సర్వధర్మాన్ పరిత్యజ్య – వివరణ
సర్వధర్మాన్ పరిత్యజ్య – వివరణ
సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ |
అహంత్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాశుచః ||
మోక్ష సన్యాస యోగము (18-66)
కురుక్షేత్ర యుద్ధ రంగం నందు అర్జునుడు తన బంధువులు, గురువులు, మిత్రులు అయినటువంటి కౌరవ సైన్యమును చూచి, ఎంతో దుఃఖించి “ఓ కృష్ణా! నేను రాజ్యమును కానీ, విజయమును గాని సుఖములను గాని కోరను. యుద్ధ రంగంలో నా బంధుమిత్రులను చంపి నేను ఎలా సుఖ పడగలను” అంటూ తన మానసిక ఆందోళనను కృష్ణపరమాత్మ ముందు వ్యక్తం చేసెను..
అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునునితో “నీవు శోకింప దగని వారి కొరకై శోకించు చున్నావు. యుద్ధం చేయుట నీ యొక్క కర్తవ్యము. దుర్యోధనాదులు అధర్మపరులు. యుద్ధము చేయని యెడల అధర్మాన్ని ప్రోత్సహించినట్లు అగును. ధర్మాధర్మముల గురించి విచారించక, సమస్త కర్మలకు కర్త భగవంతుడే అన్న పరిపూర్ణ విశ్వాసముతో నీవు యుద్ధము చేయుము. భగవంతుడు నీకు ప్రసాదించిన విద్యుక్త ధర్మాన్ని నిష్కామ బుద్ధితో, నిశ్చయాత్మక బుద్ధితో నిర్వర్తింపుము. కర్మ చేయుట యందే నీకు అధికారం కలదు. కర్మ ఫలితాన్ని భగవదర్పితం గావింపుము. అప్పుడే నీవు భగవంతుని పరిపూర్ణ అనుగ్రహం పొందగలుగుతావు. అప్పుడే నీ జీవితం సార్థకమవుతుంది.
ధర్మాన్ని అనుసరించే వారిని నిరంతరం ఆ ధర్మమే రక్షిస్తుంది. అధర్మ మార్గాన్ని అనుసరించే వారు, సుఖ సంపదలు తాత్కాలికంగా పొందిప్పటికీ, వాటిని కోల్పోయి దుఃఖాన్ని అనుభవించక తప్పదు.
ఈ విధంగా భగవంతుడు నిర్దేశించిన మార్గంలో మన కర్తవ్య కర్మలను నిర్వహించినట్టయితే, సదా ఆయన సంరక్షణలో వుంటూ, ఆయన ఆనుగ్రహానికి పాత్రులము అవుతాము. ఇందులో సంశయించవలసిన అవసరం లేదు.
“భగవదనుగ్రహానికి సమానమైన అస్త్రము ఏదీ లేదు”