మానవ సేవ – మాధవ సేవ
మానవ సేవ – మాధవ సేవ
ఒకసారి ఒక క్రైస్తవ ఆచార్యుడు జెరూసలెంకు వచ్చాడు. అతని దర్శనం కొరకు ప్రజలు తండోపతండాలుగా వెళ్తున్నారు. జెరూసలెంకు సమీపంలోని ఒక కుగ్రామంలో ఒక వృద్ధురాలు ఉన్నది. ఆమె కర్ర సహాయంతో కూడా నడవలేని స్థితిలో వుంది.
ప్రతి రోజు ఆమె తన ఇంటి వాకిట్లో కూర్చొని వానరదండులా జెరూసలెంకు బయలుదేరి వెళుతున్న గుంపును చూస్తూవుండేది. ఒకరోజున “ఇంతమంది వెళ్తున్నారు, నేను కూడా వెళ్ళి ఆయన ఆశీస్సులు అందుకొంటే బాగుండును” అని తలచింది. ఒకవేళ నడవలేక దారిలో మరణిస్తే స్వర్గాన్ని చేరుకోవడం తథ్యమని నిర్ణయించుకుంది.
ఆ మరునాడు తెల్లవారకుండానే ఇల్లు విడిచి బయలుదేరింది. అడుగు వేస్తే కాళ్ళు తడబడుతున్నాయి. అయినా తప్పటడుగులు వేస్తూనేవుంది. చేతిలో కర్రను, హృదయంలో భగవంతుణ్ణి స్థిరంగా నిలుపుకొని నడుస్తూవుంది. ఎట్లాగో శ్రమపడి సగం దూరం నడిచింది. ఎండ తీక్షణంగా వున్నందువలన అలసిపోయి ఆయాస పడుతూంది. కళ్ళు తిరుగుతున్నాయి. సహాయం చెయ్యడానికి ఎవ్వరూ లేరు. అక్కడ ఒక పెద్దబండ కనిపించింది. ఎట్లాగో శ్రమపడి బండను సమీపించి, దానిమీద ఎక్కి కూర్చొని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నది.
అలా కూర్చొని ఉండగా కొంతమంది బాలబాలికలు ఆ దారిని వెళ్ళుతూ కనిపించారు. వారిని పిలిచి, తనని వారితోపాటు జెరూసలెం తీసుకెళ్ళమని బ్రతిమాలింది. కొంతమంది ఆమె వంక కోపంగా చూశారు. కొంతమంది ఆశ్చర్యంగా విని ఊరుకున్నారు. మరికొందరు “అవ్వా! మిమ్మల్ని జెరూసలెం తీసుకుని వెళ్ళటం కన్నా, స్మశానానికి తీసుకొని వెళ్ళడం తేలిక”, అని హేళన చేశారు. అదివిన్న అక్కడి వారంతా పక్కున నవ్వి ఎవరి త్రోవన వారు వెళ్ళిపోయారు.
ఆమె దీనంగా అక్కడే కూర్చొని వుంది. కొంతసేపటికి ఆ దారిన ఒక మత ప్రచారకుడు వెళ్తున్నాడు. అతడు చాలా బలిష్టంగా వున్నాడు. వృద్ధురాలు అతన్ని పిలిచి తనను కూడా జెరూసలెంకు తీసుకొని వెళ్ళమని ప్రాధేయపడి అడిగింది. అతనికి జాలి కలిగింది. వెంటనే అతడు ఆమెను తన భుజాల మీద ఎక్కించుకొని భగవంతుని ప్రార్థించుకుంటూ బయలుదేరాడు.
అందరూ ఆ పవిత్రమైన ప్రదేశాన్ని చేరారు. అక్కడ ఒక ఎత్తైన వేదికను నిర్మించి దానిమీద ఆ మహాపురుషుణ్ణి కూర్చోబెట్టారు. ఆ వేదిక చుట్టూ వేలాదిమంది జన సమూహం వున్నారు. పెద్దవాళ్ళందరూ తోసుకొని ముందుకు వెళ్ళటం చేత వెనక వుండిపోయిన చిన్న వారికి అక్కడ ఏమీ కనబడటం లేదు. అందుచేత వాళ్ళల్లో వాళ్లు, ఒకళ్ళ భుజాలమీద మరొకరు ఎక్కి ఒక్కొక్కరూ, కాసేపు ఆ పవిత్రమూర్తిని చూస్తున్నారు. అట్లా భుజంమీద ఎక్కి చూస్తున్న ఒక కుర్రవానికి మతిచలించినంత పనయ్యింది. ఆ మహాపురుషుడు ఉండవలసిన స్థానంలో, ముడతలు పడిన శరీరం, పండిపోయిన జుట్టు ఉన్న ఒక వృద్ధురాలు కనిపించింది. ఆమె ఎవరో కాదు. తాను దారిలో స్మశానానికి చేరుస్తానని హేళన చేసిన ఆ పండుముసలి. పైగా తనవైపు చూస్తూ నవ్వుతూ వున్నట్లుగా కనిపించింది. ఆశ్చర్యంతో పెద్దగా అరిచాడు. “నాకీ సాధు పుంగవుడు కనిపించడం లేదు. కాని అతని స్థానంలో మనం దారిలో వదలివచ్చిన వృద్ధురాలు కనిపిస్తున్నది” అని అన్నాడు. ఆ బృందం మొత్తం ఒకరి వీపుమీద మరొకరెక్కి, ఒక్కొక్కరూ చూశారు. అందరికీ అదే దృశ్యం కనిపించింది. నవ్వుతూ వారివంక చూస్తున్న ఆ వృద్ధురాలే అందరికీ కనిపించింది.
ఆ అవ్వను భుజంమీద తీసుకొని వచ్చిన మత ప్రచారకునికి మాత్రం ఒక అద్భుతం కనిపించింది. వేదిక మీదవున్న సాధుపుంగవుడు తన వంకే చూసి చేయెత్తి ఆశీర్వదించి నట్లనిపించింది. యింకా ఆ వృద్ధురాలికి బదులు ఆ సాధువే తన భుజాల మీద కూర్చొని వున్నట్లు మరియూ అతనిని ఎంతో కొనియాడుతూ ఆశీర్వదించి నట్లనిపించింది. అతడు అమితమైన ఆనందాన్ని అనుభవించాడు. ఎంతో మనశ్శాంతిని పొందాడు. అంతటి ఆనందాన్ని అందుకొన్న ఆ మత ప్రచారకుడే ఆ సంవత్సరం జెరూసలెం చేరిన యాత్రికులందరిలో అదృష్టవంతుడు. ఎందుచేతనంటే అతడు ఆ భగవంతుణ్ణి ఏవిధంగా భక్తితో ప్రేమిస్తున్నాడో అదే విధంగా ఆయన సృష్టించిన అన్ని జీవులను కూడా ఆదరించాడు కనుక.
ప్రశ్నలు
- మత ప్రచారకుడెందుకు ఆ వృద్ధురాలిని జెరూసలెం తీసుకొని వెళ్ళాడు? అందువల్ల అతనికి కలిగిన లాభమేమి ?
- ఆ వృద్ధురాలిని జెరూసలెం తీసుకొని వెళ్ళడానికి యువకులెందుకు తిరస్కరించారు? దానివల్ల వారికి ఎటువంటి అనుభవం కలిగింది ?
- నీవే ఆ యువకులలో ఒకడివైతే నీవేమి చేస్తావు ?