దయానంద సరస్వతి

Print Friendly, PDF & Email
దయానంద సరస్వతి

కథీయవారు (గుజరాతు) రాష్ట్రంలో, పూర్వపు మోర్వి సంస్థానములో, తంకార అనే పట్టణంలో కర్షన్ లాల్ జీ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. 1825 అతనికి కుమారుడు జన్మించాడు. అతని పేరు మూల్ శంకర్. ఆ బాలుని 8వ ఏట ఉపనయనం చేశారు. సంధ్యావందనం, గాయత్రీ మంత్రము నేర్చుకున్నాడు. మూల్ శంకర్ సూక్ష బుద్ధి కలవాడు. తన 14వ ఏటనే వేదాలలో చాలాభాగం కంఠస్థం చేశాడు. లాల్ జీ వంశం శైవులు. అందుకని తన కుమారునికి కూడా శైవ మతంలోని అంశాలు నేర్పాడు. శివ లింగార్చన ఉపదేశించాడు. 14 ఏళ్ళు వచ్చేసరికి మూల్ శంకర్ శైవమతంలోని సారాన్ని గ్రహించాడు.

శివరాత్రి తెల్లవారింది. దేవాలయంలో పూజలు ప్రారంభించబడ్డాయి. మూల్ శంకర్ తండ్రి పూజచేసి, జాగరణ చేయడానికి సన్నద్ధుడై అక్కడకు చేరుకున్నాడు. పిల్లలందరు నిద్ర పోతున్నారు కాని మూలశంకర్ మాత్రం మేలుకొని ఉన్నాడు. అంతా నిశ్శబ్దంగా ఉంది. అప్పుడు ఒక్క ఎలుకవచ్చి, నైవేద్యం పెట్టిన మిఠాయిలు తింటూ లింగం విూద ప్రాకి అపవిత్రం చేయడం శంకర్ చూచాడు. అతనికి ఒక వింత ఆలోచన వచ్చింది. “ఈ కైలాసాధిపతి పురాణాలలో చెప్పినట్లు, విశ్వమంతా పరిభ్రమిస్తాడు, భుజిస్తాడు, నిద్రిస్తాడు, త్రిశూలం ధరిస్తాడు. కాని ఈ చిన్న జంతువు నుండి తనను కాపాడు కొనలేక పోతున్నాడు. ఎందుకు?”

తన సందేహాన్ని పెద్దలముందు పెట్టాడు. కాని ఎవ్వరు సరియైన సమాధానం చెప్పలేకపోయారు. ఈ సంఘటన మూల్ శంకర్ జీవితాన్నే మార్చివేసింది. ఈ లింగము, ఈశ్వరుడు ఒక్కడే అన్న విషయం అతడు నమ్మలేకపోతున్నాడు.

అది మరువలేని రోజు. శంకర్ 16 ఏళ్ళువాడు. ఒక స్నేహితుని ఇంట్లో ఒక ఉత్సవం చూడడానికి వెళ్ళాడు. ఇంతలో ఎవరో వచ్చి తన సోదరికి కలరా తగిలిందని చెప్పారు. వెంటనే ఇంటికి వచ్చాడు. 4, 5 గంటలలో ఆమె చనిపోయింది. శవం పక్కనే విచలితుడై కూర్చున్నాడు.చావును చూడడం అదే మొదటిసారి అతనికి. అతనికి 18 ఏళ్ళ వయస్సులో, అతని మేనమామ మరణించాడు. ఈ రెండు సంఘటనలు అతనిలో మానవ జీవితాన్ని గురించి చాలా సందేహాలు తెచ్చిపెట్టాయి. అతడు ఆలోచించాడు “చావు ఎటువంటిది ? పుట్టిన ప్రతివాడు చావవలసిందేనా ? దీనినుండి ఎవరికి విముక్తి లేదా ? ఈ చావు బ్రతుకుల చక్రం నుండి బయట పడేమార్గం ఏమిటి ?” అని తీవ్రగా ఆలోచించాడు.

ఈ ప్రపంచం స్థిరమైనది కాదని మూల్ శంకర్ కు తోచింది. నిజంగా ఆలోచిస్తే ఈ జీవితంలో లెక్కజేయ దగినవి ఏవీ లేవు. సంసార విషయాల మీద నైరాగ్యము పుట్టుకొచ్చింది అతనికి. భయంకరమైన మృత్యువు కోరలనుండి ఎలా తప్పించుకోవడం అన్నది పెద్ద సమస్య అయింది. మోక్షం కోసం అంటే ఆత్మ సాక్షాత్కారం కోసం తపించ సాగాడు మూల్ శంకర్.

[Source- Stories for Children – II]

Published by- Sri Sathya Sai Books & Publications Trust, Prashanti Nilayam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *