ఏకాగ్రత
ఏకాగ్రత
స్వామి వివేకానందుడిని చిన్నతనంలో ‘బిలే’ అని ముద్దుగా పిలిచేవారు. ‘బిలే’ తన మిత్రులతో కలిసి ఆడుకునే ఆటలలో ధ్యానము ఒకటి. పిల్లలందరూ కళ్ళు మూసుకుని ఒకచోట కూర్చొని, తమ యిష్టదైవాన్ని తలుచుకుంటూ వుండేవారు.
ఒక రోజు వారు ఆ విధంగా ఆడుకుంటూ వుండగా అందులో ఒక బాలుడు చిన్న అలికిడి విని కళ్ళు తెరచి చూచాడు. ఒక పాము నెమ్మదిగా ప్రాకుకుంటూ వారివైపే వస్తున్నది. ఆదిచూచిన అతను “పాము, పాము” అని బిగ్గరగా అరిచాడు. బిలబిల మంటూ పిల్లలు అందరూ బయటకు పారిపోయారు. “బిలే! అది చాలా పెద్దపాము, నిన్ను కరుస్తుంది. పరిగెత్తుకునిరా! పరిగెత్తుకునిరా!” అని అందరూ బిగ్గరగా అరిచారు. కానీ ‘బిలే’ కదలలేదు, మెదలలేదు. అసలు ఈ ప్రపంచంలో అతనున్నట్టే లేదు. నిశ్చలంగా కళ్ళు మూసుకొని భగవంతుణ్ణి ధ్యానం చేసుకొంటున్నాడు. అతనికి అక్కడ ఏమి జరుగుతోందో అసలేమీ తెలియదు.
ఆ సర్పము వచ్చి, ఆ వైపుకీ, యీ వైపుకి ప్రాకి వెనక్కు తిరిగి వెళ్ళిపోయింది. ఆ పిల్లల కేకలు విన్న ఆచుట్టు ప్రక్కలవారంతా, ‘బిలే’ తల్లిదండ్రులతో సహా అక్కడికి చేరి ఆ దృశ్యాన్ని చూచి ఆశ్చర్యపోయారు. భగవంతుని యందు తనికి గల నిశ్చలభక్తికి, ఏకాగ్రతాశక్తికి నివ్వెరపోయారు.
ఇంత ఏకాగ్రతాశక్తి వుంది గనుకనే ‘బిలేకు’ తన పాఠాలు ఒకటి రెండు సార్లు చదివేసరికి కంఠస్తం వచ్చేవి. కళాశాలలో కూడా అతనికి మంచి పేరువచ్చింది. బిలే, స్వామి వివేకానందగా మారిన తర్వాత కూడ యీ ఏకాగ్రతా శక్తి అతనికి చాలా ఉపకరించింది.
అమెరికాలోని చికాగో సమావేశానికి ఆయన వెళ్ళినపుడు ఒక నది ఒడ్డుకు షికారుకు బయలుదేరి వెళ్ళాడు. అక్కడ చేరిన పిల్లలు. ఆ నదిలో తేలుతూ కెరటాలకు పైకి, క్రిందకు కదులుతున్న ఆట పక్షులను తుపాకీతో కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అవి అలా కదలడంచేత అందులో ఏ ఒక్కళ్ళూ ఒక్కటి కూడా కొట్టలేక పోయారు.
ఒక్కొక్కళ్ళు ఎన్నోసార్లు ప్రయత్నించినా ఏమీ లాభం లేకపోయిది.ఇదంతా దూరంనుంచి వివేకానందుడు అత్యంత ఆసక్తితో పరిశీలిస్తూనే వున్నాడు.అది చూచిన ఆ పిల్లలు ఆయన్ని పిలిచి “అప్పటి నుంచి మీరు మమ్మల్ని గమనిస్తూనే వున్నారు. మాకంటే మీరు బాగా గురి పెట్టి కొట్టగలరా?” అని వ్యంగ్యంగా అన్నారు. అప్పుడాయన ఒక చిరునవ్వు నవ్వి ‘నేను కూడా ప్రయత్నిస్తాను’ అంటూ తుపాకీ అందుకున్నారు. కాసేపు ఆ పక్షుల మీద ఏకాగ్రతతో గురిపెట్టి చూశారు. వరుసగా పన్నెండు సార్లు పేల్చి, పన్నెండు పక్షులను గురి తప్పకుండా కొట్టారు. ఆయన నైపుణ్యానికి నివ్వెరపోయిన ఆ బాలురు “స్వామీజీ! తుపాకీ పేల్చడంలో మీకు ఇంతకు ముందు అనుభవం లేకపోయినా కూడా అప్పటికప్పుడు ప్రయత్నించి గురి తప్పకుండా ఎలా కొట్ట గలిగారు” అని అడిగారు. వివేకానందుడు ఒక్క నవ్వు నవ్వి “ఇందులో ఒక కిటుకు ఉంది. ఏ పని నీవు చేసినప్పటికీ నీ సర్వశక్తులను కేంద్రీకరించి ఏకాగ్రతతో చేయి. అన్య విషయాల గురించి ఆలోచించకు. నీవు తుపాకీతో కాలుస్తున్నప్పుడు నీవు కొట్టదలచిన వస్తువుమీద నీదృష్టి కేంద్రీకరించు. అప్పుడు నీ గురి తప్పదు. ఏకాగ్రత వల్ల ఎన్నో అద్భుతాలు చేయవచ్చు. నీవు చదువుతున్నప్పుడు కూడ ఆ పాఠం మీదనే నీ మనస్సును లగ్నము చేయి. అప్పుడు నీవు చదివిన ప్రతి అక్షరము నీ హృదయ ఫలకంమీద అచ్చుగుద్దినట్లు అలా ఉండిపోతుంది. చిరస్థాయిగా జ్ఞాపకం వుంటుంది’ అని ఎంతో చక్కగా వారికి ఏకాగ్రత యొక్క విశిష్టతను గురించి చెప్పారు. ఇట్టి ఏకాగ్రతాశక్తి చేతినే స్వామి వివేకానంద నిత్యకల్యాణ కార్యక్రమాలెన్నో విజయవంతంగా నిర్వహించగలిగారు.
ప్రశ్నలు:
- ఏకాగ్రత వల్ల కలుగు ఉపయోగములు ఏమి?
-
- A. నీవు రోడ్డును దాటునప్పుడు
- ఉపాధ్యాయుడు చెప్పే పాఠాన్ని నీవు వింటున్నప్పుడు
- ఇంటి వద్ద నీవు చేయవలసిన పనులు చేస్తున్నప్పుడు
- భజన పాటలు పాడుతున్నప్పుడు
- పరీక్షలకు ముందు చదువుతున్నప్పుడు
- భోజనం చేయునప్పుడు
- సినిమా చూసేటప్పుడు
- క్రికెట్ ఆడేటప్పుడు ఏకాగ్రత చిత్తుడవై లేకపోతే నీకు ఏమి జరుగుతుంది?
- నీ స్వానుభవం లో పరిపూర్ణ ఏకాగ్రతతో చేసిన పని వల్ల పొందిన లాభము మరియు ఏకాగ్రత లేకుండా జరిగిన కార్యం వల్ల వచ్చిన నష్టమును వివరించి వ్రాయుము?