విషబీజాలు

Print Friendly, PDF & Email
విషబీజాలు

మిథిలా నగరంలో జనక మహారాజుతో వియ్యమంది దశరథుడు తన కుమారులతో, కోడళ్ల తో అయోధ్యకు తిరిగి వచ్చాడు. అయోధ్య లో ఎక్కడ చూచినా ఆనందం వెల్లివిరుస్తున్నది. నలుగురు రాజకుమారులు, ముఖ్యంగా రాముడు అయోధ్య వాసులందరికీ ప్రీతిపాత్రుడైనాడు. అందరి నోళ్లలో రాముడు, సీతల ఈడు జోడు గురించిన ముచ్చట్లు వినిపించసాగాయి.

దశరధుని మనస్సు ఎంతో హాయిగా ఉంది. ఈ విధంగా కాలం గడిచే తరుణంలో దశరథుడు భవిష్యత్తు గురించి ఆలోచించాడు. తనకు వయస్సు మీరుతున్నది. ఎక్కువ కాలం బ్రతకడు. కావున రామునికి పట్టాభిషేకం చేస్తే బాగుంటుందని వశిష్టునితో సంప్రదించాడు. వశిష్ఠుడు కూడా ఈ ఆలోచన సరియైనదే అని చెప్పి అతి త్వరలోనే పట్టాభిషేకానికి ముహూర్తం నిర్ణయించాడు. పట్టాభిషేకానికి అన్ని ఏర్పాట్లు జరగాలని రాజాజ్ఞ అయింది.

ఈ వార్త విన్న పౌరులు మరింత ఆనందంతో ఉత్సవ సన్నాహాలు చేయడానికి ప్రారంభించారు.

కానీ రాణి కైకేయి అంతరంగిక దాసి మంథర ఆలోచనలు వేరేవిధంగా ఉన్నాయి. కైకేయి వద్ద చేరి ఈ విధంగా చెప్పింది. “అమ్మా! రాముడు రాజయితే కౌసల్య రాజమాత అవుతుంది. అప్పుడు నీ గురించి అనుకునే వారే ఉండరు. కాబట్టి భరతునికి పట్టాభిషేకం, రామునికి వనవాసం…. ఈ రెండు వారాలు మీరు మహారాజును కోరుకోండి”.

మొదట కైకేయి కి ఈ మాటలు చాలా బాధ కలిగించాయి. ఆమెకు రాముడు అంటే ఎనలేని వాత్సల్యము. కానీ క్రమంగా ఆమె మనసు మీద మంథర వాక్కుల ప్రభావం పని చెయ్యసాగింది. ఇది గమనించిన మంథర జరగబోయే నాటకానికి సన్నాహాలు సిద్ధం చేసింది. ఆమె చెప్పినట్టు చేయడానికి కైక ఒప్పుకుంది.

దశరథ మహారాజు మహాదానందంలో రాముని పట్టాభిషేక వార్త కైకేయి చెవిన వేద్దామని ఆమె అంతఃపురంలో ప్రవేశించాడు. కానీ ఆయనకు అక్కడ ఎవరు స్వాగతం పలుకలేదు.అంతా నిశబ్దంగా ఉంది. అందరూ ఆయనను చూసి తప్పుకుంటున్నారు. రాణి కైక లోపలి ఒక గదిలో ఒంటరిగా చీకట్లో పడుకుని ఉంది. ఆమె అలంకరణ చేసుకోలేదు. జుట్టు బాగా చిందరవందరగా ఉంది. మాసిన వస్త్రాలు ధరించి వుంది. దశరథునికి ఏమీ అర్థం కాలేదు. తన ప్రియమైన రాణి దగ్గరికి వెళ్లి అనునయించటానికి ప్రయత్నించాడు. “ఆరోగ్యం బాగాలేదా?”అని ప్రశ్నించాడు. కానీ దేనికీ సమాధానం రాలేదు. పైగా ఆయన్ను విదిలించి వేసింది.దశరధునికి ఏమీ తోచలేదు. ఆమెకు దాసుడైపోయాడు. నీ కోరిక ఏదైనా సరే తీరుస్తాను అని మాటిచ్చాడు.

కైక శాంతించింది. నోరు విప్పింది. మహారాజా ఒకప్పుడు మీరు నాకు రెండు వరాలు ఇచ్చారు కదా అవి ఇప్పుడు తీరుస్తారా? అని అడిగింది. “తప్పక తీరుస్తాను. నీ ఆనందం కోసం ఏదైనా చేస్తాను” అని శపథం చేసాడు.

అప్పుడు కైక ఈ విధంగా అడిగింది. “మొదటి వరం ఈ ముహూర్తానికే భరతునికి పట్టాభిషేకం. రెండవది శ్రీరామునికి పదునాలుగేండ్లు వనవాసం”. ఆమె కోరిక లకు దిగ్భ్రాంతి చెందిన దశరథుడు బాధతో మౌనం వహించాడు. వరాలు ఇస్తే రామునితో ఎడబాటు. ఇవ్వకపోతే మాట తప్పడం అవుతుంది. ఏం చేయాలో అర్థం కాక దశరథ మహారాజు కైకతో ఇలా అన్నాడు. “ రాముడు నీకు ఏమి అపకారం చేశాడు. ఏనాడైనా నీ మాట జవదాటాడా? రాముని వదిలి నేను ఒక క్షణం అయినా జీవించలేనని నీకు తెలియదా? మరేదైనా కోరుకో.

అప్పుడు కైక “ఇక్ష్వాకు వంశ రాజులు ఆడిన మాటతప్పరు. భరతుడు రాజు కావాలంటే శ్రీరాముడు అయోధ్యలో ఉండగా సాధ్యపడదు. కనుక శ్రీరాముని పదునాలుగు సంవత్సరాలు వనవాసానికి పంపక తప్పదు” అన్నది.

దశరథుడికి ఏమీ పాలుపోలేదు. కోరికలు వెనక్కి తీసుకోమని కైకేయి ని ఎంతో ప్రాధేయపడి నాడు. కానీ ఆమె చలించలేదు.

దశరథ మహారాజు అయోమయ స్థితిలో పడ్డాడు. ఒకవైపు రాముని పై ప్రేమ. మరొకవైపు మాటకు కట్టుబడి ఉండటం. చివరకు అతని సత్యదీక్షనే గెలిచింది.

“నీ కోరిక తీరుస్తాను. నా రామచంద్రుని తలుచుకుంటూ కళ్లు మూస్తాను” అంటూ ఎనలేని దుఃఖంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్మృతి తప్పాడు. రాత్రి గడిచి పోయింది.

తెల్లవారింది. అయోధ్య వాసులు ఉదయాన్నే ఎదురుచూసిన మంగళ వాయిద్యాలు వినపడక పోవటంతో, ఆశ్చర్యంగా, ఏమైందో తెలియక భయభ్రాంతులయ్యారు. కైకేయి మందిరానికి పిలిపించగా వచ్చిన శ్రీరాముడు అక్కడ తన తండ్రి దశరథ మహారాజు అచేతనుడై యుండుట చూచి “అమ్మా! తండ్రిగారికి ఏమయింది?”అంటూ పిల్లల్ని ప్రశ్నించాడు.

అప్పుడు కైకేయి”నాయనా! నీవొక్కడివే మీ తండ్రిగారి ఆవేదనను తొలగించగలవు” అన్నది. అప్పుడు రాముడు “అమ్మా! అఙ్ఞాపించండి. నా తండ్రి గారి కొరకు ప్రాణాలనైనా త్యాగం చేస్తాను” అన్నాడు. అప్పుడు కైకేయి దశరథుడు తనకిచ్చిన వరాల గురించి చెప్పింది. వాటిని తీర్చడానికి దశరథమహారాజు పడుతున్న ఆవేదనను కూడా వివరించింది.

ఈ మాటలు విన్న శ్రీరాముడు ఏమీ చలించక,ఎంతో ప్రశాంతంగా, గంభీర స్వరంతో ఇలా పలికాడు “అమ్మా! తండ్రి గారి కోరిక తప్పక నెరవేరుతుంది. దాని గురించి చింతించనవసరం లేదు” అంటూ తండ్రిగారి, పినతల్లి గారి పాదాలకు నమస్కరించి అక్కడి నుండి నిష్క్రమించాడు.

నేరుగా తన మాతృమూర్తి కౌసల్యాదేవి మందిరానికి చేరుకున్నాడు. అప్పటికే అక్కడికి సుమిత్ర, సీతాదేవి, లక్ష్మణుడు వచ్చి ఉన్నారు. వారికి ప్రశాంత స్వరంతో జరిగినది తెలిపాడు. కలత చెంద వద్దని వారిని కోరాడు.

కానీ ఈ వార్త విని కౌసల్యాదేవి భరించలేక, స్మృతి కోల్పోయి పడిపోయినది. రాముడు ఆమె పాదాల వద్ద కూర్చుని, ఉపచారం చేసి ఆమెను శాంత స్థితికి తీసుకుని వచ్చాడు. ఎన్నో హితవచనాలను బోధించాడు. లక్ష్మణుడు కైకేయిని నిందించాడు. అప్పుడు శ్రీరాముడు “ఈ విషయంలో మీరు ఎవరిని నిందించడం భావ్యం కాదు అంటూ వారించాడు. తాను మనస్ఫూర్తిగా తన తండ్రి మనోరథాన్ని నెరవేరుస్తున్నాను అని, తెలియజేశాడు. కొంతసేపటి తర్వాత సీతాలక్ష్మణులు శ్రీ రాముడి వెంట వనవాసానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

దశరథుడికి కొంతసేపటికి స్పృహ రాగా, శ్రీ రామునితో పాటు అయోధ్య అంతా తరలి వెళ్లాలని, వనవాసంలో రాముడికి తగిన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేయాలని ఆజ్ఞాపించాడు. రాముడు వినయంతో తిరస్కరించి, వనవాసానికి బయల్దేరాడు.

నార వస్త్రాలు ధరించిన సీతారామ లక్ష్మణులను చూచిన దశరథుడు, కౌసల్య, సుమిత్రలకు దుఃఖం ఆగలేదు. మహారాజు మంత్రి అయిన సుమంత్రుడు రథాన్ని సిద్ధం చేశాడు. ప్రజల హాహాకారముల మధ్య, అంతఃపుర జనుల శోక ధ్వనుల మధ్య సీతారామలక్ష్మణులు కూర్చున్న రథాన్ని సుమంతుడు నెమ్మదిగా అరణ్య మార్గం వైపు నడిపించాడు.

అంతఃపురంలో ఎక్కడ చూచినా శోకమే తాండవిస్తున్నది. కౌసల్య దశరథుని నిందించగా, దశరథుడు తన జీవితంలో జరిగిన ఒక సంఘటన గుర్తుకు రాగా, కౌసల్యకు వివరించాడు.

దశరథుడు ధనుర్విద్యలో ఆరితేరిన వాడు. శబ్ద భేది విద్యను కూడా సాధించినవాడు. కంటికి కనిపించకపోయినా శబ్దం వచ్చిన వైపు లక్ష్యాన్ని కొట్టడంలో సమర్ధుడు. ఒకనాడు దశరథుడు అడవిలో వేటాడుతుండగా, హఠాత్తుగా అతనికి ఒక ఏనుగు నీరు తాగుతున్నట్లుగా గుడగుడ మనే శబ్దము వినవచ్చింది. ఆ శబ్దం వచ్చిన వైపు గురి చూసి బాణం వదిలాడు. వెంటనే ఒక ఆర్తనాదం వినవచ్చింది. “అమ్మా! నాన్నా! నేను చనిపోతున్నాను” అని. దశరథునికి కాళ్ళు చేతులు ఆడలేదు. ఆ శబ్దం వచ్చిన చోటికి పరిగెత్తాడు. ఒక బ్రాహ్మణ యువకుడు మడుగు ఒడ్డున విలవిల తన్నుకుంటున్నాడు. దశరధుని చూచి అతను “రాజా! వృద్ధులైన అంధులైన తల్లిదండ్రుల కొరకు నీళ్ళు ముంచుకుంటున్న, ఏ పాపం ఎరుగని నాపై ఈ బాణాన్ని ఎందుకు ప్రయోగించావు? వారు నా వియోగం భరించలేరు. అయితే నాకు మీరు ఒక సహాయం చేయండి. వారికి మీరు ఈ నీటిని అందజేయండి” అంటూ ప్రాణాలను వదిలాడు.

వెంటనే దశరథుడు ఆ వృద్ధ దంపతులు ఉన్న స్థలానికి చేరుకున్నాడు. మీ పుత్రుని వధించిన పాపాత్ముడిని నేనే. చాలా ఘోరం అపరాధం చేసాను అంటూ వారిని క్షమించమని ప్రార్థించాడు. “తెలిసో, తెలియకో మాకు పుత్ర శోకాన్ని కలిగించావు. నీవు కూడా వృద్ధాప్యంలో నీ కుమారుడి వియోగం అనుభవిస్తావు” అంటూ కన్నుమూశారు.

ఈ విషయం కౌసల్యకు చెప్పి దశరథుడు “నాడు చేసిన పాప ఫలితాన్ని, ఈనాడు అనుభవిస్తున్నాను” అన్నాడు.

ప్రశ్నలు:
  1. దశరథుడు కైకేయి మాటను ఎందుకు జవదాటలేక పోయాడు?
  2. రాముని పితృ వాక్య పరిపాలన గురించి సంగ్రహంగా వివరించుము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: