శబరిమోక్షం
శబరిమోక్షం
రామలక్ష్మణులు దక్షిణ దిశగా బయలుదేరారు. తన గురువు మతంగ మహర్షి శరీరాన్ని వదిలిపెట్టేముందు భవిష్యవాణి చెప్పిన విధంగా, రాముని రాక కోసం నిరీక్షిస్తున్న దైవ భక్తి గల శబరి అనే స్త్రీని కలుసుకున్నారు. “ఓ రామా! ఓ ప్రభూ! నా గురువు కోరిక నెరవేరింది. కుటీరం కొన్ని అడుగుల దూరంలో ఉంది. దయచేసి దానిలో ప్రవేశించి పునీతం చెయ్యి” అని రాముని పాదాలపై వాలి ప్రార్ధించింది శబరి. రాముడు కుటీరంలో ప్రవేశించగానే శబరి ఎంత శక్తి పుంజుకుందంటే, నదికి నడిచి వెళ్ళి చల్లని నీరూ, పండ్లూ రాముని కోసం తెచ్చింది. రామునికి సమర్పించే ముందు పండ్లను ఆమె రుచి చూసింది. ఆమె తీయని పండ్లనే రామునికి అర్పిద్దామనుకుంది. శబరి భక్తికి, అంకితభావానికి, ప్రేమకు, రాముడు సంతృప్తి చెందాడు. “తల్లీ! నాకు కావలసినది భక్తి ఒక్కటే. మిగిలినవి సహకారులు మాత్రమే. ప్రేమనిండిన భక్తి మాధుర్యాన్ని నేను ఇష్టపడతాను” అన్నాడు రాముడు.
గురువులు బాలలకు బోధించవలసినవి:
ఎవరు ప్రేమతో ప్రార్ధించి, వారి విధుల్ని ప్రేమతో నిర్వహిస్తే భగవంతుడు వారి ఇంటి వద్దనే దర్శనమిస్తాడు (వారి హృదయాలలో).
గ్రహించి అలవరుచుకోవలసిన విలువలు:
ప్రార్థన, నిర్మలమైన, భగవంతునిపై ప్రేమగల హృదయం నుండి వెలువడాలి. ప్రేమ లేని కర్తవ్యం నిరసించదగినది.
ప్రేమతోడి కర్తవ్యం కోరదగినది. కర్తవ్యం కాని ప్రేమ దివ్యమైనది.
[గురువులు శబరి కథను చెప్పి ఆమెకు రాముని పై గల అసమాన భక్తిని వివరించాలి. గురువుల పరిశీలన కోసం జూలై 18, 2012 ప్రశాంతి రిపోర్టర్ నుండి శబరి సాధనా పాఠాల నుండి ఎంపిక చేసిన భాగం ఈ క్రింద ఇవ్వబడింది.]
శబరికి రాముని మించిన ఆలోచన, రాముని దర్శించడం, అతని పాదాలను స్పర్శించడం, అతనితో సంభాషించే అవకాశం వీటిని మించిన కోరిక లేదు. రామరసంతో (నిత్యసత్యమైన రామసూత్ర సారం), రామసూత్ర మాధుర్యంతో ఆమె హృదయం సంపూర్ణంగా నిండిపోయింది. ఆమెకు మరే ఇతర జపము, ధ్యానము, ఆధ్యాత్మిక సాధన లేవు. దారులు ఎలా శుభ్రం చేసేదో, అలాగే హృదయాన్ని కూడా పరిశుద్ధం చేసుకుంది. ఆమె కృషితో గులకరాళ్ళూ, ముళ్ళూ, దారులనుండీ, ఆమె హృదయం నుండీ కూడా అదృశ్యమయ్యేయి. శబరి పొదల, తుప్పల మధ్య నడుస్తూ, దారిలో వేలాడుతున్న లతలు, ఊడల్ని, రాముడు తల దువ్వుకుని ఉండడు కాబట్టి, వాటిలో జడలు చిక్కుపడతాయేమోనని, తొలగించేది. వాటిపై నడిచినప్పుడు మట్టిగడ్డలు తగిలితే, మృదువైన సీతమ్మ పాదాలు గాయపడతాయేమోనని మట్టి గడ్డల్ని పగులగొట్టేది. రాముడెప్పుడొస్తాడో ఎవరికీ తెలియదు కదా! అని ప్రతి దినమూ పండ్లను, కందమూలాలను అడవిలోని చెట్లనుండి, మొక్కల నుండి సేకరించి దగ్గర పెట్టుకునేది. ఎందుకంటే, రామ సేవకు దూరమయ్యే అవకాశం రాకుండా చూసుకునేది. అది చేదుగా ఉన్నా, పుల్లగా ఉన్నా, తీయగా ఉన్నా ప్రతి పండునీ రుచి చూసేది. ఎందుకంటే రాముడు మధుర ఫలాలనే తినాలి. అడవి దార్ల వెంబడే ఉన్న రాళ్ళను ఆమె చదును చేసేది. ఎందుకంటే నడకతో అలసిపోయిన రాముడు, లక్ష్మణుడు, సీత ఏదో ఒక రాతి మీద కూర్చుంటారు కదా! ఎంతో జాగ్రత్తగా తాను చదును చేసిన రాళ్ళ పై ఎవరో ఒకరు కొంచెం సేపైనా కూర్చుంటారు. ఆ విధంగా ఆమె హృదయం రామ హృదయమైపోయింది. రాముని సేవించి ఆనందం పొందడానికి శబరి చేసిన సాధన, మీరూ చెయ్యవచ్చు, పేదలలోని సాయిరాముల్ని సేవించినప్పుడు ఈ సేవలవల్ల మీరే రాముడని తెలుసుకుంటారు.