సత్త్వం రజస్తమ ఇతి గుణాః -వివరణ

Print Friendly, PDF & Email
సత్త్వం రజస్తమ ఇతి గుణాః -వివరణ

ఓ మహాబాహు అర్జునా! పరిశుద్ధ, ఉద్రేక,అజ్ఞాన తత్వములైన త్రిగుణములు ప్రకృతి నుండి ఆవిర్భవించినవి. ఈ త్రిగుణములు నాశనము లేని ఆత్మను దేహమునకు బంధించుచున్నవి.

క్షేత్రము/ దేహము నాది అను అభిమతము అభివృద్ధి పరచుకొన్న, సత్వరజ తమోగుణములైన త్రిగుణాత్మక స్వస్వరూపముగా జీవుడు ఆ స్థితులను అనుభవించుచున్నాడు. అవ్యయము అనగా (ఆత్మ) నాశనము లేనిది అని అర్థము. దీనికి ఏ బంధమూ లేదు, సంబంధమూ లేదు. అజ్ఞానము చేత బంధింపబడి ఉన్నామని తలంచుతున్నాము. మమకార, అభిమాన, అహంకారములు ఆత్మను త్రిగుణముల స్వరూపమైన దేహమునకు బంధించుచున్నవి. జ్ఞాని అయినవాడు దీనిని తెలుసుకొనగలుగుతున్నాడు. ఉదాహరణకు రామకృష్ణ పరమహంస ఆత్మ, పరమాత్మ యొక్క అంశయని, భౌతిక దేహముతో దానికి ఎటువంటి సంబంధం లేదని తెలుసుకున్నాడు. రామకృష్ణ పరమహంస తన అంత్య దశలో గొంతు క్యాన్సర్ కు గురి అయినారు. చిన్న గ్లాస్ మంచినీళ్లు కూడా తాగలేకపోయేవారు. అయినా ఎటువంటి కలత చెందక, ఆనందంగా ప్రశాంతంగా ఉండేవారు. అది ఎలా సాధ్యమని శిష్యులు ప్రశ్నించగా, ఈ దేహము నాది కాదు నాకు ఎటువంటి బాధ లేదు అని చెప్పేవారు. అది జ్ఞాని యొక్క లక్షణము.

“గుణ” అనగా త్రాడు అని అర్థము. త్రిగుణముల స్వరూపమే ప్రకృతి. పరమాత్ముని స్వరూపమే ప్రకృతి. ప్రకృతి భగవంతుని సాకార స్వరూపము మరియు ప్రతిబింబము. ప్రకృతి అన్ననూ, క్షేత్రమన్ననూ (దేహము) ఒక్కటే. చైతన్య స్వరూపుడై, క్షేత్రము యొక్క స్థితిని సంపూర్ణముగా తెలుసుకొనివాడినే జీవుడని క్షేత్రజ్ఞుడని అందురు. త్రిగుణములు- సత్వ గుణము, రజోగుణము, తమోగుణము.

సత్వ గుణము:

సత్వ గుణము నిశ్చల, నిర్మల తేజస్సు కాన ఈ గుణము కలవారు ఎట్టి కోరికలు లేక ఉండును. ఆనందముతో సంతోషంగా ఆత్మ జ్ఞాని అయి ఉంటారు. పరిశుద్ధతత్వంతో కూడిన సత్వగుణము మంచి ఆలోచనలను ప్రేరేపిస్తుంది. మంచి ఆలోచనలకు ప్రేరణ ఇస్తుంది. నిరంతర జ్ఞాన సముపార్జనకు ప్రేరేపిస్తుంది.

సత్వగుణము కలిగిన వారు ఈ లక్షణములను కలిగి ఉంటారు – నిజమైన ఆనందం పొందగోరుతారు, వెన్న వంటి మనస్సు కలిగి ఇతరుల సుఖదుఃఖములకు లేక భగవంతుని లీలలు విన్ననూ ఇట్టే కరిగిపోతారు – మకరందం కలిగిన పువ్వులకు మాత్రమే ఆకర్షితులైనటువంటి భ్రమరములను పోలి ఉంటారు – సత్కర్మలను ఆచరిస్తూ , భజనలలో పాల్గొంటూ, పవిత్ర మత గ్రంథములను చదువుతూ, సజ్జన సాధు సాంగత్యమును పొందగోరుతారు. విభీషణుడు ఈ గుణమునకు మంచి ఉదాహరణ.

రజోగుణము(ఉద్రేకము):

రజోగుణము ఆశను కలుగజేయు పాశము. దృశ్య విషయములందు అనురాగము కలుగుచేయునది. దీనికి ఐహిక సుఖములందు ఆసక్తి. ఈ గుణము ఈగవలె మంచి వాటి మీద మరియు కుళ్ళిపోయిన (చెడ్డ) వాటి మీద కూడా వాలుతుంది (ఆసక్తి చూపుతుంది). ఈ గుణము అహంకారము, అసూయ, లోభత్వము కలుగజేసి మానసిక శాంతి లేకుండా చేస్తుంది. రావణుడు ఈ గుణమునకు ఉదాహరణ. బాహ్య ప్రపంచంలో ఆనందమును పొంద ప్రయత్నించాడు.

తమోగుణము(జడత్వము – మందమతి తత్వం)

ఈ గుణము నిజ జ్ఞానము తెలియకపోవుటచే ఒక వస్తువును మరొక వస్తువుగా తలచుట జ్ఞాన రహితమైన అజాగ్రత్తగా బద్ధకముచే బంధించుట ఇత్యాది గుణములు కలది. ఈ గుణము మానవుని దుఃఖశోకాది విషయములకు, మూర్ఖత్వమునకు, నిర్లక్ష్యమునకు దారి తీయించి నీచ స్థితిలోకి దిగజార్చుతుంది. ఈ తమోగుణము అన్నది అశుద్ధములోని క్రిముల వంటిది.

ఈ గుణము అధికముగా కలవారు నిరంతరము తినుట, త్రాగుట, నిద్రించుట యందు జీవితమును వ్యర్థము కావింతురు. కుంభకర్ణుడు ఈ గుణమునకు ఉదాహరణ.

అన్ని మతముల యొక్క లక్ష్యము రజ తమోగుణముల యొక్క ప్రభావమును తగ్గించి సత్వగుణమును పెంపొందించుటయే. అప్పుడే మానవులు నిజమైన ఆనందమును పొందెదరు.

సత్వగుణము జ్ఞాన సముపార్జనకు దోహద పడుతుంది. మోక్షము కావాలని కోరుట కూడా బంధమే. మానవుడు సహజముగా స్వతంత్రుడు. బంధనము అన్నది ఒక బ్రాంతి. లేని బంధముల నుండి విముక్తి కావాలనుకోవటం అజ్ఞానమునకు నిదర్శనము.

ఈ మూడు గుణములును సమస్థితియందుండిననే జ్ఞాన జ్యోతిని పొందగలరు. దాని ద్వారా మోక్షానందమును అనుభవించగలరు.

రాజసము

ఈ గుణము ఎరుపు రంగును ప్రతిబింబిస్తుంది రజోగుణం అధికంగా కలవారి మనస్సు ఉద్రేకముల చేత ఆవేశముల చేత అల్లకల్లోలముగా ఉండును. దీనికి కారణం వాంఛ మమకారములే. రాజసిక గుణము కలిగిన మానవుడు తన వాంఛలు నెరవేర్చుకొనుటకు నిరంతరముపెనుగులాడుతూ ఉంటాడు. ఒక వాంఛ నెరవేరగానే అది మరొక వాంఛకు దారితీస్తుంది.

ఆ విధంగా రజోగుణము మన చేయు కర్మలను అధికము చేస్తుంది. మనము ఒక విషయమందు ఆసక్తి చూపిన, ఆకర్షితులమైన దానిని పొందాలి అనే వాంఛ కలుగుతుంది. ఆ కోరిక నెరవేర్చుకొనుటకు మార్గము ఆలోచించి, దానికి అవసరమైన వ్యయ ప్రయాసలకు లోనవుతాము. ఆ విధముగా అనేక కష్టనష్టములకు ఓర్చి పొందినటువంటి దానితో అనుబంధం ఏర్పడి/మమకారము పెంచుకొని దానిని ఎలా సంరక్షించుకోవాలి అని వ్యాకుల పడతాము. కనుక రజోగుణము మనలో వ్యాకులతను, ఆందోళనను, లోభత్వమును పెంపొందించి స్వార్ధపరులుగా పరుల పట్ల నిర్ధయులుగా మార్చుతుంది.

