రాంతి చెంది నిలబడ్డాడు. రాముని ధనుర్విద్య అతనికి కళ్ళు మిరుమిట్లు గొలిపింది. కానీ రాముడు స్నేహపూర్వకంగా “రావణా! ఆయుధం లేని నిన్ను నేను వధించను. కాస్త విశ్రమించి సాయుధుడిగా తిరిగిరా యుద్ధం చేస్తాను” అన్నాడు. రావణుడు అవమానం భరించలేకపౌయాడు. ఇంతవరకు ఓటమి అన్నది ఎరుగడు. తనను ఓడించినది దివ్యశక్తులున్న దేవతలు కారు, మాయా శక్తులున్న దానవులు కాదు. మానవమాత్రుడు. రామునికి కనీసం రథమైనా లేదు. మొట్టమొదటి సారిగా రావణునికి తాను దోషినన్న భావము కొద్దిగా పొడచూపింది. కానీ ఇంతలో అహంకారము మళ్ళీ ఆవహించింది. వెంటనే తన సోదరుడైన కుంభకర్ణుని లేపి యుద్ధానికి వెళ్ళమని ఆజ్ఞాపించాడు. గాఢనిద్రలో ఉన్న కుంభకర్ణున్ని రాక్షసులు అతి ప్రయత్నంమీద లేపారు. కుంభకర్ణుడు నేరుగా సభలో ఉన్న రావణుని వద్దకు వచ్చాడు. రావణుడు అతనిని చేర బిలిచి “సోదరా! నిన్ను నిద్ర లేపక తప్పలేదు. దానవ, వానర సేనల యుద్ధ౦ గురించి విన్నావుగదా! ఈ సమయంలో నీవు తప్ప నాకు ఎవరు

దిక్కు. అందుకే నిన్ను నిద్ర లేపాను” అన్నాడు.

కుంభకర్ణుడు “అన్నా! ఈనాడున నా అవసరం నీకు కలిగిందా? ఎవరిని అడిగి సీతను అపహరించి తెచ్చావు? రాముని యుద్ధంలో ఓడించి అతని భార్యను చెరబట్టడం వీరుని లక్షణము కాదు. రాజ ధర్మాన్ని ఉల్లంఘించావు, అనుభవిస్తున్నావు. అయినా నా కర్తవ్యం నేను నెరవేరుస్తాను. నీ కొరకు నా శాయశక్తులా యుద్ధం చేస్తాను” అని యుద్ధ రంగాన్ని ప్రవేశించాడు.

కుంభకర్ణుడు విజృంభించి వానర సేవను చీకాకు పరిచాడు.అతని ముందు వానర వీరులెవరు నిలువలేక పోయారు. ఇతని ఆగడము సహించ లేక రాముడు తీవ్ర యుద్ధంలో కుంభకర్ణుణ్ణి చంపాడు.

రావణుని వైపు ఇక మిగిలింది ఇంద్రజిత్తు. రాముడు విభీషణ సహితంగా లక్ష్మణున్ని పంపాడు. లక్ష్మణుడు ఇంద్రజిత్తుని అస్త్ర యుద్ధంలో ఓడించి నేలగూల్చాడు. ఈ వార్త విని రావణుడు మూర్ఛపోయాడు. మండోదరి విలపించింది. రావణుడు తెప్ప రిల్లాడు. అతనికి అంతా తన తప్పులే ఎత్తిపొడుస్తున్నట్లు కను పించ సాగాయి. కాని గుండె దిటవు చేసుకొని తెగించినవాడై యుద్ధరంగానికి ప్రవేశించాడు. ఎదురు నిల్చిన వానర ముఖ్యులందర్ని పడగొట్టి నేరుగా రాముని ఎదుర్కొన్నాడు. రామ రావణ యుద్ధం ఆతి భయంకరంగా సాగింది. ఆ ఇద్దరి అద్భుత ధనుర్విద్య ప్రదర్శన తిలకించటానికి దేవ గంధర్వ, విద్యాధర, యక్ష, కిన్నెర, కింపురుషులు ఆకాశం అంతా నిండిపోయారు. నేలపై నిలిచి పోరాడుతున్న రాముడి కోసం ఇంద్రుడు తన దివ్య రధాన్ని, తన సారధి మాతలిని పంపాడు. రాముడు ఆ దివ్య రథానికి ముమ్మారు ప్రదక్షిణ చేసి, రథాన్ని అధిరోహించాడు. ఒకరి కొకరు తీసిపోరు అన్నట్టుగా యుద్ధం చేశారు. రాముడు రావణుని శిరస్సులను ఒక్కొక్కటిగా ఖండించాడు. కాని ఒకటి క్రిందపడితే మరొక శిరస్సు మొలచింది. అది చూచి రాముడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు మాతలి ప్రభూ! బ్రహ్మాస్త్రం మరిచారా?” అని గుర్తు చేశాడు. రాముడు కృతజ

్ఞతా సూచకంగా తలవంచి, బ్రహ్మాస్త్రం మంత్రించి శరాన్నివిడిచాడు. అది రావణుని ఉదరాన్ని చీల్చుకుని వెళ్ళింది. రావణుడు నేల గూలాడు. వానరులు జయజయ ధ్వనులు చేశారు. రాక్షసులు రోదించారు.

విభీషణుడు శోకం భరించలేక పోయాడు. రాముడు అతనిని ఓదార్చి “విభీషణా! ఎంత చేసినా రావణుడు నీ సోదరుడు. అతనికి శాస్త్రయుక్తంగా అంత్యక్రియలు చేయుట నీ ధర్మము.” అని లక్ష్మణుని చూచి “సోదరా! చూశావా! రావణుడు ఎంతో పరాక్రమశాలి, పరమ శివభక్తుడు. కానీ అహంకారము, స్త్రీ వ్యామోహము అతని నాశనానికి దారి తీశాయి” అన్నాడు.

ప్రశ్నలు:
  1. రావణునికి యుద్ధం గురించి ఆందోళన ఎందుకు కలిగింది?
  2. రావణుడు తనను పిలిపించినపుడు కుంభకర్ణుడు ఏమన్నాడు?
  3. రావణుని గూర్చి రాముడు వెలిబుచ్చిన అభిప్రాయం ఏమి?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *