నాగపంచమి
నాగపంచమి
పాములను దైవంగా భావించి పూజించడం భారతీయుల సంప్రదాయం. ఈ విధంగా పాములను పూజించే పర్వదినాన్ని నాగ పంచమి అంటారు. ఇది శ్రావణ శుద్ధ పంచమి రోజు, వర్ష ఋతువులో వస్తుంది.వర్షాకాలంలో చాలామంది పాముకాటుకు గురి అవుతారని, దానిని నివారించుటకై ఈ నాగపూజ చేస్తారని నమ్మకం. ఈ పండుగ విశిష్టతను తెలుపు అనేక పురాణ గాధలు కలవు. ఒక పురాణ కథనం ప్రకారం ఒక రైతు తన భూమిని సాగు చేస్తూ, అనుకోకుండా చిన్న పాములను చంపడం జరిగింది. ఆ పాముల తల్లి బాధతో రైతుపై ప్రతీకారం తీర్చుకొనుటకు అతనిని, అతని కుటుంబ సభ్యులను కాటువేసింది. ఆ సమయంలో ఆ రైతు కుమార్తె భక్తితో నాగులను ప్రార్థిస్తోంది. ఇది చూసిన ఆ తల్లి పాము మనసు ద్రవించి అతని కుటుంబ సభ్యుల శరీరంలో చేరిన విషాన్ని పీల్చి తిరిగి వారిని బ్రతికిస్తుంది. అప్పటినుండి శ్రావణ శుద్ధ పంచమి రోజు నాగుల పంచమి జరుపుకుంటారని ప్రతీతి. నాగ పంచమి రోజున నాగులను పూజించిన వారిని పాములు కాటు వేయమని ప్రజల నమ్మకం.
గరుడ పురాణం ప్రకారం నాగ పంచమి రోజు ఎవరైతే నాగులను పూజిస్తారో వారికి నాగులు హాని చేయవని, వారి జీవితం శుభమయం అవుతుందని ప్రతీతి. అందుకే సృష్టిలోని ప్రతి జీవికి ఆహారాన్ని అందించాలి.
పాములకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని హిందువుల ప్రగాఢ నమ్మకం. అంతేకాక పాము శివుని మెడలో ఆభరణంగా, విష్ణుమూర్తికి శయ్యగా, సుబ్రహ్మణ్యస్వామి అవతారంగా ఉండుటవలన నాగులు అంటే భయం ఉన్నప్పటికీ కూడా దైవంగా భావించి పూజించే ఆచారం భారతదేశంలో హిందువులందరికీవుంది.