మానవుని సేవించుట, దేవుని సేవించుటయే
మానవుని సేవించుట, దేవుని సేవించుటయే
అబ్రహమ్ లింకన్ 1861వ సంవత్సరంలో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నుకొనబడ్డాడు. దయార్ద్రహృదయుడు, శాంత స్వభావుడు, సత్యసంధుడు, న్యాయబుద్ధి గల ప్రఖ్యాతి గాంచిన మహాపురుషుడు.
చిన్ననాటినుండి అబ్రహాం ఆర్తులను, దీనులను ఆదరించి వారికి తోచిన సేవ చేసేవాడు. అధ్యక్షుడయిన తరువాత కూడా మునుపటివలెనే యితరులకు సహాయం చేస్తూ వుండేవాడు. ఒకరోజు సాయంత్రం వాహ్యాళికని(walk) స్నేహితులతో కలసి బయటకు వెళ్ళాడు. ఇంటికి తిరిగి వస్తుంటే తన వెనుకనుండి ఒక గుఱ్ఱం రావడం చూచాడు. దానికి జీను అమర్చబడి వుందిగానీ, దానిపై రౌతు లేడు. అబ్రహాం అతని స్నేహితులకు ఆ గుఱ్ఱాన్ని చూపించి, “ఇది ఎవరిదో మీకు తెలుసా? ఇది ఎందుకిలా తిరుగుతుందో? అని ప్రశ్నించాడు. అది వారికి తెలిసిన ఒక వ్యక్తిదని, అతనొక త్రాగుబోతని, అతను ఆ గుఱ్ఱం మీద నుండి జారి పడిపోయి వుంటాడని చెప్పారు.
అప్పుడు అబ్రహం “మనమంతా వెళ్ళి వెతుకుదాం. పాపం! అతడు ఎక్కడ పడిపోయాడో” అని అన్నాడు. “మనకెందుకు ఈ బెడద? అయినా చీకటి పడుతూ ఉంది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. త్వరగా ఇంటికి పోదాం. ఆ తాగుబోతుకు బుద్ధి రావలసిందే” అంటూ వారు ముందుకు పోసాగారు. మీరు నడుస్తూ వుండండి. అతను కింద పడిపోయివుంటే బలమైన గాయాలు తగిలివుంటాయి. అతనికి కొంత సహాయం అవసరం” అని వెనక్కి తిరిగి వెతుక్కుంటూ వెళ్ళాడు. అతని మిత్రులు ఇంటికి వెళితే, యీయనేమో ఆ దురదృష్టవంతుని కోసం గాలిస్తున్నాడు. కొంత దూరం నడిచేసరికి త్రాగి, స్పృహతప్పి రోడ్డుమీద పడిపున్న ఒక వ్యక్తి కనిపించాడు.
అబ్రహాం అతన్ని కొంచెం స్పృహలోనికి తీసుకొని రావడాకి ప్రయత్నించి,అతి కష్టంమీద అతన్ని తన యింటికి తీసుకొని వెళ్ళాడు. ఒక తాగుబోతును యింటికి తీసుకొని వచ్చాడని అతని యింట్లోని వారంతా అబ్రహాంపై ఆగ్రహించారు. వారు తీవ్రంగా మాట్లాడినా పట్టించుకోకుండా “చూడండీ! అతను త్రాగుబోతేకావచ్చు, కానీ అతను కూడ మనలాగే మనిషి. అతనికి సహాయంచేయడం మనకర్తవ్యం” అని అనునయంగా చెప్పాడు. అతనికి స్నానంచేయించి, తెలివి వచ్చిన తర్వాత అతనికి భోజనం పెట్టి యింటికి పంపించాడు.
ప్రేమతో తోటి మానవునకు సేవ చేయటం మాధవునకు సేవ చేసినట్టే అని అబ్రహం దృఢ విశ్వాసం. అమెరికా వారంతా నీగ్రోలను బానిసలుగా చూడటం అబ్రహం సహించలేకపోయాడు. అందుకోసం అతను తన స్వదేశీయులతో పోరాడి చివరకు విజయాన్ని సాధించాడు. అందుచేతనే నీగ్రోలే కాకుండా చాలా మంది శ్వేత జాతీయులైన అమెరికా వారు కూడా “పరలోకమున భగవంతుడు, ఈ లోకమున అబ్రహం లింకన్, ఈ ఇరువురు మాకు సంరక్షకులు”
ప్రశ్నలు:
- నీవు ఎప్పుడైనా ఆపదలో ఉన్నవారికి సహాయపడి సేవ చేసావా? ఏ విధంగా సేవ చేశావు? అందులో నీ అనుభవం ఏమిటి?
- వారి దేశస్థులు అబ్రహంలింకన్ ను అంతగా ఎందుకు ప్రేమించేవారు?
- సాటివారికి దయతో సహాయం చేసే గొప్ప వ్యక్తి ఇంకెవరైనా మీకు తెలుసా? అతని గురించి వ్రాయండి?