నిజమైన బ్రాహ్మణుడు
నిజమైన బ్రాహ్మణుడు
బ్రాహ్మణ వంశంలో పుట్టిన సన్యాసి ఒకడు ఒక నదీ తీరంలో తపస్సు చేసుకుంటూ కొన్నాళ్ళు గడిపిన తర్వాత, తాను ఒక సిద్ధుడని , మహా తపస్సంపన్నుడనీ అనుకున్నాడు. తాను సర్వసంగ పరిత్యాగిననీ, పాపులయిన ప్రజల మాలిన్యం తనకు అంటకుండా దూరంగా ఉన్నానని, తనకన్నా వారు హీనులని ఆ బ్రాహ్మణుని ఉద్దేశము.
తాను ప్రతి దినము చేసె పవిత్రనదీ స్నానము, ఒంటిపూట స్వయంపాక భోజనము, రోజులో ఎక్కువభాగము కళ్ళుమూసుకొని పురాణాలలోని శ్లోకాలు వల్లించడం, జన సమ్మర్దానికి దూరంగా, ఒంటరిగా నివసించడము, ఇవన్నీ తనను పరమ పునీతునిగా చేశాయని ఆయన నమ్మకము. కాని నిజంగా చూస్తే ఆయన హృదయంలో తోటివారి బలహీనతల ఎడల సానుభూతి, తోటివారికి కొంచెమయినా సహాయం చేద్దామనే భావన, మచ్చుకైనా లేవు. గాలి, వెలుతురు చొరరాని గుహవలె అంధకారంతో నిండి ఉంది అతని హృదయము. ఎవరైనా తన ఆశ్రమానికి వచ్చి తనను పలకరించడానికి ప్రయత్నిస్తే, వారి మాలిన్యం తనకి ఎక్కడ అంటుతుందేమో అని, ఎవ్వరితో మాట్లాడేవాడు కాదు. బాహ్యంగా తపోవృత్తిలో ఉన్నా, ఆయన అంతరంగం మాత్రం అహంకారంతోనూ నిగ్రహించుకోలేని క్రోధంతోనూ నిండి ఉంది.
ఒకనాడు కొత్తగా ఆ వూరికి వచ్చిన చాకలి ఒకడు నదిలో బట్టలు ఉతకడానికి వచ్చాడు. అక్కడికి దగ్గరలోనే ఒక పొద వెనుక జపం చేసుకొంటూ ఉన్న సన్యాసిని అతడు చూడలేదు. మురికి బట్టలు గట్టిగా ఉతకడంతో మురికి నీళ్ళ చుక్కలు కొన్ని సన్యాసిమీద పడ్డాయి. సన్యాసి తన మీదపడ్డ నీటి బిందువులకు చలించి కళ్ళు విప్పి చూచాడు. దగ్గరలోనే బట్టలు ఉతుకుతున్న చాకలిని చూచాడు. అతని కోపం హద్దులు దాటింది. బట్టలు ఉతకడం ఆపమని పెద్దగా అరిచాడు. కాని తన పనిలో నిమగ్నమయిన చాకలివానికి ఆ మాటలు వినపడలేదు. అందువల్ల ఉతకడం ఆపలేదు. నీటి బిందువులువచ్చి సన్యాసి మీద పడ్తూనే ఉన్నాయి. తన ఆజ్ఞను లెక్క చేయని చాకలిమీద మితి మీరిన కోపంతో, జపం చేసుకుంటున్న చోటు వదలివచ్చి “ఓరీ చండాలుడా! నా మాటను లెక్కచేయక, నా మీద మురికినీరు చల్లడానికి ఎంత ధైర్యం రా నీకు!” అని తనను తాను నిగ్రహించుకోలేక వడివడిగా వచ్చి చాకలిని ఎడా పెడా కొట్టడం ప్రారంభించాడు.
తనను దెబ్బలు కొట్టేది ఒక బ్రాహ్మణుడని గ్రహించిన చాకలి సహించాడు. చివరకు “స్వామి! నేను చేసిన అపరాధ మేమిటి?” అని అడిగాడు. సన్యాసి క్రోధంతో “ఏమిటీ నీవు ఏం చేసావో నీకు తెలియదా? నా ఆశ్రమ ప్రాంతంలో అడుగు పెట్టడమే పెద్ద నేరము, పైగా జపం చేసుకుంటున్న నన్ను లెక్క చేయక మురికినీరు పడేటట్లు బట్టలు ఉతుకుతావా? చండాలుడా!” అని అన్నాడు
తనకు తెలియకుండా ఆశ్రమ ప్రాంతంలో అడుగు పెట్టానని తెలుసుకున్న చాకలి, “స్వామీ! నన్ను క్షమించండి. నేను ఈ తప్పు తెలిసి చేయలేదు” అని వేడుకున్నాడు. చాకలి వాని స్పర్శతో తాను అపవిత్రమైనానని స్నానం చేయడానికి వెళ్ళాడు. చాకలికూడా వెళ్ళి సన్యాసికి కొంత దూరంలో స్నానం చేయసాగాడు. అది చూచి “ఎందుకు స్నానం చేస్తున్నావు?” అని అడిగాడు.
“మీరెందుకు చేస్తున్నారు?” అని అడిగాడు చాకలి.
“అపవిత్రత పోగోట్టు కోడానికి” అన్నాడు సన్యాసి.
“నేనూ అందుకే” అన్నాడు చాకలి.
“నీలాంటి చండాలుణ్ణి తాకి అపవిత్రుడయినాను” అని సన్యాసి అనగా
“నేనుగూడా మరోరకంగా అపవిత్రుడనైనాను” అన్నాడు చాకలి.
“నా వంటి తపోనిష్ఠాగరిష్ఠుడు నిన్ను తాకితే పవిత్రుడు అవుతావుగాని మైలపడవుగదా?” అని సన్యాసి పల్కగా
“స్వామీ! చండాలునికన్నా హీనమయినవాడు మీ ద్వారా నన్ను తాకడం జరిగింది. మీరు నా పైన చూపించిన ఆ కోపంలో ఒళ్ళు తెలియని ఆవేశంతో నన్ను కొట్టడం, ఇవన్నీ చండాలునికన్నా హీనమయిన లక్షణాలు, అవి మీ ద్వారా నన్ను తాకాయి. ఆ మైల పోగొట్టుకోవడానికి నేను స్నానం చేస్తున్నాను.”
ఈ మాటలకు సన్యాసికి కళ్ళు బైర్లు కమ్మాయి, తల గిర్రున తిరిగింది. తలమీద పిడుగుపడినట్లు అనిపించింది. చాకలి మాటలలోని అర్ధాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. తాను ఇన్నాళ్ళు చేసిన తపస్సు, కఠోర నియమాలు, గ్రంధపఠనం తెలియజేయలేని పరమ సత్యాన్ని చాకలివాని మాటలు తెలియజేశాయి. ఒక రాజ్యాన్ని గెల వడం కన్నా, తన కోపాన్ని గెలుచుకోడం చాలా గొప్పది. తనలోని క్రోధాన్ని మించిన చండాలత్వం మరొకటి లేదు. అప్పుడు సన్యాసి తనను చాకలివానితో పోల్చుకున్నాడు. చాకలివాడు చేసిన చిన్న తప్పుకు విపరీతమైన క్రోధము, ఆవేశము తెచ్చుకున్న తాను, ఆవేశంతో తిట్టి, కొట్టినా నిగ్రహించుకున్న చాకలి వీరిద్దరిలో ఎవరు నిజమైన బ్రాహ్మణుడు ఎవడు చండాలుడు?
ప్రశ్నలు:
- సన్యాసి కోపానికి గల కారణమేది?
- చాకలి ఏమి చేసాడు?
- చాకలి బ్రాహ్మణునికి ఇచ్చిన సమాధానం ఏమి?