తామసము:

తమస్సు, మూర్ఖత్వము, జడత్వము, నిర్లక్ష్యము, అజ్ఞానము, బ్రాంతి అనునవి తామస లక్షణములు. తమోగుణము అధికముగా కలవారు సత్యాసత్యముల మధ్య తారతమ్యము తెలుసుకొను విచక్షణ కలిగి ఉండరు. ఏది చేయ తగినది, ఏది చేయ తగనిది అని తెలుసుకొనలేడు. నిజ జ్ఞానము లేక అపోహలకు లోనై పెడమార్గంలో మంద బుద్ధి గలవానిగా అచేతనుడిగా ప్రవర్తించును. ఎల్లప్పుడూ నిద్రాలోలుడై యుండును. భగవత్ సంబంధమైన ప్రీతి కలిగి ఉండడు. వివేక విచారణ సలుపు శక్తి లేక ఎటువంటి సత్కార్యములకు పూనుకోడు.

తమోగుణమధికమైనప్పుడు బుద్ధి మందగించి నిర్ణయాత్మక శక్తి క్షీణిస్తుంది. అజ్ఞానాంధకారముచే సత్యమును వీక్షించలేక సరియైన నిర్ణయములు తీసుకొనలేరు.

ఏ కార్యము చేపట్టవలెనన్నా ఆత్మవిశ్వాసము లేక బాధ్యతను విస్మరించెదరు. ఏదైనా సాధించాలి అన్న ఉత్సాహం ఉండదు. ఆశయ సిద్ధి, లక్ష్యసాధనలను తమోగుణము నీరుగారుస్తుంది. తినుట, నిద్రించుట జీవిత ముఖ్య ఉద్దేశములుగా ఉంటాయి. విచక్షణ శక్తిని నశింపజేసి ఉన్నత స్థితి నుండి దిగజార్చుతుంది.

సంస్కృతంలో “గుణ” అనగా త్రాడు అని అర్థము. జీవిత పరమావధి అయిన ఆధ్యాత్మిక లక్ష్యసాధన గుణములనే త్రాడు చేత ప్రాపంచిక విషయములందు బంధింపబడి ఉంటుంది. త్రిగుణముల ప్రభావము మనస్సుపై ఉంటుండాది. గుణములను బట్టి క్రియలు కూడా జరుపుతూ వస్తారు. మనస్సుపై సత్వగుణ ప్రభావము అధికముగా ఉన్నప్పుడు మానవుడు పవిత్రమైన సన్మార్గములో ప్రవేశిస్తాడు. రజోగుణము ప్రభావము చూపిన రకరకములైన ప్లాన్లు వేసి కార్యములను సిద్ధింప చేసుకొనుటకు ఆతురతతో ఉంటాడు. తామసము అధికముగా ఉన్నప్పుడు జడుడై నిర్మలత్వము నిశ్చలత్వము లేక నిరంతరము కార్యసిద్ధిలో విఫలుడవుతూ ఉంటాడు.

సత్వరజ తమోగుణములను త్రాళ్లు ఆత్మను ప్రకృతి జన్య దేహంలో బంధించుచున్నవి. సత్యమైన నిత్యమైన ఉన్నతమైన ఆత్మస్థితిని మరచి తనను దేహముగా భావించుకొనుచున్నాడు. గుణవికారమైన దేహంలో నివసించినప్పటికిని ఆత్మకు ఎటువంటి బంధన సంబంధము లేదు. గుణ ప్రభావముల చేత తాను దేహము అని మనసు అని భ్రమకు లోనవుతున్నది.

సత్వగుణము కూడా మానవునిని తనకు తాను నిర్దేశించుకున్న విషయము అందు తనని బంధించును. ఉదాహరణకు సైన్స్ లాబరేటరీలో పనికి అంకితమైనటువంటి సైంటిస్ట్, పాడైపోయిన ఒక స్టూడియోలో కాన్వాస్ మీద పెయింట్ చేసేటటువంటి చిత్రకారుడు, పేదవాడైనటువంటి ఒక కవి, తన సాధనలో హింసలకు ప్రయాసలకు గురైనటువంటి సాధువు, వీరందరూ తాము ఎంచుకున్న మార్గంలో, లక్ష్యసాధనలో ఆనందమును అనుభవిస్తూ ఉంటారు. కానీ ఆ ఆనందమునకు కట్టుబడి ఉన్నతమైనటువంటి భగవతానుగ్రహ ప్రాప్తికి, పరమాత్ముని చేరుకోవటానికి ప్రయత్నించరు.

తన వాంఛనులను నెరవేర్చుకునే నిమిత్తమై ప్రయత్నించు మానవుని రజోగుణము బంధించును.

నిజ జ్ఞానమును మరిచి అజ్ఞానముతో ఉన్న మానవుని తమోగుణము బంధించును.

ఈ విధముగా కృష్ణ పరమాత్ముడు త్రిగుణముల యొక్క స్వరూపమును విశదీకరించాడు.

గంగాజలము రంగురంగుల బాటిల్స్ లో నింపినప్పుడు వివిధ రకములుగా కనిపిస్తుంది. కారణం గంగాజలము మారలేదు. బాటిల్స్ యొక్క రంగు మారింది. అదేవిధంగా త్రి గుణముల హెచ్చుతగ్గుల వలన మానవుని స్వభావములో మార్పులు కనిపించును.

గుణాతీతునిగా మారుట ఎట్లు ?

మనలో కలుగు కోరికలను విశ్లేషించే / విచారము చేసు కొనే శక్తిని పెంపొందించుకోవాలి. ఆ విధంగా జాగరుకులై మనల్ని ప్రభావితం చేసే విషయాల మీద దృష్టి సారించినప్పుడు దుష్ప్రభావములకు, అత్యాశలకు లోనవకుండా, ధర్మబద్ధముగా నియంత్రమైన జీవితం గడపగలము.

ఉదాహరణకు ఒక కారులో దీర్ఘ ప్రయాణం చేయ తలపెట్టినప్పుడు, ఆ కారు యొక్క పనితీరు మెకానిజము తెలిసి ఉండాలి. మార్గమధ్యములో ఏదైనా రిపేర్ సంభవించినప్పుడు అనుభవజ్ఞుడైనటువంటి డ్రైవర్ లోపమును గుర్తించి అప్పటికప్పుడే సరి చేస్తాడు. అలాగే యొక్క మనోభావాలను విశ్లేషించుకుంటూ ఎప్పటికప్పుడు సాయి భగవానుని సంతోషపరిచేటువంటి /ఆనందపరిచేటువంటి మంచి ఆలోచనలు, మాటలు, కర్మలు ప్రత్యామ్నాయంగా క్రమబద్ధీకరించాలి.

ఉదాహరణలు – చిన్నారులకు
  1. ఉదయమున లేచి బాలవికాస్ క్లాస్ కు తయారయ్యి వెళ్లే సమయం అయింది. కానీ ఇంకా నిద్ర పోవాలని అనిపిస్తోంది. రోజూ బాలవికాస్ కి వెళ్లాలా అని మనస్సు/ మైండ్ ప్రశ్నిస్తోంది. అప్పుడప్పుడు వెళ్లకుండా ఉండవచ్చు కదా! ఈరోజు వెళ్లను. ఇంకా కథలన్నీ ఇంట్లో ఉండి చదువుకుంటాను etc.,
    ఈ సమయంలో ఏ గుణము నిన్ను ప్రభావితము చేస్తున్నది?
  2. బాలవికాస్ లో ప్రాజెక్ట్ వర్క్ కి ఒక చార్ట్ ప్రిపేర్ చేశావు. అది బాల్ వికాస్ గురువుకు చూపించాలని ఉత్సాహంతో ఉన్నావు. ఫస్ట్ ప్రైజ్ రావాలని బాగా ప్రార్థించావు. ఆ చార్ట్ కి ఇంకా ఇంకా finishing touches ఇస్తూ, ఇంకా మెరుగులు దిద్దుతూ అందరికన్నా ముందు వెళ్లి బాలివికాస్ గురువుకు చూపించాలని అనుకున్నావు. ప్రైజ్ వస్తుందని ఎంతో ఉత్తేజంగా ఉత్సాహంగా ఉన్నావు. ఫ్రెండ్స్ అందరికి చూపించాలని ,ఇంకా ఆ ప్రైజ్ మనీ తో ఏం చేయాలో కూడా ప్లాన్ వేశావు. ఈ సమయంలో ఏ గుణము నిన్ను ప్రభావితము చేస్తున్నది?
  3. బాలవికాస్ లో ప్రాజెక్ట్ వర్క్ కి ఒక చార్ట్ ప్రిపేర్ చేశావు. మూడు రోజుల ముందే సిద్ధం చేశావు. నీ యొక్క బెస్ట్ డ్రాయింగ్ చేశావు. ఇక దాని గురించి ఆలోచించుటలేదు. ఆ చార్ట్ ద్వారా అనుకున్న విషయము చక్కగా వ్యక్తమై, స్వామికి సంతోషము కలగాలని కోరుకున్నావు. ప్రశాంతంగా బాల్ వికాస్ క్లాస్ కి వెళ్లి అందరూ చేసిన charts చూసి ప్రశంసించి, ఎవరికో ఒకరికి తప్పకుండా బహుమానము వస్తుంది అని ఆశించావు. ఈ సమయంలో ఏ గుణము నిన్ను ప్రభావితము చేస్తున్నది?
కథ:
ముగ్గురు సోదరులు – విభీషణుడు, రావణుడు, కుంభకర్ణుడు

లంకను పాలించు రాక్షస రాజు రావణుడు. నాలుగు వేదములు, 6 శాస్త్రములలో పారంగతుడు. రావణుని పది తలలు దీనినే సూచిస్తాయి. కానీ అరిషడ్వర్గములైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములతో నిండి ఉన్నవాడు.

శ్రీరాముని నుంచి సీతమ్మవారిని అపహరించాడు. వేద శాస్త్రములలో పారంగతుడైనప్పటికీ లేసమంతైనా మనస్సును ఆధీనంలో ఉంచుకొనక, రజోగుణముతో నిండి, రాముని చేతిలో వధింపబడ్డాడు.

విభీషణుడు రావణుని సోదరుడైనప్పటికీ ఇద్దరి గుణములలో ఎంతో వ్యత్యాసము ఉన్నది. విభీషణుడు సత్వగుణ సంపన్నుడు. విభీషణుడు మొదటి నుండి దైవభక్తి కలిగి పవిత్రమైన జీవితమును గడిపేవాడు. సీతను అపహరించుట పాపమని హితవు పలికి అడుగడుగునా రావణుని నివారింప ప్రయత్నించాడు.

చివరకు రాముని శరణు వేడి యుద్ధమున రాముని వైపు నిలిచాడు. హనుమంతుడు లంకలో సీతమ్మ వారిని వెతుకుతూ విభీషణుని గృహము మీదుగా పయనించినప్పుడు ఆ గృహము నుండి వెలువడు పవిత్ర మంత్రోచ్ఛారణను విని, ఆ గృహమునందు ఒక మహనీయుడు నివసిస్తున్నాడు అని అనుకున్నాడు.

మూడవ సోదరుడు కుంభకర్ణుడు నిద్రాలోలుడై సోమరిగా ఉండేవాడు/ జడుడై ఉండేవాడు. ఏడాదిలో/ సంవత్సరములో ఎక్కువ భాగము తిండి, నిద్ర, త్రాగుటలో గడిపేవాడు. సీతను అపహరించి రావణుడు మహాపాతకానికి ఒడిగట్టినా, రావణుని ఎదిరించి, అతనిని వీడే మనోధైర్యము లేక, రావణుని వైపే నిలిచి యుద్ధము చేయుట కర్తవ్యం గా భావించి, భీకరమైన రణములో రాముని చేతిలో హతమైనాడు.

కథ:

ఒక బాటసారి దట్టమైన అడవి గుండా ప్రయాణం చేయుచున్నాడు. హఠాత్తుగా అతని ఎదురుగా ముగ్గురు దొంగలు ప్రత్యక్షమై అతనిని లొంగదీసుకుని సంపదనంతా దోచుకున్నారు. అందులో మొదటివాడు కత్తి దూసి ఆ బాటసారి పని పూర్తి చేద్దాం అన్నాడు. కానీ రెండవ దొంగ దానికి అంగీకరించక, కాళ్లు చేతులు కట్టి బంధించి అతని కర్మకు వదిలేద్దాము అని చెప్పాడు. దానికి మిగతావారు సమ్మతించి ఆ బాటసారిని బంధించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కానీ కొంతసేపటి తర్వాత దయ కలిగినటువంటి మూడవ దొంగ తిరిగి వచ్చి, బాటసారిని బంధముల నుండి తొలగించి అతను తిరిగి వెళ్ళటానికి మార్గమును చూపించాడు.

అంతట కృతజ్ఞతతో బాటసారి తనను ఆదుకున్న ఆ మూడవ దొంగను తనతో పాటు ఇంటికి వచ్చి ఆతిథ్యాన్ని స్వీకరించమని ప్రార్థించాడు. ఆ మూడవ దొంగ తన నిస్సహాయతను వెలిబుచ్చి, ఇంతకుమించి ఏమీ చేయలేనని పలికి ఆ బాటసారితో వెళ్ళుటకు నిరాకరించి, అడవిలోకి అదృశ్యమయ్యాడు.

ఈ ప్రపంచమే అడవి.

త్రిగుణములు ముగ్గురు దొంగలు.

జీవాత్మయే బాటసారి.

దైవిక గుణములు అతని సంపద.

ఆ మూడు గుణములలో – తమోగుణము బాటసారి ని హతము చేయడానికి కారణమైంది /నాశనము చేయటానికి పూనుకున్నది.

రజోగుణము కామ, క్రోధ, లోభములతో ఆ బాటసారిని బంధించినది.

సత్వగుణము ఆ బంధముల, సంకెళ్ల నుండి ఆ బాటసారిని విముక్తి గావించి పరమాత్ముని చేరుకోవటానికి మార్గమును చూపించినది.

2. సీతాదేవి – భ్రాంతి చెందుట / మోసగింపబడుట

రావణుడు నీతి నియమములు లేని దుష్టుడు వంచకుడు. పరి పరి విధముల చెప్పిన హితవు కానీ /మంచి కానీ, భయము కలిగించు వంశ వినాశక దుష్పరిణామములు కానీ రావణుని మనస్సు మార్చలేదు. వంకరగా పెరిగి మహావృక్షము బెండును ఎలా తీయగలము? నలుపుని తెలుపుగా ఎలా మార్చగలం? రావణుని స్థితి కూడా అంతే.

రావణుడు తనకున్న తుచ్చమైన మనోచాంచల్యం వలన రాముని సామాన్య మానవునిగా ఎంచెను. చిట్టచివరకు కూడా, సీతమ్మవారిని కనుక, ఏదో విధంగా నచ్చచెప్పి, ఒప్పించిన రాముడు నిరాశ నిస్పృహకు లోనై యుద్ధము చేయకుండా లంకను వీడి వెడలిపోతాడని తలంచెను. ఒక దుర్మార్గమైన ప్లాన్ వేసి మాంత్రికుడైన విద్యుత్ జిహ్వను పిలిపించి, అతని మంత్రజాలంతో అచ్చు రాముని శిరస్సును పోలిన ఒక మాయా శిరస్సును తయారు చేయించి దాన్ని తీసుకుని! అశోక వనంలో ఉన్నటువంటి సీతమ్మ వారి దగ్గరికి వెళ్లి ఇలా పలికాడు, “సీతా! మొండితనంతో ఎన్నాళ్ళు నిరాకరిస్తావు? చూడు నేనేం చేశానో? నేను రాముని అతని సమస్త వానర సైన్యాన్ని సంహరించాను. నాకు ఎవ్వరూ ఎదురులేరు. వచ్చి నా రాణివి కమ్ము. రాముడు లేడు.ప్రమాణంగా అతని శిరస్సును తీసుకువచ్చాను. చూడు. అతని గురించి విలపించక లంకా రాణిగా సంతసించుము”.

సీతమ్మవారు తన ఎదురుగా ఉంచిన మాయా శిరస్సుని చూసి దిగ్భ్రాంతితో నిశ్చేష్టురాలైనది. మాంత్రికుని మాయాజాలమునకు భ్రాంతి చెంది ” ఓ రామా ! నన్ను ఎలా వీడావు” అని విలపించ సాగింది. ఇంతలో రావణుని భటులు వచ్చి సభకు రావాల్సిందిగా విన్నవించగా, వెంఠనే రావణుడు అశోక వనము వీడి రాజసభకు వెళ్లెను. రావణుడు నిష్క్రమించగానే మాయా శిరస్సు కూడా పొగ రూపంలో అదృశ్యమైంది. మాయా శిరస్సు కల్పితానికి / ఉండటానికి రావణుని యొక్క ఉనికి అవసరము. అది గమనించిన సీత ఆశ్చర్యమునకు లోనైనది. అంతలో శరమ అనే రాక్షసి సీతాదేవికి రావణుడు పన్నిన మాయాజాలమును వివరించి, “సీతా! నీది పవిత్రమైన విశ్వాసము. రాముని ఎదిరించగలిగినవాడు ఈ లోకంలో ఎవరూ లేరు. ఇంత నీచానికి దిగజారిన రావణుడు, రాముని చేతిలో తప్పక మరణిస్తాడు,”.

అని ఊరడించినది. అప్పుడు సీతమ్మ వారి హృదయము తేలికబడి తన దైవమైన శ్రీరాముడు క్షేమంగా ఉండాలని ప్రార్థించినది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *