సరళహృదయులు – నిరాడంబరులు
సరళహృదయులు- నిరాడంబరులు
అందంగా కుట్టించుకొన్న ఖరీదైన దుస్తులు ధరించినంతమాత్రాన గౌరవం లభిస్తుందా? నాణ్యమైన బట్టలు వేసుకొని వంటినిండా బంగారం పెట్టుకొని, విలాసవస్తువులు తగిలించుకున్నంత మాత్రాన సంఘంలో గౌరవం పెరుగుతుందని భావించేవారు అవివేకులనే చెప్పాలి.
అయితే ప్రతి ఒక్కడూ చక్కగా ఉతికి, యిస్త్రీ చేయించి చూపరులకంటికి ఇంపైన బట్టలు తప్పక కట్టుకొనవలసిందే. కాని ఖరీదైన జలతారు వస్త్రాలు ధరిస్తేనే సంఘంలో గౌరవం లభిస్తుందని భావించడం మాత్రం పొరపాటు. నిజానికి విలువైన వస్తువులు, వస్త్రాలు కొనుక్కుని ధనం అధికంగా వ్యయం చేసేకంటే, దానిని మరెవ్వరికైనా ఏదో విధంగా సహాయపడడానికి ఉపయోగించడం మంచిది.
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మహాపురుషులందరూ వినమ్ర స్వభావులై నిరాడంబరమైన దేశీయ దుస్తులు ధరించి జీవించిన వారే. ఆ నిరాడంబరత వారి నంతటి గొప్పవారినగా తయారు చేసిందని చెప్పక తప్పదు. ఇందుకు మనము రెండు ఉదాహరణలు తీసుకొనవచ్చు.
1. మైఖేల్ ఫెరడే, ప్రపంచంలో ప్రప్రధమంగా “డైనమో” కనిపెట్టిన ప్రఖ్యాత శాస్త్రవేత్త. అతను కనిపెట్టిన డైనమో నుండే మనకు ఈనాడు ఇళ్ళల్లో విద్యుత్ కాంతి, మరలకు, కర్మాగారాలకు శక్తి వస్తున్నది. అతనెప్పుడూ తన గొప్పతనాన్ని ప్రదర్శించలేదు. అతను అంతటి విజ్ఞాన సంపన్నుడని అతనిని చూచిన ఎవ్వరూ అనుకొనేవారుకారు. ఎందుచేతనంటే అతనెప్పుడు చాలా వినయంగా ప్రవర్తించేవాడు. నిరాడంబరంగా జీవించేవాడు.
ఒకానొకప్పుడు ఇంగ్లాండులోని ప్రభుత్వ టంకశాల(Mint) అధికారి ఒకరు అతనిని కలుసుకొనడానికి “రాయల్ సొసైటీ ఆఫ్ సైన్సు”కు (శాస్త్ర వేత్తల సంఘానికి) వచ్చాడు. ఫెరడే పరిశోధనలు సలిపే పెద్ద గదిలోకి వెళ్ళాడు. ఆ అధికారి ప్రవేశించేటప్పటికి ఆ గదిలో ఊదారంగు నిక్కరు, తెల్లటి చొక్కా ధరించిన ఒక వయసు మళ్ళినవాడు ఒక పాత్రలో ఖాళీసీసాలు కడుగుతున్నాడు. అతనిని చూచీ చూడగానే అధికారి “నీవు ఇక్కడి పరిచారకుడివా? అని అడిగాడు. హోదాను ప్రకటించు వస్త్రాలు ధరించిన ఆ అధికారిని చూస్తూ, “అవును” అన్నాడా వృద్ధుడు.
అధికారి: “నీవెంతకాలం నుంచి ఇక్కడ పనిచేస్తున్నా వు?”.
వృద్ధుడు: “నాలుగు సంవత్సరాల నుంచి”.
అధికారి: “వీరిస్తున్న జీతం నీకు సరిపోతున్నదా?”
వృద్ధుడు: (చిరునవ్వు నవ్వుతూ) “సంతోషంగా సరిపెట్టుకుంటున్నాను”.
ఆ సమాధానం ఆ అధికారికి కొంత ఆశ్చర్యం కలిగించింది. వెంటనే “నీ పేరేమి?’ అని అడిగాడు. “మైఖేలు ఫెరడే అంటారు.” అన్నాడు ఆ వృద్ధుడు. పేరు వినగానే కంగారు పడుతూ ఆ అధికారి తాను చేసిన పొరపాటుకు క్షమించమని అనేక విధాల వేడుకున్నాడు. ఫెరడే తన సహజ ఉదారతతో అధికారిని ఆదరించి ప్రేమతో పలుకరించి, అతడు వచ్చిన పని చూసి పంపించి వేశాడు.
ఆ అధికారి హృదయంలో ఆ సన్నివేశం చిరస్థాయిగా ఉండి పోయింది. అది జ్ఞాపకం వచ్చినపుడల్లా “మైఖేల్ ఎంతటి నిరాడంబరజీవి! అసలు అతను తన నిరాడంబరత వల్లనే అంత గొప్పవాడై ఉంటాడు” అని అనుకునేవాడు.
2. మహాత్మాగాంధి:
బ్రిటిష్ వారి పరిపాలన నుండి భారతదేశం స్వాతంత్ర్యం సాధించాలని గాంధీమహాత్ముడు జాతీయోద్యమాన్ని నిర్వహించాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా, “మహాత్మాగాంధీకి జై” అనే జయ జయ ధ్వానాలతో ఆదరింపబడేవాడు. ఆయనకు ఎంతో మంది అనుచరులు ఏర్పడ్డారు. అసమాన దేశభక్తి పరాయణుడైన గాంధీ బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా ధైర్యంతో సాగిస్తున్న శాంతి సమరానికి ఆయనను అభినందించాలని రిచర్డ్ క్రేగ్ అనే అమెరికా దేశస్థుడు ఆ రోజు ఉదయమే సబర్మతీ ఆశ్రమానికి వచ్చాడు. అప్పటికి ఆశ్రమ కార్యాలయం ఇంకా తెరవలేదు. అక్కడ ఉన్న ఒకాయనను గాంధీగారు ఎక్కడ ఉంటారని క్రెగ్ అడిగాడు. గాంధీగారు భోజనశాలలో ఉన్నారని చెప్పారు. సందేహిస్తూనే క్రెగ్ “నేను అక్కడికి వెళ్ళి చూడవచ్చునా?” అని అడిగాడు. “నిరభ్యంతరంగా వెళ్ళవచ్చు. అక్కడ ఆయన ఉన్నారు.” అన్నాడు.
గాంధీగారు ఒకవేళ ఆహారం తీసుకుంటున్నారేమో, అటువంటప్పుడాయనను ఇబ్బంది పెట్టవలసివస్తుందేమో అని సంకోచంతో మెల్లమెల్లగా అడుగులు వేసుకొంటూ బయలుదేరాడు. కానీ అతను వెళ్ళి చూసేసరికి అంతటి ధీశాలి, స్వాతంత్ర్య సమరయోధుడు, నేలమీద కూర్చొని కూరగాయల తొడిమెలు వలుస్తూ ఉన్నాడు. ఆయన మోకాలు వరకూ వచ్చే చిన్న ధోవతి ధరించి, చిన్న శాలువాకప్పుకున్నాడు. అంతదూరంలో ఉన్న క్రెగ్ ని చూసి “దయచేయండి” అని ఆహ్వానించి “నేను ఇటువంటి చిన్నచిన్న పనులు చేస్తుంటే మీకేమీ అభ్యంతరము ఉండదనుకుంటాను” అన్నారు గాంధీజీ.
సాధారణ వ్యక్తిలాగా ఆయన తొడిమెలు వలుస్తూ అంత సరళంగా మాట్లాడుతూ ఉంటే రిచర్డ్ క్రేగ్ తన్నుతానే నమ్మలేకపోయాడు. “రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడిస్తున్నది ఇతనే నా?” అని తనలో తాను అనుకొని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. గాంధీజీ నిరాడంబరత, వినమ్రత అతన్ని ఎంతగానో ఆకర్షించాయి. వెంటనే ఆయన కూడా ప్రక్కన కూర్చొని తొడిమెలు తీయడం ప్రారంభించాడు. నిశితంగా ఆలోచిస్తే తోటిమానవుల కెనలేని సేవచేస్తూ ప్రపంచ శాంతికై పాటుపడ్డ మహానుభావులందరూ అంతటి నిరాడంబజీవులే! నిష్కపట హృదయులే! అన్న విషయం తెలియగలదు.
ప్రశ్నలు
- ఖరీదైన దుస్తులు- సామాన్యమైన శుభ్రమైన దుస్తులు గురించి నీ మాటలలో వ్రాయుము?
- ఈ రెండు కథలనుండి నీవు నేర్చుకున్నదేమి?
- ఆనందంగా జీవించగలిగే వారెవరు? సరళ సంభాషణ, వినయ ప్రవర్తన గలవారా? లేక గర్వంతో దర్పంతో ఆడంబరంగా జీవించేవారా? కారణాలను వివరింపుము.