నాశనానికి దారి

Print Friendly, PDF & Email
నాశనానికి దారి

The Path of Ruin

లంకాధీశ్వరుడైన దానవ చక్రవర్తి రావణుడు ఇంద్రాది దేవతలను జయించి మహావైభవంగా రాజ్య పాలన చేస్తున్నాడు. అష్టదిక్పాలకులు లంకాపురి ద్వారపాలకులుగా సేవ చేస్తున్నారు.

రావణుని సభలోనికి అకంపనుడు అనే రాక్షసుడు భయంతో వణుకుతూ ప్రవేశించి రావణుని పాదాలపై పడ్డాడు. అంత రావణుడు అతనితో “భయపడకు, ఏంజరిగిందో చెప్పు” అన్నాడు. కొంచెం ధైర్యం చిక్కబట్టుకుని అకంపనుడు ఇలా చెప్పాడు. “రాముడు అనే రాజకుమారుడు భార్య, సోదరులతో దండకారణ్యంలో ఉంటూ శూర్పణఖకు ముక్కు, చెవులూ కోసి ఖర దూషణాదులను సంహరించి, రాక్షస బలాన్ని సమూలంగా నాశనం చేసాడు” అన్నాడు.

రావణుడు దిగ్గున లేచి కోపంతో వణికిపోతూ “వెంటనే వెళ్లి ఆ రాముణ్ణి సంహరిస్తాను.” అని గర్జించాడు. అకంపనుడు “నన్ను మన్నించండి. అది అంత సులభం కాదు. రాముని శక్తి అసామాన్యమైనది. బహుశా మీరు కూడా ఆతని ముందు నిలువ లేరేమో! కాని నేనొకటి మనవి చేస్తాను. రాముని భార్య అపురూప సుందరి. ఆమెను విడిచి రాముడు ఒక క్షణం కూడా గడపలేడు. ఆపైన మీ ఇష్టము” అన్నాడు.
ఈ మాటలు విని రావణుడు ఆలోచనలో పడ్డాడు. మరునాడు ఉదయాన్నే తనకు అత్యంత విశ్వాస పాత్రుడయిన మారీచుడు ఏకాంతంగా నివసిస్తున్న కుటీరానికి వెళ్ళి సీతను అపహరించడానికి తాను చేస్తున్న ప్రయత్నంలో సహాయ పడమని అడిగాడు. కాని ఇంగిత జ్ఞానంగల మారీచుడు “మహా రాజా! మీకు ఎదురు చెప్తున్నానని అనుకోకండి. మన్నించండి. రామునితో విరోధం మంచిదికాదు. అది మీ వంశ పతనానికే దారి తీస్తుందని నా అంతరాత్మ హెచ్చరిస్తున్నది. దయచేసి ఈ ప్రయత్నం మానుకోండి. రాముని శక్తి నాకు తెలుసు. 16 ఏళ్ళ బాలుడుగా వున్నప్పుడు రాముడు వదలిన బాణాల వలన నాకు కలిగిన గాయాలు ఇప్పటికి మానలేదు. రాక్షసవంశ నాశనానికి దారితీసే ఏ ప్రయత్నంలో నైనా సరే నేను సహాయ పడను” అన్నాడు. ఇది విని రావణుడు కొంత ఆలోచించి లంకకు వెను తిరిగాడు. మరునాడు సోదరి శూర్పణఖ తెగిన ముక్కు చెవులతో రావణ మందిరానికి వచ్చింది. తాను మానవమాతృలయిన రామలక్ష్మణుల చేతిలో ఏ విధంగా అవమానాలు పొందిందో శోకిస్తూ వివరించింది. “అన్నా! ముక్కు, చెవులూ కోయడంకన్నా, నా అవస్థ చూసి సీత నవ్విన పరిహాసపు నవ్వు నన్ను దహించి వేస్తున్నది. నాకు జరిగిన అవమానానికి నీవు ప్రతీకారం చేయకపోతే, ఇక్కడే నీ ఎదుటనే ప్రాణత్యాగం చేస్తాను” అని బిగ్గరగా రోదించింది. రావణుడు ఆమెను శాంతింప చేసి “ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు?” అని అడిగాడు.

“అన్నా! సీత జగదేక సుందరి. ఆమె నీ వంటి వాని అనంతపురంలో యుండదగినది. ఆమె నీ బంధిఖానాలో బాధపడుతుండగా చూస్తే కానీ నాకు శాంతి లేదు” అన్నది.
రావణుడు “సోదరీ! నీకు జరిగిన అవమానానికి తప్పక ప్రతీకారం తీరుస్తాను. అలా చేయని యెడల నా బలము, శౌర్యము వృధా అని భావిస్తాను” అన్నాడు. ఈ దృఢనిశ్చయంతో రావణుడు మళ్ళీ మారీచుని కుటీరానికి వెళ్ళాడు. మారీచుడు ఏదో కీడు శంకించాడు. రావణుడు తన పన్నాగము వివరించాడు.
మారీచుడు బంగారు వన్నె జింకగా మారి, సీతను ఆకర్షించి రాముని ఆశ్రమం నుంచి దూరం చేయాలి. తర్వాత రాముని కంఠాన్ని అనుకరిస్తూ ఎలుగెత్తి అరిచి లక్ష్మణుణ్ణి ఆశ్రమం నుంచి దూరంగా రప్పించాలి. అప్పుడు సీత ఆశ్రమంలో ఒంటరిదవుతుంది. అప్పుడు తాను వెళ్లి ఆమెను అపహరిస్తాను అని రావణుడు తన పథకాన్ని మారీచునితో వివరించాడు.
ఈ పన్నాగము విని మారీచుడు దిగ్భ్రాంతి చెందాడు. రావణునికి సవినయంగా ఇలా మనవి చేసాడు. “మహారాజా! నా మాట మన్నించండి! సీత జోలికి పోవద్దు. రాముడు మిమ్ములను వదలడు. ఈనాడు రాక్షస కులానికి ఖ్యాతి తెచ్చిన మీరు చేజేతులా కులధ్వంసము చేయవద్దు.” అన్నాడు. కాని రావణుడు పట్టు వదలలేదు. సీతపై కాంక్ష అతని నిర్ణయానికి మరింత బలం చేకూర్చింది. మారీచుని హితో క్తులు అతనికి రుచించలేదు. “మారీచా! నేను చక్రవర్తిని, నీవు సేవకుడవు! ఇది నా ఆజ్ఞ.” ఆంటూ గర్జించాడు. మారీచునికి గత్యంతరము లేదు. ఆఙ్ఞ మీరితే రావణుని చేతిలో చావు తప్పదు. ఆ చావు రాముని చేతిలోనే వస్తే తన జన్మ అయినా తరిస్తుంది” అని ఆలోచించి ‘మీ ఇష్టము’ అన్నాడు. తన పథకం అమలు పరచడానికి రావణ, మారీచులు దండకారణ్యానికి బయలు దేరి వెళ్ళారు.

ప్రశ్నలు:

  1. రామునితో విరోధానికి రావణుని ప్రోత్సహించిన దేది?
  2. మారీచుడు ఏమని హితవు చెప్పాడు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *